🔅 రాజమండ్రిలో సింహాచలం 🔅
👉 సింహాచల క్షేత్రాన్ని పోలిన ఆలయం రాజమండ్రిలో ఒకటుంది.
ఇక్కడా అన్ని పూజలు అక్కడిలాగానే జరుగుతాయి.
ఉత్సవాలూ ఆ తరహాలోనే నిర్వహిస్తారు.
👉భగవంతుని రూపాలు అనేకం. ఒక్కొక్కరూ ఒక్కో దైవాన్ని నమ్మి కొలుస్తారు.
ఇదే కోవలో రాజమండ్రి నివాసి, ప్రముఖ వ్యాపారి కాలేపు అప్పారావు ఇష్టదైవం సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి.
👉 దేశవిదేశాల్లో ఖ్యాతిగాంచిన సింహాచలం వంటి క్షేత్రమే రాజమండ్రిలో ఆవిర్భవించటం వెనుక ఆయన సంకల్పమే ఉంది.
ఆలయ నిర్మాణం సగంలో ఉండగానే ఆయన మరణించినా అప్పారావు కుమారులు తండ్రి ఆశయాన్ని నెరవేర్చారు.
👉కాలెపు అప్పారావు చిన్నప్పటి నుంచి సింహాచలానికి వెళ్తుండేవారు. నరసింహస్వామి అంటే ఆయనకు విపరీతమైన భక్తి. తన పెద్ద కుమారుడికి ఆ స్వామి కొలువైన క్షేత్రం పేరే పెట్టారు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం... తన ఆరాధ్యదైవమైన సింహాచల నరసింహుడి ఆలయాన్ని పోలిన గుడిని రాజమండ్రిలో నిర్మించాలన్న ఆలోచన వచ్చిందాయనకు.
నాటి నుంచీ తన వ్యాపారంలో వచ్చిన లాభాలలో కొంత భాగాన్ని అందుకోసం దాచి ఉంచడం మొదలుపెట్టారు.
గుడి నిర్మాణానికి అవసరమయ్యే సొమ్ము కూడబెట్టడానికి ఆయనకు ముప్ఫై ఏళ్ల సమయం పట్టింది.
👉ఈ ఆలయం నిర్మాణం కోసం త్రిదండి చినజీయర్ స్వామితో సహా ప్రముఖులైన స్వాములెందరినో ఈ కలిశారాయన. వారందరూ వారించినా అది తన జీవిత సంకల్పమని, ఎలాగైనా ఈ క్షేత్ర నిర్మాణం జరగాలని అప్పారావు పట్టుపట్టి అందుకు ఏర్పాట్లు చేయడం మొదలు పెట్టారు. 1999లో... రాజమండ్రి శివార్లలోని క్వారీ ప్రాంతంలో గుడి కట్టడానికి అనువైన రెండు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు.
👉దురదృష్టవశాత్తూ నిర్మాణం ప్రారంభ సమయంలోనే అప్పారావు మరణించారు. చనిపోయేముందు... నరసింహస్వామికి గుడికట్టాలన్న తన ఆశయాన్ని నెరవేర్చాల్సిందిగా కొడుకుల వద్ద మాట తీసుకున్నారు.
తండ్రికిచ్చిన మాట ప్రకారం ఆలయ నిర్మాణ బాధ్యతను ఆయన కుమారులు సూర్య సింహాచలం, నాగేశ్వరరావు పూర్తి చేశారు.
👉 గుడి కట్టడానికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది. 2002 ఫిబ్రవరి 22న చినజీయర్ స్వామి ఈ ఆలయంలో నరసింహస్వామిని ప్రతిష్ఠించారు.
సింహచల క్షేత్రంలో స్వామివారికి నిత్యపూజలు జరిపించే పురోహితులు వచ్చి ఇక్కడి శ్రీవారికి చందన సమర్పణ చేశారు.
🔅 అన్నీ అక్కడి లాగానే...
👉యానాo దగ్గరలోని కొమరపాలెంకు చెందిన శిల్పకారులు ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్నారు.
సింహాచల క్షేత్రంలో దేవాలయంలో ఎలాంటి శిల్పాలున్నాయో అచ్చం అదే విధంగా ఇక్కడా చెక్కారు.
అదే విధంగా ఆలయ వెనుక భాగంలో గోదాదేవి ఆలయం నిర్మించారు.
అక్కడిలాగానే ప్రతీ నెలా మృగశిర నక్షత్ర రోజున స్వామివారి తిరుకళ్యాణం, ప్రతీ శుక్రవారం అమ్మవారికి సహస్ర కుంకుమార్చన జరుగుతాయి.
👉ఇక నిత్యపూజల విషయానికొస్తే సింహాచల క్షేత్రంలో రోజూ ఎటువంటి కైంకర్యాలు స్వామికి జరుగుతాయో అదే విధంగా ఇక్కడా నిర్వహిస్తారు.
తెల్లవారుజామున 5.30 గంటలకు (పండుగదినాలలో ఉదయం ఐదింటికే) సుప్రభాత సేవ జరుగుతుంది. ఉదయం 7 గంటలకు సర్వదర్శనం, 10 గంటలకు సహస్రనామార్చన, 11 గంటలకు మహానివేదన, 12 గంటలకు కవాట బంధనం ఉంటాయి. సాయంత్రం 5 నుండి గంటల వరకు సర్వదర్శనం. తర్వాత సాయంకాల ఆరాధన, తీర్థ ప్రసాదగోష్ఠి, పవళింపుసేవ, కవాట బంధవం జరుగుతాయి.
🔅 నిజరూప దర్శనం 🔅
👉ఏటా మాఘశుద్ధ దశమినాడు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సింహాచలంలోలాగానే ఇక్కడా నిజరూప దర్శనం ఉంటుంది.
సంవత్సరమంతా చందన అలంకారంలో ఉండి భక్తుల పూజలందుకునే రాజమహేంద్రి అప్పన్న ఈ ఒక్కరోజు మాత్రమే నిజరూపంలో భక్తులకు సాక్షాత్కరిస్తాడు.
సాయంత్రం ఆరు గంటల తర్వాత సహస్ర ఘటాభిషేకం చేసి అనంతరం 108 కేజీల గంధం స్వామివారికి పూస్తారు.
స్వామి నిజరూప దర్శనం రోజు తొలగించిన గంధాన్ని వారం రోజుల తర్వాత భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు.
స్వామి ధరించిన ఈ గంధం కోసం భక్తులు తండోపతండాలుగా వస్తారు.
ఇక... సింహాచలంలోలాగానే ఈ ఆలయ ప్రాగణంలోనూ కప్ప స్తంభం ఉంది.
🔅 ప్రవేశం ఉచితం 🔅
👉 రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయంలో భక్తులకు ప్రవేశం ఉచితం. ఎటువంటి పూజ చేసుకున్నా ఎలాంటి రుసుమూ చెల్లించనవసరం లేదు.
ఆలయంలో ఒక పక్కగా నిత్యహోమశాల, గోశాల ఉంటాయి.
👉 కాలెపు అప్పారావు అతని భార్య నాగేశ్వరి విగ్రహాలు ఆలయం ముందు భాగంలో దర్శనమిస్తాయి...
No comments:
Post a Comment