Adsense

Thursday, October 27, 2022

28వ మహర్షి.. గౌరముఖ మహర్షి

మన మహర్షుల చరిత్ర...

 28వ గౌరముఖ మహర్షి గురించి తెలుసుకుందాం


🌿ఇంత మంది గొప్ప గొప్ప మహర్షుల గురించి తెలుసుకుంటుంటే ఏమనిపిస్తోంది నాకు ?

🌸 అమ్మో ! మనది ఇంత గొప్ప దేశమా ! మనం ఈ దేశంలో పుట్టడం వలన ఎంత అదృష్టవంతులమో అనిపిస్తోంది కదూ...

🌿గౌరముఖ మహర్షి దివ్యచరిత్ర మొదలు పెడదాం మరి . గౌరముఖుడు శమీక మహామునికి ప్రియశిష్యుడు . సమస్త వేదశాస్త్రాలు శమీకుడి దగ్గర నేర్చుకున్నాడు . గొప్ప తపశ్శాలి కూడా .

🌸 విద్య పూర్తయ్యాక గురువు అనుమతి తీసుకుని వేరొక చోట ఆశ్రమం నిర్మించుకుని ముని కుమారులని శిష్యులుగా చేసుకుని ఉంటున్నాడు .

🌿 గౌరముఖ మహర్షి ఆశ్రమం అద్భుతంగా ఉంది . ఎలా ఉందో చెప్పనా ? మీకు కూడా బాగా నచ్చుతుంది .

🌸 నిజంగా తెలుసుకోవలసిందే . ఆ పుణ్యా మోక్షలక్ష్మికి పుట్టిల్లెన అమృతంతో నిండిన సముద్రంలా ఉంది .

🌿గురువు యజ్ఞం చేస్తున్నప్పుడు శిష్యులు వెళ్ళి సమిధలు కావాలి అంటే చెట్ల కొమ్మలే అందిస్తాయి .

🌸 చెట్టు నీడల్లో కూర్చుని శిష్యులు వేదపారాయణ చేస్తూ ఎక్కడైనా మర్చిపోతే అక్కడి చిలుకలు అందిస్తాయి .

🌿 అక్కడి కోయిలలు వాటి చక్కటి స్వరాలతో దేవతల్ని ఆహ్వానిస్తాయి . బెదిరిపోయి పారిపోతున్న లేడిపిల్లలకి మునిభార్యలు లేతగడ్డి నోటికి అందిస్తారు .

🌸అక్కడి చెట్లు ఆకులు ఎక్కడ ఉపయోగించకుండా పోతాయో అని అసలు ముదరవు .

🌿అక్కడి పువ్వులు పూజ మొదలు పెట్టబోయే ముందు పూస్తాయి . ఋషుల భార్యలు ఆరేసుకున్న చీరలు చిరిగిపోతాయేమో అని వాళ్ళు చీరలు తీసుకునే వరకు చెట్లు కదలవు .

🌸 అక్కడి మునులు ఎప్పుడూ అగ్నిలా ప్రకాశిస్తూ , అందరూ స్నేహంగా గొప్ప తేజస్సుతో ఉన్నారు . వాళ్ళకి గౌరముఖ మహర్షి పెద్ద గురువు , దైవం కూడా .

🌿 గౌరముఖ మహర్షి అందమైన జడలు కట్టిన జుట్టుతో , శరీరమే సత్త్వగుణమేమో అన్నట్లు విభూతి నిండిన శరీరంతో ,

🌸ఆపకుండా చేసే మంత్ర జపంతో , మెడలో రుద్రాక్షమాలతో , కౌపీనం కట్టుకుని ప్రక్కన కమండలం , దండం పెట్టుకుని చెట్టునీడన కూర్చుని శిష్యులకి పరతత్త్వాన్ని గురించి చెప్తూ ఉన్నాడు .

🌿 ఒకనాడు దుర్జయ మహారాజు వేటాడి అలసిపోయి గౌరముఖుడి ఆశ్రమానికి వచ్చి సాష్టాంగనమస్కారం చేశాడు .

🌸గౌరముఖుడు ఆ రాజుకి సత్కారాలు చేసి కొంచెం ఆగి సేదతీరి వెళ్ళమన్నాడు .

🌿రాజు నా సైన్యంతో ఎక్కడ ఉండాలి అని అడిగాడు . గౌరిముఖ మహర్షి గంగలో స్నానం చేసి విష్ణువుని ప్రార్థిస్తే విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఒక మణినిచ్చాడు .

🌸అది ఆశ్రమానికి తీసుకువచ్చి పూజ చెయ్యగానే అందమైన భవనాలతో ఒక నగరం ఏర్పడింది . దుర్జయ రాజు తన సైనికులతో అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు .

🌿మర్నాడు ఉదయమే లేచి మహర్షికి నమస్కారం చేసి బయలుదేరాడు . వెంటనే నగరమంతా మాయమయిపోయింది .

🌸అదంతా చూసిన దుర్జయ మహారాజుకి అసూయ కలిగి ఎలాగయినా ఆ మణిని తీసేసుకోవాలని బుద్ధి పుట్టింది .

🌿ఒక సైనికుడ్ని పంపి గౌరముఖ మహర్షిని అడిగి ఆ మణిని తీసుకురమ్మన్నాడు .గౌరముఖుడు సైనికుడ్ని మందలించాడు .

🌸రాజు సేనాపతిని పిలిచి సైన్యాన్ని తీసుకుని ఆశ్రమం వెనుకనించి మణిని తీసుకురమ్మన్నాడు .

🌿ఆ మణిలోంచి వేలకు వేలు సైనికులు వచ్చి వాళ్ళని చంపారు . దుర్జయరాజు తన దగ్గరున్న సేనతో తానే స్వయంగా యుద్ధానికి వెళ్ళాడు . 

🌸గౌరముఖ మహర్షి విష్ణుమూర్తిని ప్రార్ధించాడు . విష్ణుమూర్తి తన చక్రంతో నిమిషంలో అందర్నీ చంపేశాడు .

🌿 నిమిషంలో అందర్ని వధించాడు కాబట్టి ఆ ప్రదేశానికి ' నైమిషం ' అని పేరు వచ్చింది.

🌸 విష్ణుమూర్తి యజ్ఞపురుషుడుగా అక్కడే ఉండిపోయాడు . మహర్షి దిన చర్యలో ఉండిపోయాడు . కొంతకాలం తర్వాత గౌరముఖ మహర్షి

🌿 ' ప్రభాసం ' అనే సోమతీర్థానికి వెళ్ళి విష్ణుమూర్తిని పూజ చేస్తుండగా మార్కండేయ మహర్షి అక్కడకి వచ్చాడు .

🌸గౌరముఖుడు ఆయన్ని సాదరంగా తీసుకొచ్చి దర్భాసనం మీద కూర్చోపెట్టి అతిథి పూజలు చేసి మహామహాత్మా ! మీరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది .

🌿ఏం పనిమీద వచ్చారో చెప్పండన్నాడు .
మహర్షీ ! మీకేమన్నా సందేహాలుంటే అడగండి చెప్తాను అన్నాడు మార్కండేయుడు .

🌸 స్వామీ ! పితృదేవతలున్నారు అంటారు కదా ! వాళ్ళెవరు ? తెలియజెయ్యండి అన్నాడు . మార్కండేయుడు ఇలా చెప్పాడు .

🌿 మహర్షీ ! మొత్తం విశ్వానికి తండ్రి విష్ణువు . అతని వల్ల బ్రహ్మ పట్టాడు . బ్రహ్మ ఏడుగురు ఋషుల్ని సృష్టించి తననే పూజ చెయ్యమన్నాడు .

🌸 కాని వాళ్ళు ఆత్మలో పరమాత్మనే ధ్యానిస్తున్నారు . బ్రహ్మకి వాళ్ళ మీద కోపం వచ్చింది . వాళ్ళకి బ్రహ్మ జ్ఞానం పోవాలని శపించాడు బ్రహ్మ .

🌿వాళ్ళు ఏడుగురు వంశోద్ధారకుల్ని కని స్వర్గానికి వెళ్ళిపోయారు . వాళ్ళకు పిల్లలు శ్రాద్ధకర్మలు చేశారు . వాళ్ళు దేవతలకి పితృదేవతలై నూలు యుగాలు సనాతన లోకంలో ఉండి ,

🌸 మళ్ళీ బ్రహ్మవాదులుగా పుట్టి యోగసిద్ధిని పొంది యోగబలంతో యోగులందరికీ యోగాభివృద్ధి ఇస్తుంటారు .

🌿అందుకే వాళ్ళకి శ్రాద్ధం పెట్టాలి . సప్తలోకాల్లోనూ పితృదేవతలుంటారు . భూలోకంలో ఉన్న ప్రజలు , భువర్లోకంలో ఉన్న పితృదేవతల్ని పూజ చేస్తారు .
🌸 భువర్లోకం , సువర్లోకం , మహాలోకంలో ఉన్నవాళ్ళు జనలోకంలో ఉన్నవాళ్ళని పూజ చేస్తారు .

🌿జనలోకవాసులు , తపోలోకవాసులు సత్యలోకంలో ఉన్న పితృదేవతల్ని పూజ చేస్తారు .

🌸దీన్ని గురించి అంతకన్న వివరంగా చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు అన్నాడు మార్కండేయుడు .

🌿 పితృదేవతల్ని ఎప్పుడెప్పుడు పూజ చెయ్యాలో చెప్తాను విను అన్నాడు మార్కండేయుడు .

🌸వ్యతీపాతము , ఆయనము , విషువత్తు , చంద్ర , సూర్యగ్రహణాలు సంక్రమణం మొదలైన పుణ్యదినాల్లోనూ ,

🌿నక్షత్ర గ్రహపీడలప్పుడు , కొత్త ధాన్యాలు ఇంటికి వచ్చినప్పుడు చెయ్యాలి . డబ్బు లేకపోతే తిలతర్పణం ఇస్తే చాలు .

🌸అదీ చాతకానప్పుడు ఒక ఆవుకి ఒక పూటకి సరిపడ గడ్డి ఇచ్చినా చాలు . అదీ చెయ్యలేనప్పుడు

🌿 సూర్యుడు మొదలైన లోకాన్ని రక్షించేవాళ్ళకి ఏదయినా ఒక అడవిలాంటి ప్రదేశానికి వెళ్ళి చేతులు పైకెత్తి నమస్కారం పెట్టి గట్టిగా ' నావల్లకాదు ' అని చెప్పినా చాలు అని చెప్పాడు .

🌸 ఇంకా మార్కండేయుడు ఇలా చెప్పాడు . పితృకర్మ చెయ్యడానికి యోగి యతి , శిష్యుడు , సోమయాజి , ఋత్విజుడు , సోదరి కొడుకు ,
అల్లుడు , మేనమామ అర్హులు .

🌿 నపుంసకుడు , దొంగ , నిందితుడు , రోగి , ఆ గ్రామ యాచకుడు అర్హులు కాదు . గౌరముఖుడు భృగువంశంలో వాడని చెప్పి అతడిని ఆశీర్వదించి విష్ణుమూర్తిలో ఐక్యమయ్యే విధానం చెప్పి వెళ్ళిపోయాడు మార్కండేయుడు .

🌸మార్కండేయుడు చెప్పినవి శ్రద్ధగా విని చాలా సంవత్సరాలు పితృదేవతాపూజ చేసి శ్రీహరినే మనస్సులో తల్చుకుంటూ గొప్ప తపస్సు చేశాడు గౌరముఖుడు .

🌿 ఒకనాడు కోటిసూర్యుల కాంతితో విష్ణుమూర్తి ప్రత్యక్షమై గౌరముఖ మహర్షిని తనలో ఐక్యం చేసుకున్నాడు .

🌸 మార్కండేయ మహర్షి  ఎంత బాగా చెప్పాడు , పితృదేవతల గురించి , వాళ్ళకు తర్పణాలివ్వడం గురించీ తద్దినాలు అంటే వాళ్ళకి పూజచేసి నైవేద్యం పెట్టడమేననీ ,

🌿వాళ్ళు కూడా దేవతలే అనీ , అది ఎవరు పెట్టచ్చు ? ఎవరు పెట్టకూడదు ? ఏఏ రోజుల్లో పెట్టాలి అనీ , ఎంత బాగా తెలిసేలా చెప్పాడో మార్కండేయ మహర్షి .

🌸 పితృదేవతల్ని తృప్తి పరచడం వల్ల మనకి ఎంతో పుణ్యం . దాన్ని మాత్రం మానకూడదు . శక్తి లేని వాళ్ళు ఎలా చెయ్యచ్చు అన్నది కూడ వివరంగా మార్కండేయుడు గౌరముఖ మహర్షి ద్వారా మనకి తెలియజేశాడు .

🌿 చూశారా ! గౌరముఖ మహర్షి ఎంత భక్తుడో , ఎంత మంచి మనసున్నవాడో , ఎంతమందిని భక్తులుగా తీర్చిదిద్దాడో !! చివరికి విష్ణుమూర్తిలోనే ఐక్యం అయిపోయాడు . నిజంగా అద్భుతం ! కదూ !!

🌸ఇదండీ గౌరముఖ మహర్షి చరిత్ర .. స్వస్తి.

No comments: