Adsense

Thursday, October 27, 2022

29వ మహర్షి.. చ్యవన మహర్షి

మన మహర్షుల చరిత్ర...
 29వ చ్యవన మహర్షి చరిత్ర తెలుసుకుందాం


🌿చ్యవన మహర్షి వృత్తాంతము మహాభారతము, దేవీభాగవతము, అష్టాదశ పురాణాలలో చెప్పబడింది

🌸 భృగు మహర్షి భార్య పులోమ అగ్నిహోత్రం సిద్ధం చెయ్యడం హోమానికి కావలసిన సామాన్లు ఏర్పాటు చేయడం చేస్తూ ఉండేది భర్తకి .

🌿ఆమె గర్భవతి . తనకు పుట్టబోయే కొడుకు గొప్ప బ్రహ్మర్షి అవాలని కోరుకుంటూ ఉండేది . ఒకనాడు భృగుమహర్షి స్నానానికి వెడుతూ అగ్నిహోత్రం తయారు చెయ్యమని భార్యకి చెప్పాడు .

🌸 అగ్నిహోత్రం వెలుగుతుండగా పులోముడనే ఒక రాక్షసుడు పులోమని
చూపించి ఈవిడ ఎవరు ? అని అగ్నిదేవుణ్ణి అడిగాడు

🌿పులోమ అయితే ఎత్తుకుపోవాలనే ఉద్దేశ్యంతో . అగ్ని నిజం చెప్పకపోతే పాపం వస్తుందనీ , చెప్తే మహర్షికి కోపం వస్తుందనీ ఎటూ కాకుండా ఆవిడ భృగు మహర్షి భార్య అని చెప్పాడు .

🌸పులోముడు వెంటనే పందిరూపంలో ఆమెని ఎత్తుకుపోతుండగా పులోమ కడుపులోవున్న పిల్లవాడు క్రింద పడిపోయాడు . అలా పడిపోవడం వల్ల ఆ పిల్లవాడికి “ చ్యవనుడు ” అనే పేరు వచ్చింది .

🌿ఆ పిల్లవాడి తేజస్సు చూడగానే రాక్షసుడు భస్మం
అయిపోయాడు .జరిగిందంతా విని భృగుమహర్షి అగ్నిహోత్రుణ్ణి అతిక్రూరుడు , సర్వభక్షకుడు , అంటే కనిపించిందల్లా తినేసేవాడుగా అయిపొమ్మని శపించాడు .

🌸 దేవతలందరూ భృగు మహర్షిని బ్రతిమాలి శాపం ఉపసంహరించుకునేలా చేశారు . చ్యవనుడికి ఉపనయనం చేసి తపస్సు చేసుకునేందుకు పంపించాడు భృగువు . చ్యవనుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు .

🌸అతని చుట్టూ పుట్టలు వచ్చేసి మనిషి ముసలివాడయిపోయాడు .ఒకసారి సంయాతిరాజు భార్యనీ , కూతుర్నీ , సైన్యాన్ని తీసుకుని ఆ ప్రదేశానికి వచ్చాడు .

🌿అతని కూతురు సుకన్య చాలా అందంగా ఉంది . అక్కడ పుట్ట దగ్గర రెండు కళ్ళు మెరుస్తుంటే ఆ కళ్ళని పొడిచింది .ఆ కళ్ళు చ్యవనుడివి . చ్యవనుడికి కోపం వచ్చి సంయాతి సైన్యానికి మల మూత్రాలు బయటికి రాకుండా శపించాడు .

🌸రాజు భయపడి మహర్షి కాళ్ళమీద పడి తన కూతురు చేసిన తప్పుకి క్షమించమని అడిగాడు . భవిష్యత్తు తెలిసిన వాడు కనుక చ్యవనుడు సుకన్యను తనకిచ్చి పెళ్ళి చెయ్యమని రాజునడిగాడు .

🌿రాజు సుకన్యని పిలిచి చ్యవన మహర్షిని పెళ్ళి చేసుకుంటావా ? అనగానే సుకన్య అంతటి గొప్ప మహర్షి తన భర్తగా రావడం తన అదృష్టం అని ఈ పెళ్ళి తనకిష్టమే అంది .సంయాతి రాజు వాళ్ళిద్దరికి పెళ్ళి జరిపించాడు .

🌸 భర్త ముసలివాడయినా సుకన్య చ్యవన మహర్షిని దేవుడుగా అనుకుని సపర్యలు చేస్తూ శరీరం తుచ్ఛమైందనీ , ఆత్మానందమే ముఖ్యమైందనీ తెలుసుకుంది . ఇలా వుండగా అశ్వినీ కుమారులు సుకన్య అందాన్ని చూసి సుకన్య ఒంటరిగా వున్నప్పుడు ,

🌿ఈ ముసలిమొగుడితో ఏముంటావు ? నీ అందం అంతా అడవిగాచిన వెన్నెల అయిపోతోంది మాలో ఒకడిని కోరుకో అన్నారు . సుకన్య భర్తకి చెప్పి అతడు చెప్పమన్నట్లుగా నాకు నవయౌవనం ఉన్నవాడిని ఇమ్మని అడిగింది .

🌸వాళ్ళు దగ్గరే వున్న ఒక కొలనులో స్నానం చేసి నవయౌవనంతో వచ్చారు . చ్యవనుడు కూడ వాళ్లతో ఆ కొలనులోనే స్నానం చేసి యౌవనంతో వచ్చాడు . సుకన్య చ్యవనుణ్ణి కోరుకుంది .

🌿అశ్వినీ కుమారులు సుకన్యతో నీ పాతివ్రత్యం పరీక్షించాలని ఇలా చేశామని చెప్పి వెళ్ళిపోయారు .
సపరివారంగా వచ్చి కూతుర్ని అల్లుణ్ణి తన యింటికి తీసుకెళ్ళాడు .

🌸 చ్యవనుడు మామగారి అభివృద్ధికి ఒక యజ్ఞం చేయిస్తానని చెప్పాడు . మంచి ముహూర్తం చూసి చ్యవనుడు మామగారితో యజ్ఞం చేయించడం మొదలెట్టాడు .

🌿అశ్వినీ దేవతలకు ఇచ్చిన మాట ప్రకారం సోమపానమిస్తుంటే ఇంద్రుడు అడ్డుపడ్డాడు . చ్యవనుడు ఇంద్రుడ్ని పట్టించుకోకుండా అశ్వినీ దేవతలతో సోమపానం చేయించాడు .

🌸ఇంద్రుడు చ్యవనుడ్ని చంపడానికి వజ్రాయుధం తీస్తుంటే అతని చెయ్యి అలాగే వుండిపోయేలా చేసి అగ్ని నుంచి ఒక రాక్షసుడ్ని పుట్టించాడు చ్యవనుడు .

🌿ఆ రాక్షసుడు ఎలా వున్నాడో తెలుసా ? చేతులు పదివేల ఆమడల పొడుగు , పెద్ద పెద్ద కోరలు , సూర్యుడు , చంద్రుడు , ఎంత ఉంటారో అంతంత పెద్ద పెద్ద కళ్ళు , భయంకరమైన అగ్నిలా ఎర్రగా నోరు , భూమిని ఆకాశాన్ని కూడా అంటుకుపోతున్నంత శరీరంతో ఉన్నాడు .

🌸ఒక్కసారిగా నోరు తెరిచి ఇంద్రుడ్ని మింగెయ్యబోయాడు . వెంటనే ఇంద్రుడు చ్యవన మహర్షి కాళ్ళమీద పడి క్షమాపణ అడిగాడు . ఆ రాక్షసుడిని మద్యం తాగే వాళ్ళలోనూ , జంతువుల్లోనూ ఉండమని పంపేసి ఆ యజ్ఞం పూర్తి చేయించాడు చ్యవన మహర్షి .

🌿ఆ యజ్ఞం చేసిన ప్రదేశానికి ' అర్చీకపర్వతం ' అని పేరు . ఇంద్రుడు చ్యవనుడి మీద కోపంతో ఒక పర్వతాన్ని విసిరాడు . ఇంద్రుడిగారికి ఎప్పుడూ అహంకారం , గర్వం అనుకుంటాను . పాపం ఒకసారి దెబ్బతిన్నా తగ్గలేదు .

🌸 మన మహర్షి గారు ఊరుకుంటారా ! అసలే తపశ్శక్తి అమోఘం కదా ! వెంటనే కమండలం నుంచి నీళ్ళు తీసి ఆ పర్వతం మీద చల్లారు . అది తిరిగి ఇంద్రుడు మీదకి వెళ్ళింది . భయంతో ఇంద్రుడు కళ్ళు తిరిగి పడిపోయాడు .

🌿 పాపం అమాయకుడులే అని మళ్ళీ మన మహర్షి గారే మొహం మీద నీళ్ళు చల్లి లేపితే ఇంద్రుడు సిగ్గుపడి అమ్మో ! ఈ మహర్షి జోలికి మాత్రం పోకూడదనుకుని వెళ్ళిపోయాడు .

🌸చ్యవన మహర్షి సుకన్యతో నేను ముసలివాణ్ణయినా కూడా అసహ్యించుకోకుండా నాకు సేవలు చేశావు . నీకు ముగ్గురు పిల్లల్ని అనుగ్రహిస్తున్నాను అన్నాడు .

🌿ఆ ముగ్గురి పేర్లు దధీతి , ప్రమతి , ఆప్రవానుడు .

మహా తపస్సంపన్నులయిన మహర్షులు మంచి ప్రవర్తన కలిగిన సంతానం కోసమే కదా సంసారం చేస్తారు .

🌸కొంతకాలం తర్వాత చ్యవనుడు గంగా యమునా సంగమంలో నీటిలో మునిగి తపస్సు చేస్తుండగా , అందులో ఉన్న జంతువులు ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి .

🌿కాని ఏమీ హాని చెయ్యలేదు . అక్కడి నీళ్ళు కూడా చ్యవన మహర్షికి ప్రదక్షిణం చేస్తున్నాయి . ఇలా పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశాడు .

🌸ఒకసారి జాలరులు అంటే చేపలు పట్టే వాళ్ళు వల విసిరి లాగి వలలో చిక్కుకున్న చ్యవన మహర్షిని చూసి భయపడిపోయారు .

🌿చ్యవనుడు ఫరవాలేదు , మీ కులవృత్తి మీరు చేసుకోవడంలో తప్పులేదు చేసుకోండి అన్నాడు . కాని వాళ్ళు భయంతో నహుషకి మహారాజు విషయం చెప్పారు .

🌸 వెంటనే వాళ్ళని క్షమించమని అడిగాడు రాజు . వాళ్ళ తప్పులేదు తనకి ధర కట్టి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని పంపించెయ్యమన్నాడు మహర్షి .

🌿 నహషుడు అర్ధరాజ్యం ఇస్తానన్నాడు . తన ధరకి చాలదన్నాడు మహర్షి . అయితే పూర్తి రాజ్యం ఇచ్చేస్తానన్నాడు నహుషుడు . అది కూడా తనకి తగిన ధర కాదని చ్యవన మహర్షి రాజుకి చెప్పాడు .

🌸ఈలోగా కవిజాతుడనే ముని వచ్చి గోవయితే బ్రాహ్మణులతో సమానం కాబట్టి ఒక గోవునిమ్మని చెప్పాడు . నహషుడు గోవు యొక్క గొప్పతనాన్ని చ్యవన మహర్షి వల్ల తెలుసుకుని ఒక గోవుని తెచ్చి జాలరులకిచ్చాడు .

🌿 వాళ్ళు తక్కువ వాళ్ళా ... ! మనం కూడ కొంచెం పుణ్యం సంపాయించుకుందాం , డబ్బు ఎంత వచ్చినా ఒకటే అని ఆ గోవుని చ్యవన మహర్షికిచ్చి నమస్కారం చేశారు .

🌸 వాళ్ళకి స్వర్గలోకప్రాప్తి , నహుషుడికి ఇంద్రపదవి వచ్చేటట్లుగా మహర్షి ఆశీర్వదించాడు . మునులు , దేవతలతో కలిసి కూర్చుని ఉన్న సమయంలో

🌿భృగు , కుశిక వంశాల్లో బ్రాహ్మణ , క్షత్రియ సంకరం వస్తుందని చెప్పాడు బ్రహ్మ . చ్యవన మహర్షి అది విని కుశిక వంశాన్ని నాశనం చేస్తే ఇంక ఆ రెండింటి మధ్య గొడవలేమీ వుండవు కదా అనుకుని కుశిక రాజుని పరీక్షిద్దామని వెళ్ళాడు .

🌸ఎన్నిరకాలుగా పరీక్షిద్దామనుకున్నా కుశికరాజు లొంగలేదు . ఆ రాజు భక్తికి వినయానికి మెచ్చుకుని నీ వంశంలో బ్రహ్మర్షి పుడతాడు అని చెప్పి ఆశీర్వదించాడు చ్యవనుడు .

🌿ఆయనే విశ్వామిత్రుడు . చ్యవన మహర్షి నర్మదానదిలో స్నానం చేస్తుండగా ఒక పెద్ద పాము పాతాళలోకానికి లాక్కుని పోయింది .

🌸అక్కడ నాగకన్యలు ఆయనకి భక్తితో సేవచేశారు . పాతాళ రాజయిన ప్రహ్లాదుడు ఆ చ్యవన మహర్షిని చూసి ఇంద్రుడు నన్ను చంపి రమ్మని పంపించాడేమో అని అనుమానించాడు .

🌿కానీ , చ్యవన మహర్షిని చూశాక , నమస్కారం చేసి మహాత్మా ! మీరు చాలా నదుల్లో స్నానం చేసివుంటారు , ఏ ఏ నదుల్లో స్నానం చేస్తే పుణ్యమో చెప్పండని అడిగాడు .

🌸 చ్యవన మహర్షి రాజా ! నువ్వు విష్ణు భక్తుడివి . నువ్వడిగితే నేను చెప్పకుండా ఎలా ఉంటాను వినమని చెప్పడం మొదలు పెట్టాడు .

🌿 మనస్సు పవిత్రంగా లేకుండా
ఏ నదీస్నానం చేసినా ఉపయోగం ఉండదు . అలా చెయ్యడం వల్ల పాపమే గాని పుణ్యం రాదు .

🌸అసలు ఈ తీర్థయాత్రలకంటే సత్యం , భూతదయ , శుచిత్వం కలిగి ఉండటం ముఖ్యం . ఇవన్నీ ఉంటే వాళ్ళ పాదాల క్రిందకి అన్ని తీర్థాలు అవే వస్తాయి .

🌿అయిన ముఖ్యమైనవి మూడు ఉన్నాయి . అవి నైమిశం , చక్రతీర్థం , పుష్కరం . ఈ మూడు భూలోకంలో పవిత్రమైన తీర్థాలని చెప్పాడు చ్యవన మహర్షి .

🌸ప్రహ్లాదుడు అన్నీ విని భక్తితో చ్యవన మహర్షిని ఆశ్రమానికి పంపించాడు ...

ఇదీ చ్యవన మహర్షి కథ...రేపు మరో మహర్షి చరిత్ర తెలుసుకుందాము స్వస్తి.

No comments: