Adsense

Wednesday, July 20, 2022

ఖమ్మం జిల్లా : " పిణిరెడ్డిగూడెం " శ్రీ కొండలమ్మ ఆలయం .



💠 సాధారణంగా  ఆలయంల్లో భగవంతుడు విగ్రహరూపంలో దర్శనమిస్తుంటారు. 
కానీ ఇక్కడ మాత్రం విష సర్పాల రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. 
ప్రతి యేటా ఉగాది పర్వదినాన ఇక్కడి ఆలయంలో పాముల రూపంలో భక్తులకు దర్శనమిస్తున్న అలయమే ఖమ్మం జిల్లా గార్ల మండలంలోని కొండలమ్మ అమ్మవారి ఆలయం.

💠 ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District)లో ఉంది ఈ కొండలమ్మ ఆలయం..జిల్లాలోని గార్ల మండలం పినిరెడ్డి గూడెం గ్రామ శివారులో కాకతీయుల కాలం నాటి అద్భుత కట్టడం శ్రీ కొండలమ్మ ఆలయం.

💠 ఈ మండలంలోని పిణిరెడ్డిగూడెంలో కొలువుదీరిన కొండలమ్మ ఆలయం ఎంతో ప్రాచీనమైనది.
 కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు.
 కాకతీయుల కళా వైభవానికి ఇది ప్రతీక. 
ఈ ఆలయంలో ఉగాదిని పురస్కరరించుకుని ఏటా నాలుగు రోజుల పాటు కొండలమ్మ జాతర నిర్వహిస్తారు. 

💠 గారమ్మ, కొండలమ్మ, భయమ్మ ముగ్గురు అక్కా చెల్లెల్లు. వారే పాముల రూపంలో ప్రత్యక్షమవుతుంటారని ఇక్కడి భక్తుల విశ్వాసం.
ముగ్గురు అక్కాచెల్లెల్ల పేరుతో కొండలమ్మ చెరువు, గారమ్మ చెరువు, బాయమ్మ చెరువు అనే మూడు చెరువులతో పాటు పినిరెడ్డి గూడెంలో గుడిని నిర్మించారట.
ఈ గుడిలోనే కొండలమ్మ అమ్మవారిని ప్రతిష్టించారు. 
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతియేటా ఇక్కడ జాతర ఘనంగా నిర్వహిస్తుంటారు.


💠 ఇక్కడ అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. 
జాతర ప్రారంభం రోజు ఎడ్ల బండ్ల ప్రబలతో గుడి చుట్టు ప్రదర్శనలు చేస్తారు. 
ఉగాది రోజున ముగ్గురు అమ్మవార్లు మూడు పాముల రూపంలో దర్శనమిస్తారని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. 

💠 అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు అధికసంఖ్యలో పాల్గొని తమకు మంచి జరగాలని ముడుపులు కడతారు. 
కోరికలు నెరవేరిన భక్తులు ముడుపులను విప్పి మొక్కులను చెల్లిస్తారు. 
ఈ జాతరలో మహబూబాబాద్, ఇల్లందు, ఖమ్మం, బయ్యారం, డోర్నకల్‌, కామేపల్లి, కారేపల్లి ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.
 కేవలం జాతర సమయంలో మాత్రమే అమ్మవారి రూపంలో పాములు భక్తులకు కనిపించి తిరిగి ఎక్కడికి వేళతాయో ఎవరికీ తెలియదంటున్నారు భక్తులు.

💠 కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా నిలిచే గార్ల మండలంలోని కొండలమ్మ ఆలయం ప్రాభవం మసకబారుతోంది. 
ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. 
రుద్రమదేవి పాలన కాలంలో కొండలమ్మ ఆలయాన్ని నిర్మించారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. 

💠 వరంగల్‌ వేయి స్తంభాల గుడి గార్ల కొండలమ్మ ఆలయం ఒకే సమయంలో నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి.
వేయి స్తంభాల గుడి శిల్పా నిర్మాణానికి కొండలమ్మ ఆలయ కట్టడం ఒకే మాదిరిగా ఉండటం గమనార్హం. 

💠 ఎంతో ప్రాచుర్యాన్ని పొందిన కొండలమ్మ దేవాలయాన్ని పట్టించుకునే వారు కరువుయ్యారు. 
నాటి కట్టడాలు నేలకొరుగుతుండగా ఆలయ గర్భగుడి ఒకవైపుకు ఒరిగింది. 
నలుదిక్కులా ఆలయ స్థంభాలు నేలమట్టమయ్యాయి.
 కూలిన ప్రాకారాలు..నేలరాలిన శిల్ప కళా ఖండాలు ఆలయ దుస్థితికి అద్దం పడుతున్నాయి. ఇలా అనేక పురాతన ఆలయాలు కాలగర్భంలో కలసిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కొన్నింటిని గుర్తించి పునర్వైభవాన్ని తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు.

No comments: