🔅తిరుమల అంటే శ్రీవారే. అణువణువూ వేంకటేశ్వరుడే. తమిళంలో తిరు అంటే శ్రీ అనీ, మల అంటే శైలం (కొండ) అనీ కూడా అర్థం. అంటే తిరుమల... శ్రీశైలమన్నమాట. శివకేశవులకు భేదం లేదు కదా... అలాంటప్పుడు తిరుపతిలో శివాలయం ఉండటంలో ఆశ్చర్యమేముంది!
అలా తిరుపతిలో వెలసిన ఏకైక శివ క్షేత్రం ...పరమపవిత్ర తీర్థరాజమే " కపిలతీర్థం "
👉 ఆలయానికి ప్రకృతిసిద్ధంగా అమరిన వేంకటాచలం కొండ ఒక హద్దుగా వుంటుంది . కొండకోనల్లో ప్రవహించే నీరు ఇక్కడ జలపాతంగా నిర్మించిన కోనేట్లో పడుతుండడం కనువిందు చేసే దృశ్యమే. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ తీర్థం వేలాదిమంది భక్తజనులే కాదు పర్యాటకులు కూడా వచ్చి పరవశిస్తుంటారు.
👉ఆలయం అత్యంత పురాతనమయింది .
ముఖ్యంగా ఇది గుహాలయం .
శ్రీ వేంకటాచలంలో ఒక కొండ గుహలో వెలసిన శ్రీ కపిలేశ్వరుడు సాక్షాత్తు స్వయంభువే. ఈ ఆలయ ప్రశస్తి అనేక పురాణాల్లోను, శ్రీ వేంకటాచల ఇతిహాసాల్లోను ప్రస్తావించబడ్డాయి.
🔅 స్థలపురాణం 🔅
👉 కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళంనుంచి భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిశాడని స్థలపురాణం. కపిలముని తపస్సు కారణంగా ఇక్కడ కొలువైనది ఈశ్వరుడు కాబట్టి ఈ స్వామికి కపిలేశ్వరుడు అని పేరు వచ్చింది. ఇక్కడి లింగాన్ని కూడా కపిలలింగం అంటారు. ఆ తరవాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ క్షేత్రంలో ముక్కంటిని పూజించాడట. అందువల్ల, ఈ లింగాన్ని ఆగ్నేయ లింగమని కూడా పిలుస్తారు. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షీదేవి సమేతంగా కొలువయ్యాడు.
👉ఈ తీర్థం శ్రాద్ద కర్మలకు, పిండ ప్రధానాలకు ఎంతో శ్రేష్టం అని పురాణాలు చెప్తున్నాయి.
👉ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమనీ, వైష్ణవులు ఆళ్వార్ తీర్థమనీ పిలుస్తారు. వైష్ణవులు కోనేటి చుట్టూ నాలుగు మూలల్లోనూ నాలుగు సుదర్శన రాతిశిలలను స్థాపించారట. అందుకే, అప్పట్నుంచీ దీన్ని చక్రతీర్థమని పిలిచేవారు వైష్ణవులు.
👉కపిలతీర్థం పరమ పవిత్రమైనదని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమినాడు మధ్యాహ్నవేళ ముల్లోకాల్లోని సకలతీర్థాలూ నాలుగు గంటలపాటు కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలూ దూదిపింజల్లా పోతాయని ప్రసిద్ధి. స్నానమాచరించిన తరవాత నువ్వుగింజంత బంగారాన్ని దానం చేసినా... కొండంత పుణ్యం లభిస్తుందని చెబుతారు. అందుకే కార్తీకమాసం ప్రారంభం కాగానే ఈ తీర్థానికి భక్తులు పోటెత్తుతారు. నిత్యం ఈ తీర్థంలో పుణ్యస్నానాలు చేసి పరమేశ్వరుడికి ప్రీతికరంగా దీపాలు వెలిగిస్తారు. శివుడికి ఆరుద్రా నక్షత్రం అంటే చాలా ఇష్టమట. అందుకే, కార్తీకంలో ఆరుద్రా నక్షత్రం రోజున... ఆలయంలో లక్షబిళ్వార్చన, అన్నాభిషేకం ఘనంగా జరుగుతాయి.
👉ఏటా డిసెంబరులో తెప్పోత్సవాలూ, మాఘమాసంలో శివరాత్రికి పూర్తి అవునట్టు 10రోజులపాటు బ్రహ్మోత్సవాలూ నిర్వహిస్తారు.
👉ఆలయానికి సమీపంలోని కూడలిలో అతి పెద్ద నందీశ్వరుని విగ్రహం (నందివలయం) ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తుంది.
👉స్వామివారికి ఎడమ భాగంలో కామాక్షి అమ్మవారికి ప్రత్యేక ఆలయం వుంది. అమ్మవారికి రెండు పూటలా సహస్రనామార్చనలు, స్వామివారికి నిత్యాభిషేకాలు, నైవేద్య సమర్పణలూ, సర్పలంకారాలు, వేదపారాయణం జరుగుతూ వుంటాయి . ఆలయంలో నిత్య, వార, నక్షత్ర, పూజలు శైవాగమ యుక్తంగా ఘనంగా నిర్వహిస్తుంటారు.
👉కపిల తీర్థంలో వేంకటాచల సానువులలోని అనేక తీర్థాలనుంచి జలం వచ్చి చేరడమే కాదు పాతాళ లోకం నుంచి ఊట జలాలు కూడా కలుస్తుంటాయి . ప్రత్యక్షంగా మూడు గుండాలను మనం చూడవచ్చు. వీటికి బ్రహ్మగుండం , విష్ణుగుండం, మహేశ్వరగుండంగా పిలుస్తారు . కరువుకాటకాల సమయంలో కొనేట్లో చుక్కనీరు లేకపోయినా ఈ మూడు గుండాలలో మాత్రం ఊటలు సజీవంగా వుంటాయి .
👉వైష్ణవాలయాలకు విష్ణుగుండం నుంచి శివాలయ అభిషేకాలకు మహేశ్వర గుండం నుంచి అర్చకులు నీటిని తెస్తారు .
ఈ త్రికూట ( మూడు గుండాలకు ) సమీపంలో సరసింహ గుహ వుంది .
అందులో నుంచి వకుళమాత రోజూ వేంకటాచలం నుంచి కిందికి వచ్చి ఈ పవిత్ర పుష్కరిణిలో స్నానమాచరించే వారని కూడా ఇతిహాసం.
👉 ఇక్కడ స్వామివారి ఉత్సవమూర్తిని శ్రీ సోమస్కంధమూర్తి అంటారు (స + ఉమ స్కంధ ) ఒకే పీఠం పైన పార్వతీదేవి ( ఉమ ) స్కంధుడు ( కుమారస్వామి ) స్వామివారు కలిసిన పంచలోహ విగ్రహం .
👉 కోనేటికి అభిముఖంగా శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం, శ్రీలక్ష్మీ నారాయణస్వామి వారి ఆలయం ఉన్నాయి. ఆలయానికి అనుబంధంగా శ్రీ కామాక్షీ నందనవనం, నమ్మాళ్వారు గుడి (అతి పురాతనమైనది) కలదు.
👉 తిరుపతి యాత్రకు వచ్చిన
దాదాపుగా అందరూ ఈ ఆలయాన్ని దర్శించుకొని శివాశీస్సులు పొందడమే కాకుండా కోనేట్లో స్నానమాచరించి పవిత్రులవుతుంటారు.
No comments:
Post a Comment