Adsense

Wednesday, September 28, 2022

కుమారీ పూజ KUMARI POOJA



శరన్నవరాత్రులందు ప్రతిదినము రకరకములైన మనోహర ద్రవ్యములతో ప్రాతఃకాలము, సంధ్యాసమయమున, మధ్యాహ్నమున - ముప్పొద్దుల భగవతి నారాధించవలెను. ఆడుచు, పాడుచు, మంగళ వాయిద్యములతో
వైభవోపేతముగ ఉత్సవమును జరుపవలెను. నేలమీద నిదురించవలెను. దివ్యవస్తములతో, అభూషణములతో అమృతతుల్యమగు మధుర భోజనాదులతో కుమారీ కన్యలను పూజించవలెను.

మొదటిదినమున ఒక్కరిని పూజింపవలెను. ప్రతిదినము క్రమముగ ఒక్కొక్కరిని ఎక్కువ చేయుచుండవలెను. రెండవదినమున ఇరువురిని, మూడవ దినమున మువ్వురిని ఇట్లు తొమ్మిదవ దినమున తొమ్మిదిమంది కన్యలను పూజింపవలెను.

పూజావిధియందు ఒక సంవత్సరము వయస్సుగల కన్యను స్వీకరించరాదు. ఆమెకు గంధము, భోగాధి పదార్ధముల రుచులను పూర్తిగా తెలిసివుండదు.

కనీసము రెండు సంవత్సరములు పైబడినదానిని కుమారియని చెప్పబడినది.

మూడు సంవత్సరముల పైన త్రిమూర్తియని,

నాలుగేండ్ల బాలిక కళ్వాణియని చెప్పుదురు.

ఐదు సంవత్సరముల కన్య రోహిణియని,

ఆరు సంవత్సరములు కలది కాళికయని,

ఏడు సంవత్సరముల బాలిక చండికయని,

ఎనిమిది సంవత్సరముల వయస్సుగలది శాంభవియని,

తొమ్మిది సంవత్సరముల వయస్సు గల కన్య దుర్గయని,

పది సంవత్సరములు కలది సుభద్రయని చెప్పబడును.

ఇంతకంటె ఎక్కువ వయస్సుగల కన్యలను పూజింపరాదు.

ఈ పేర్లతోనే విధిపూర్వకముగ పూజించవలెను. ఈ తొమ్మందుగురు కన్యలను పూజించుటవలన కలుగు ఫలము కూడ తెలుపబడినది. దుఃఖము, దారిద్ర్యము ఉపశమించుటకు కుమారిని పూజింపవలెను. ఈ పూజవలన శత్రునాశనము జరుగును,

ధనము,క్రయుప్యము, బలము వృద్ధియగును. భగవతి “త్రిమూర్తి”ని
ఆరాధించుటవలన త్రివర్గములు అనగా ధర్మ, అర్థ, కామములు సిద్దించును. దానికితోడు ధనధాన్యములు సమకూడుట, పుత్రపౌత్రాభి వృద్ధియును కలుగును.

విద్య, విజయము, రాజ్యలాభము, సుఖమును పొందగోరు
సకల కోరికలను సఫలమొనర్చు భగవతి “కళ్యాణి” ని
నిరంతరము పూజింపవలెను.

శత్రుశమనము కొరకు భగవతి “కాళిక”ను భక్తిపూర్వకముగ ఆరాధించవలెను.

భగవతి “చండిక”ను పూజించుటవలన ఐశ్వర్యము, ధనము
పెంపొందును.

ఎవరినైనను మోహింపచేయవలయు నన్నచో, దుఃఖమును, దారిద్యమును తొలగించుటకు, రణరంగమున విజయమును పొందుటకు భగవతి “శాంభవి”ని సదా పూజించవలెను.

ఏదైనా కఠినమైన పనిని సిద్ధింపజేయు సమయమున లేక దుష్టుడైన శత్రువును సంహరింపవలయు నన్నచో భగవతి “దుర్గను
పూజించవలెను.

కోరికలు ఫలించుటకు భగవతి “సుభద్ర" ను నిరంతరము
ఉపాసించవలెను.

మానవుల రోగములు తొలగిపోవుటకు “రోహిణి”ని ఎల్లవేళల పూజించవలెను.

అంగవైకల్యముకల దానిని, దుర్గంధముతోకూడిన కన్యను పూజకు
స్వీకరించరాదు. పుట్టుగ్రుడ్డిని, వక్రదృష్టితో చూచుదానిని, కురూపియైనదానిని, అధిక రోమములుగల దానిని, రోగగ్రస్తురాలిని, రజస్వలమయైన కన్యను పరిత్యజించవలెను. విధవస్తీకి
పుట్టినదానిని, తల్లి వివాహమునకు ముందే జన్మించినను సంపూర్ణముగ పూజకు అనుమతించరాదు.

సకలకార్యసిద్ధికి బ్రాహ్మణకన్యను, యుద్ధమునందు విజయమునకు  క్షత్రియకన్యను, వ్యాపారమునందు లాభమునకు వైశ్య లేక శూద్రకన్యను పూజించవలెను. బ్రాహ్మణులు, క్షత్రియులు - బ్రాహ్మణ కన్యను పూజించవలెను. వైశ్యులు బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర ఈ మూడు వర్ణముల కన్యలను పూజించు విధానము కలదు. శూద్రులకు నాలుగు వర్ణముల కన్యలు పూజనీయులే. శిల్పకారులు యథాయోగ్యముగ తమ తమ వంశములందలి కన్యలను ఉపాసించవలెను.

No comments: