Adsense

Wednesday, September 28, 2022

మ‌హిమాన్విత శక్తి గాయ‌త్రి… గాయత్రీదేవి.. Gayatri Devi

 


🌸ముత్యం వంటి తెలుపు,  పగడపు ఎరుపు, అగ్నివంటి బంగారపు రంగు,  నిర్మలాకాశపు నీలం, చక్కటి తెలుపు-ధవళ వర్ణాల్లో ముగ్ధ మనోహర రూపంతో ప్రకాశిస్తూ పంచముఖాలతో  పంచ వర్ణాలలో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్ఠాన దేవత గాయత్రీదేవి.

🌿వరద హస్తం, అభయ హస్తాలతో పాటు అంకుశం, కొరడా, కపాలపాత్ర, గద, శంఖం, చక్రం, రెండు చేతుల్లో పద్మాలతో శోభిస్తూ ఉంటుంది. పంచముఖాలు పంచ భూతాత్మకమైన శక్తికి ప్రతీక.

🌸మంత్రాలలో గాయత్రీ మంత్రం చాలా గొప్పది. దానికి అధిష్ఠాన దేవత గాయత్రీ దేవి. వేదవ్యాసుల వారు రచించిన దేవీ భాగవతం ప్రకారం గాయత్రి పరదేవతా స్వరూపం.

🌿సూర్య భగవానుని సంచారం, అన్ని లోకాలకు వెలుగు ప్రసాదించడం, అందరినీ నిద్ర లేపి కార్యకలాపాలకు ప్రోత్సహించడం అంతా గాయత్రీ శక్తియే.

🌸ఆమె పంచభూతాత్మకమైన స్వరూపం. మణి ద్వీపం నుంచి దిగివ చ్చిన శక్తే హంస వాహనంగా గల గాయత్రీ దేవి. గాయత్రి వేదమాత. ఈమెకు మరో పేరు సావిత్రి. ఈమెను మొదట శంకరుడు, విష్ణువు ఆరాధించారు.

🌿గాయత్రి ఆధారంగానే బ్రహ్మ, వేదాలను పలికి సృష్టి జరిపించాడు. అందుకే ఆమె అందరికీ ఆరాధ్యదైవమయింది. ఒక పురాణ కథ ప్రకారం ఆమె ఒకప్పుడు బ్రహ్మ భార్యగా ఉంటూ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసింది. ఆమె చైత్రుడనే రాక్షసుడిని సంహరించినట్లు బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది.

🌸సావిత్రికి దివ్య దృష్టినిచ్చి భర్త సత్యవంతుని ప్రాణాలను యముడి నుంచి తిరిగి తెచ్చుకునే శక్తినిచ్చింది గాయత్రియేనని చెబుతారు. సంధ్యావందనాదికాల్లో కాక గాయత్రీ మంత్ర జపాన్ని నిత్యం విశేషంగా చేసే వారున్నారు.

🌿24 అక్షరాల గాయత్రి మంత్రానికి విశ్వామిత్రుడు ఋషి. బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల కలయికచే ఏర్పడిన ఈ మంత్రం మన బుద్ధులను సరైన దారిలో నడిచేలా చేసి, లోక కల్యాణానికి మనలను సమాయత్తం చేస్తుంది. గాయత్రి దేవి మానవులలో మొదటిగా ప్రసన్నురాలై కనబడినది విశ్వామిత్రునికే.

🌸ఆమె శక్తి లోకానికి బాగా ప్రకటితమైనది విశ్వామిత్రుని ద్వారానే. గాయత్రిమంత్ర శక్తి వల్లనే, రాజైన విశ్వామిత్రుడు తనలో బ్రహ్మర్షిత్వాన్ని నింపుకున్నాడు. ఆయన వల్ల ఈ ప్రపంచానికి ఎంతో మేలు జరిగింది. అమ్మవారు పంచ ముఖాలతో, పది చేతులు కలిగి ఉంటుంది.

🌿ఆమె ఐదు ముఖాలు ముత్యం వంటి తెలుపు, పగడం వంటి ఎరుపు, బంగారం రంగు, నీలం, తెలుపు రంగుల్లో ఉంటాయి. వరద హస్తం, అభయ హస్తాలతో పాటు అంకుశం, కొరడా, కపాలపాత్ర, గద, శంఖం, చక్రం, రెండు చేతుల్లో పద్మాలతో శోభిస్తూ ఉంటుంది.

🌸పంచముఖాలు పంచ భూతాత్మకమైన శక్తికి ప్రతీక. అడిగిన వరాలనిస్తూ, సాధకుల మనోభీష్టాన్ని నెరవేర్చడమే ఆమె పని. మాతృ స్వరూ పంతో విశ్వానికి అధిదవతగా త్రికాల, త్రిశక్తి, త్రిమూర్తి స్వరూపమే గాయత్రీ దేవి.

🌿ఉపనయనంలో గాయత్రీ మంత్రాన్ని ఉపదేశిస్తారు. తండ్రి ఉపనయన గురువు అవుతాడు. లేని పక్షంలో సద్గురువు ద్వారా గాయత్రీ మంత్రాన్ని స్వీకరించాలి. గురువు ఉపదశం లేకుండా గాయత్రీ దేవిని ఉపాసించ కూడదన్నది నియమం.

🌸ఈ మంత్రంలో ఒక్కొక్క అక్షరానికి, ఒక్కొక్క అర్థం, శక్తి, దేవత ఉంటారు. సనాతన ధర్మంలోని ముఖ్య లక్ష్యమైన ఆత్మ దర్శనానికి, పరమాత్మ దర్శనానికి, బ్రహ్మత్వం సిద్ధించడానికి ఇది మార్గదర్శి.

🌿మూడు సంధ్యల్లోనూ గాయత్రీ మంత్రాన్ని జపించడం, సంధ్యావందనం చేయడం విధి. ఆ విధంగా చేస్తే దరిద్రాలు తొలగడం, పితృదేవతలకు తృప్తి, వంశవృద్ధి, గ్రహ దోషాలు సమసిపోవడం, సుఖ జీవనం, చేసిన పాపాలు నశించడం వంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

🌸ఈ మంత్రాన్ని త్రిసంధ్యలలో ఉపాసించడం ఉత్తమం. కనీసం సూర్యోదయాత్‌ పూర్వం ఉపాసించడం మన విధ్యుక్త ధర్మం. వరుసగా వారం రోజులు సంధ్యావందనం చేయకపోతే మళ్ళీ ఉపనయనం చేసుకోవాలంటారు.

🌿యజ్ఞోపవీతం పవిత్రమైనది. దానిని ఇతర అవసరాలకు వినియోగించరాదు. దానిలో ఒక దారం తెగితే యజ్ఞోప వీతాన్ని యధావిధిగా తొలగించి మరొకటి ధరించాలి గాని ముడిపెట్టి వాడకూడదు. యజ్ఞోపవీతం బొడ్డు దాటి కిందకు రాకూడదు. మల మూత్ర విసర్జన సమయంలో దానిని చెవికి మెలిపెట్టి మాలలా ధరించాలి.

🌸ఆ పవిత్రతను మనం కాపాడితే గాయత్రి మనలను కాపాడుతుంది. సంధ్యావందనం సమయంలో తర్పణాలు విడవడం, గాయత్రి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించడం అవసరం. ఎంత సంఖ్య పెంచితే అంత మంచిది. ‘కోటి గాయత్రి’ జపాల్లో పాల్గొనడం శ్రేయోదాయకం.

🌿పూర్వ జన్మలో చేసిన పాపాలు, తెలియక చేసినవి పోగొట్టుకోవడానికే దేవతారాధన. గాయత్రి ఆరాధన కూడా అటువంటిదే.

🌸ఉద్దేశ్యపూర్వకంగా పాపాలు చేస్తూ దైవం పోగొడతాడనే భావన పనికిరాదు. సనాతన ధర్మాన్ని పాటించి తరించాలి...  స్వస్తి...

No comments: