💠 సర్పవరం తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ రూరల్ ప్రాంతంలో గల ఒక గ్రామీణ ప్రాంతం.
పూర్వం ఇక్కడ అనేక పాములు సంచరించేవట ... అందుకే ఈ ఊరికి ఆ పేరొచ్చిందని చెబుతారు.
💠 సర్పవరం గ్రామంలో ప్రసిద్ధి చెందిన భావనారాయణ స్వామి ఆలయం కలదు.
ఇది కాకినాడ ప్రాంతంలో ఉన్న పురాతన దేవాలయంగా గుర్తించబడింది.
దీని స్థలపురాణం గురించి బ్రహ్మవైవర్త పురాణంలో ప్రస్తావించబడింది.
అగస్త్య ముని సర్పవరం గాధను సనకసనందనాదులకు వివరిస్తాడు. పంచభావనారాయణ క్షేత్రాలలో ఒకటైన పాతాళభైరవాలయం ఇక్కడ ఉన్నది
(పంచ భావనారాయణ క్షేత్రాలు :
బాపట్ల,
పొన్నూరు,
నరసరావుపేట,
భావదేవరపల్లి,
సర్పవరం).
🔔 ఆలయ విశిష్టత :
💠 సర్పవరం ఆలయంనకు ఒక విశిష్టత ఉన్నది.
పూర్వము నారదుడు కొలనులో స్నానం చేసి స్త్రీ రూపాన్ని ధరించాడని ... ఆతరువాత మరళా కొలనులో స్నానం చేసి స్త్రీ రూపాన్ని వదిలించుకున్నాడని చెబుతారు.
నేటికీ ఆ కొలనులు దేవాలయం ప్రాంగణంలో పక్కపక్కనే చూడవచ్చు.
దేవాలయం గోపురం శిల్పకళాశోభితమై ఆహ్లాదకరంగా, ఆశ్చర్యకరంగా కానవస్తుంది.
💠 ఒకనాడు ఇంద్రాది దేవతలు బ్రహ్మతో సమావేశమైనప్పుడు విష్ణు మాయ గురించి ప్రస్తావన వస్తుంది. ఆ మాయ తెలుసుకోవటం కష్టమని అందరూ గ్రహించారు. కానీ అక్కడే ఉన్న నారదుడు తనకు తెలుసుకోవడం సులభమని చెబుతాడు. ఇది తెలుసుకున్న విష్ణుమూర్తి అతనిని ఒక కంట కనిపెడుతూ ఉండేవారు.
💠 నారదుడు ఒకనాడు భూలోక విహారానికి వెళ్ళాడు. సంధ్యా సమయం కావడంతో నీటికొలనులో దిగి స్నానము చేయగా, అతను స్త్రీ రూపాన్ని ధరిస్తాడు.
ఒడ్డున పెట్టిన వీణ, కమండలం కనిపించకుండాపోతాయి.
శక్తులన్నీ నశిస్తాయి.
ఏమిచేయాలో పాలుపోక భూలోకంలోనే ఉండిపోతాడు నారదుడు.
స్త్రీ రూపంలో ఉన్న నారదుడును చూసిన పిఠాపురం నికుంఠ మహారాజు మోజుపడి వివాహం చేసుకుంటాడు.
ఆతరువాత జరిగిన శత్రురాజుల యుద్ధాలలో అతను మరణిస్తాడు.
💠 స్త్రీ రూపంలో ఉన్న నారదుడు అడవుల్లోకి పారిపోతాడు (ఒకేవేళ రాజ్యంలో ఉంటే శత్రురాజుల చేతిలో మరణమో లేదా బందీయో కావాలి కనుక). చాలా రోజులు అడవుల్లో ఇష్టమొచ్చినట్లు తిరుగుతాడు. ఆకలేసి చెట్టు కొమ్మపై ఉన్న ఒక ఫలాన్ని కోయటానికి ప్రయత్నిస్తూ, వ్యయప్రయాసలు పడుతుంటాడు. అప్పుడు అక్కడికి విష్ణుమూర్తి మారువేషంలో వచ్చి, "నీవు కొలనులో స్నానం చేసి వస్తే గానీ పండు కోసి ఇవ్వను" అని చెబుతాడు.
💠 సరే అని కొలనులో వెళ్ళి స్నానం చేయగా, నారదరూపాన్ని ధరిస్తాడు నారదుడు. ఆశ్చర్యంగా ఒడ్డుకు వచ్చిన నారదుడు ఇదంతా విష్ణుమాయ అని గ్రహిస్తాడు. దాంతో శ్రీమహావిష్ణువు అనుగ్రహం కోసం భావనారాయణ స్వామిని ప్రతిష్టించి, వందల ఏళ్ళు తపస్సు చేసాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమై, కోరిక అడగగా ఇక్కడే కొలువుండమని చెబుతాడు నారదుడు.
నారదుని కోరిక వలన భావనారాయణస్వామిగా విష్ణుమూర్తి ఇక్కడే వెలిశాడు.
ఆ తర్వాత రాజ్యలక్ష్మి అమ్మవారిని విష్ణుమూర్తి విగ్రహానికి ఎదురూగా ప్రతిష్టించారు.
💠 దేవాలయం సందర్శన సమయం : ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు మరియు తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
💠 ఉత్సవాలు :
వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున కళ్యాణోత్సవం వైభవంగా జరుపుతారు. శేష, గజ, అశ్వ వాహనాలపై ఊరేగే స్వామివారిని చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు.
💠 వసతి సదుపాయాలు:
సర్పవరంతో పోల్చుకుంటే కాకినాడ లో బస చేయటానికి అనేక హోటళ్ళు, లాడ్జీలు కలవు. బడ్జెట్ ధరలలోనే ఏసీ, నాన్ - ఏసీ గదులు మరియు ఇతర తరగతి గదులు దొరుకుతాయి. కాకినాడ లో కాజా రుచి చూడందే పర్యటన పూర్తికాదు.
💠 భావనారాయణస్వామి ఆలయం చుట్టుప్రక్కల సందర్శించదగినవి :
హోప్ ఐలాండ్, పెద్దాపురం పాండవుల మెట్ట, ద్రాక్షారామం భీమేశ్వర గుడి, పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి గుడి, బిక్కవోలు దేవాలయ సముదాయం, ఉప్పాడ బీచ్, సామర్లకోట లోని కుమారారామ భీమేశ్వర స్వామి దేవస్థానం, కోటిపల్లి కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం మొదలుగునవి సందర్శించవచ్చు.
No comments:
Post a Comment