Adsense

Wednesday, June 15, 2022

శ్రీ అవనాక్షమ్మ అమ్మవారి దేవాలయం, నారాయణవనం (చిత్తూరు జిల్లా)

🔅 శ్రీ అవణాక్షమ్మ ఆలయం చిత్తూరు జిల్లా నారయణవనం సమీపంలో వుంది. శక్తి స్వరూపిణిగా అమ్మవారు పూజలందుకొంటున్నారు . అమ్మవారి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం అధీనంలో ఉంది. 

👉 ఆమ్నాం అంటే వేదమనీ, అక్షి అంటే కన్నులు అని అర్థం. వేదాలను కన్నులుగా ఉన్న అమ్మవారు కాబట్టి... ఆ తల్లికి ఆమ్నాయాక్షి అనే పేరువచ్చింది. ఆ పేరే కాలక్రమంలో అవనాక్షమ్మగా మారింది. 
ఆ అమ్మ ఆలయం చిత్తూరు జిల్లా  నారాయణవనం(వరం) గ్రామానికి కిలోమీటరు దూరంలో అరుణానది సమీపంలో ఉంది.

👉 అమ్మవారి ఆవిర్భావం వెనుక ఓ పురాణ కథ ఉంది. పూర్వం సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుంచి వేదాలు తస్కరించాడట. అప్పుడు పార్వతీదేవీ అతణ్ణి సంహరించి వాటిని బ్రహ్మకి అప్పగించి నారాయణవనంలో ఆమ్నాయాక్షిగా వెలిసిందట. అప్పట్లో అమ్మ విగ్రహం చాలా చిన్నగా ఉండేదట. తరువాత కాలంలో అగస్త్య మహర్షి, ఆకాశరాజు... ఆ చిన్న విగ్రహం వెనుకనే, అవే పోలికలు ఉండేలా పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 
సోమకుణ్ణి సంహరించిన ఈ
అమ్మ కాళికామాతను పోలి ఉంటుంది.

👉 ఆకాశరాజు కులదేవతే అవనాక్షమ్మ. అప్పట్లో ఆకాశరాజు కోట ముందుభాగంలో ఆలయం ఉన్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆకాశరాజు ఎక్కడికైనా వెళ్లేముందు తప్పకుండా అమ్మవారిని దర్శించుకునేవాడట. ఆయనకు చాలాకాలం వరకూ పిల్లలు పుట్టలేదు. సంతానం కోసం అమ్మవారికి ఎన్నో పూజలు చేశాడట. ఫలితంగా పద్మావతీదేవి జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి. పద్మావతీదేవి తండ్రితో సహా రోజూ ఆలయానికి వచ్చి అమ్మవారికి పూజలు చేసేదట. 

👉నారాయణవనంలోని ఉద్యానవనంలో ఓరోజు శ్రీనివాసుణ్ణి చూసి మోహించింది. పద్మావతి. ఆ శ్రీనివాసుణ్ణి తనకు భర్తను చేయమని అవనాక్షమ్మను కోరుకుందట. శ్రీనివాసుడు, పద్మావతిలకు పెళ్లి నిశ్చయమయ్యాక... వాళ్లిద్దరూ ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. పద్మావతి ఈ ఆలయంలో గౌరీవ్రతం చేసిందట. పరిణయం తరువాత వాళ్లిద్దరూ తిరుమలకు వెళ్తూ అమ్మవారిని దర్శించుకున్నట్లు 'పద్మావతీ పరిణయం' గ్రంధంలో  ఉంది.

👉అవనాక్షమ్మ ఆలయంలో ఎన్నో విగ్రహాలు దర్శనమిస్తాయి. గర్భగుడిలో అమ్మవారి చిన్న విగ్రహంతోపాటు పెద్ద విగ్రహం, , శాంకరీదేవి విగ్రహం, వేపచెట్టుకింద గణపతి విగ్రహం, ఆలయం వెనుక నాగాలమ్మ విగ్రహాలు ఉన్నాయి. ఆలయం ముందుభాగంలో రెండు పెద్ద రాతిస్తంభాలున్నాయి. వీటి మధ్యలో భారీ గంట ఉండేదట. 

👉శక్తి స్వరూపిణి అయిన అవక్షి అమ్మవారి నిలువెత్తు విగ్రహం అతి భయంకరంగా ఉంటుంది. రాక్షస సంహారిణిగా అమ్మవారు దర్శనమిస్తారు . యుద్దంలో కత్తిడాలు ధరించిన రాక్షసుని కుత్తికపై కాలుంచి వానిని సంహరిస్తున్న ఈ శక్తి స్వరూపిణి చంద్రమూర్తి . అమ్మవారికి పది చేతులున్నాయి . అభయ వరద హస్తాలుగా క్రింది చేతులున్నాయి . మిగిలిన 8 హస్తాలలో వివిధ రకాలైన ఆభరణాలు ధరించి వుంటుంది . అవక్షమ్మ అమ్మవారు ఆ అభరణాలను త్రిమూర్తుల వద్ద నుంచి మహిషాసుర మర్థనానికి గ్రహించిందనీ , కలకత్తాలోని శ్రీ రామకృష్ణులు అర్చించిన కాళీమాత కంటే కూడా ఉగ్రరూపిణి అని కొందరంటారు . 

👉ఆలయంలో నిత్య పూజర్చనలు చేసే పూజారి సైతం ఆలయంలో ఒంటరిగా అమ్మవారి వద్ద వుండాలంటే భయపడతారనే విషయం ఇక్కడి వారు చెబుతుంటారు .

👉అవనాక్షమ్మ ఆలయ సమీపంలోనే అగస్త్యేశ్వరాలయం ఉంది. దీన్ని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించారట. 
ఈ ఆలయాన్ని ఆకాశరాజు అభివృద్ధి చేశాడు. 
ఆ గుడిలోని అమ్మవారిని మరకతవల్లి అంటారు. సాధారణంగా శివాలయాల్లో ముందు శివలింగం, దానికి ఎడమవైపు అమ్మవారు ఉంటారు. కానీ, ఆలయంలో మొదట అమ్మవారి విగ్రహం ఉండి, ఆ తరువాత స్వామి విగ్రహం ఉండటం విశేషం. పద్మావతీ దేవికి ఒకానొక సమయంలో జబ్బుచేసిందట. అప్పుడు అగస్త్య మహర్షి సూచన మేరకు ఆమె ఇక్కడ రుద్రాభిషేకం చేయించగా వ్యాధి నయమైనట్లు 'వేంకటాచల మహత్యం'లో
ఉంది.

👉నారాయణవనం తమిళనాడుకు అతి సమీపంలో వుండడం వల్ల తమిళ ప్రజలు సంఖ్యలో ఇక్కడకు వచ్చి పొంగళ్ళు పెడతారు . జంతుబలులు నిషేధమే అయినా జరుగుతుంటాయి . మంగళవారాలు , శుక్రవారాలు , భక్తులు పెద్ద ఎత్తున నిమ్మకాయల మాలలతో పూజలు చేస్తారు . ఉగ్రరూపిణే అయినా అవక్షమ్మ చల్లని చూపులు భక్తులకు అనేక శుభాలనిచ్చి ఆదరిస్తుందనీ , అందుకే ఈ గ్రామ దేవతను కేవలం ఆ గ్రామ ప్రజలే కాకుండా విశేషంగా ఇతర ప్రాంతాల వారు దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటుంటారు .

👉ఈ అమ్మవారికి పూజలు చేస్తే వివాహం కానివారికి వివాహం అవుతుందనీ, పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారనీ భక్తుల నమ్మకం. అమ్మవారికి ఏటా 18రోజులపాటు జాతర జరుగుతుంది. 
 ఏటా అక్టోబరులో తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పుడు ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు మొదలవుతాయి.

No comments: