💠 లక్ష సింహ ముఖాలతో... భగభగమండే కేశాలతో.... త్రినేత్రాలతో అవతరించి రాక్షస సంహారం గావించిన ఆదిపరాశక్తి ప్రత్యంగిరా దేవి అని పురాణ ప్రతీతి.
ఉగ్రస్వరూపిణి అయిన ఈ అమ్మవారికి ఆలయాలు అత్యంత అరుదు.
అంతటి అరుదైన ప్రత్యంగిరా ఆలయం తెలంగాణ రాష్ట్ర రాజదాని హైదరాబాద్ లో ఉంది.
💠 శ్రీరాముడు, హనుమంతుడు, ఇంద్రజిత్తు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు వంటి మహనీయులెందరో పూజించిన దేవత ప్రత్యంగిరా దేవి అని పురాణ ప్రతీతి. కాని ఉగ్ర స్వరూపిణి కావడంతో కలికాలంలో ఈ అమ్మవారికి ఆలయం నిర్మించి పూజించేవారే కరువయ్యారు.
💠 ఉత్తరాదిన హిమాలయాల్లోని మానససరోవరం సమీపంలో 'కృత్య' గాను దక్షిణాదిన కుంభకోణం (తమిళనాడు) లోని అయ్యావరే అడవిలో, హోసూర్ ప్రాంతంలో , షోలింగర్ లో, కుంభకోణంలో కూడా నికుంభిలగాను అమ్మవారి
ఆలయాలు ఉన్నాయి.
ఇలా కొన్నిచోట్ల మాత్రమే పూజలందుకుంటోంది ఈ అమ్మవారు.
💠 ములుగు మల్లికార్జునరావు అనే పూజ్యుడు అమ్మవారిపై భక్తితో హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో (రామకృష్ణాపురం రోడ్ నెంబర్ 1, అష్టలక్ష్మీ ఆలయ సమీపంలో) ని కుర్తాళం పీఠంలో ప్రత్యంగిరాదేవిని ప్రతిష్టించారు.
ఆ అమ్మతో పాటు ఆదిపరాశక్తి సాత్విక, రౌద్ర అంశలుగా భావించే కాళి, తార, చిన్నమస్తా, త్రిపుర, భైరవి, భగళాముఖి, దూమావతి, మాతంగి, షోడశి (లలితాత్రిపురసుందరి), కమలాత్మిక(లక్ష్మీదేవి) అమ్మవార్లను ప్రతిష్ఠించారు.
💠 శత్రుసంహారం, దారిద్ర్య నివారణ, మంచి ఆరోగ్యం కోసం ప్రత్యంగిరాదేవిని పూజిస్తారు. శనీశ్వరుడి శంఖం పేరు ప్రత్యంగిరి. ఏలినాటి శని దోషంతో భాదపడేవారు ప్రత్యంగిరా దేవిని పూజిస్తే మంచిదని చెబుతారు పెద్దలు. సంతానం లేనివారు ఈ అమ్మవారిని ఆరాధిస్తే సంతానం కలుగుతుందని ప్రతీతి.
💠 రజోగుణ ప్రధాన దేవత కనుక ప్రత్యంగిరాదేవికి ఎండుమిరపకాయలు, తెల్ల ఆవాలు, నల్ల ఉప్పు, శొంఠి, సమిదల వంటి రాజ ద్రవ్యాలతో అదీ అమావాస్యనాడు ప్రత్యేక అభిషేకాలు హోమాలు నిర్వహిస్తారు.
💠 దుష్ట శిక్షణార్ధం సృష్టి ఆరంభంలో దేవతలకూ దానవులకూ యుద్ధం జరుగుతున్నప్పుడు విష్ణుమూర్తి ఒక రాక్షసుణ్ని సంహరించడానికి తన సుదర్శన చక్రాన్ని సందించాడట. సుదర్శన చక్రం ఆ రాక్షసుడ్ని ఏమి చేయలేక తిరిగి వచ్చిందట.
ఆ సంగతి తెలుసుకుని శివుడు కోపంతో తన త్రిశూలాన్ని ప్రయోగించాడట. ముక్కంటి త్రిశూలం కూడా విఫలమవడంతో విజయగర్వంతో ఆ రాక్షసుడు, శివకేశవుల వెంట పడ్డాడట. దాంతో వారిద్దరు తమకిక ఆదిపరాశకే దిక్కని తలచి ఆ తల్లిని ప్రార్ధించారు. అప్పుడు ఆదిపరాశక్తి లక్ష. సింహముఖాలతో అతి భయంకరంగా ఆవిర్భవించి రాక్షసుడిని అతని సైన్యాన్ని సంహరించిందట.
💠 లోకభీకరంగా వెలసిన అమ్మవారిని చూసి దేవతలంతా భయంతో పారిపోయారని అందుకే ప్రత్యంగిరా దేవికి పూజాధికాలు నిర్వహించే ఆచారం అంతగా లేదని ఐతిహ్యం.
💠 అదర్వణవేదంలోని మంత్రాలతో ఈ అమ్మవారి ప్రస్థావన వస్తుంది కాబట్టి అదర్వణ భద్రకాళి అని శత్రువులకు ఊపిరాడకుండా చేసే శక్తి కనుక నికుంభిల అని... ఇలా ప్రత్యంగిరా దేవికి పేర్లున్నాయి.
దేవికి నరసింహిక అనే పేరు కూడా ఉన్నది ( కాళి సహస్రనామాలలో ఈ పేరు ఉటంకించబడింది)
💠 ప్రత్యంగిరా దేవి ఆరాధన రామాయణకాలానికి ముందు నుంచే ఉంది. శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీకృష్ణుడు, దర్మరాజు, నరకాసురుడు, ఘంటాకర్ణుడు, జరాసందుడు తదితరులు ప్రత్యంగిరాదేవిని అనేక రూపాల్లో పూజించారని పురాణాలు చెబుతున్నాయి.
💠 రావణాసురుని కుమారుడైన ఇంద్రజిత్తు ప్రత్యంగిరాదేవిని 'నికుంబిల' రూపాన పూజించి ఉపాసన చేసేవాడని ఏదైన యుద్దానికి వెళ్ళేముందు ఆ అమ్మవారికి యజ్ఞం చేసి జంతు బలులు ఇచ్చి బయలుదేరేవాడని అందుకే అతనికి అపజయమన్నదే ఉండేది కాదని ప్రతీతి.
రామరావణ యుద్ధం జరిగేటప్పుడు కూడా ఇంద్రజిత్తు యధాప్రకారం ప్రత్యంగిరాదేవి అభయం కోరుతూ ఒక యజ్ఞం మొదలు పెట్టాడట. అప్పుడు విభీషణుడు ఇంద్రజిత్తు యజ్ఞానికి విఘ్నం కలిగిస్తే అతన్ని జయించడం సులువని వానర సేనకు చెప్పాడట. దాంతో వానరులంతా వెళ్లి యాగ మండపాన్ని, యజ్ఞాన్ని ద్వంసం చేశారట. సమయం మించిపోతుండడంతో యజ్ఞాన్ని సగంలోనే ఆపేసి యుద్ధానికి బయలుదేరాడట ఇంద్రజిత్తు. ఆ రోజే లక్ష్మణుడిని ఎదుర్కుని అతని చేతిలో హతమయ్యాడట.
💠 ఘంటాకర్ణుడనే యక్షుడు ఈ అమ్మవారిని 'చంద్రఘంట'(నవదుర్గలలో మూడో అవతారం)రూపాన ఆరాధించి ఆ శక్తిని కర్ణాభరణంగా దరించాడట. ఇలా ఎందరో పురాణపురుషులు పూజించిన దేవత ప్రత్యంగిరా దేవి. ప్రత్యక్షంగానే కాదు... పరోక్షంగానూ ఈ తల్లి తనను పూజించేవారిని కాచి కాపాడుతుందని నమ్మిక.
నిత్యం లలితా సహస్రనామం చదివే వారిని దుష్టగ్రహ పీడల నుంచి కాపాడేది ప్రత్యంగిరా దేవేనని భక్తుల విశ్వాసం.
💠 అథర్వణ వేదానికి మరోపేరు అథర్వాంగీరసం. ఆంగీరస వేదం క్షుద్రవిద్యలు, క్షుద్రశక్తుల ఉపాసనకు (బ్లాక్ మ్యాజిక్) వీలుకల్పిసున్నది. ఈ క్షుద్రవిద్యలను అరికట్టేందుకై వెలసిన దేవి ప్రత్యాంగీర దేవి..
No comments:
Post a Comment