Adsense

Thursday, October 27, 2022

35వ మహర్షి.. తండి మహర్షి

మన మహర్షుల చరిత్ర..

 35వ తండి మహర్షి గురించి తెలుసుకుందాం

🌿పూర్వం తండి అనే పేరుగల బ్రాహ్మణుడుండేవాడు . అతడు బ్రహ్మచర్యం తీసుకుని అన్ని వేదాలు శాస్త్రాలు చదివి యోగి , జ్ఞాని , మహర్షి అయ్యాడు .

🌸సమాధిలో ఉండి పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు . పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు . తండి పరమేశ్వరుడ్ని చూసి ఆనందంతో

🌿 ఓ పరమేశ్వరా ! యోగీశ్వరులు ఎప్పుడూ ఎవరినైతే గొప్పవాడని స్తోత్రం చేసి , ప్రధానమైనవాడని భావించి , పురుషుడని పూజచేసి , అధిష్టాన దేవతని అర్చన చేసి , ఈశ్వరుడని ఎంచి ఊహిస్తారో అతడే నువ్వు .

🌸 నువ్వు అజుడివి , అనాదినిధనుడివి , విభుడివి , ఈశానుడివి , అత్యంతసుఖివి , అనఘుడివి . నిన్ను నేను భక్తితో శరణు కోరుతున్నాను అన్నాడు .

🌿పరమేశ్వరుణ్ణి చూసిన తండికి ఇంకా ఆనందం తగ్గక పరమేశ్వరా ! కామ క్రోధాలు నువ్వే , ఊర్థ్వ అధోభాగాలు నువ్వే , బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నువ్వే , నిత్యానందుడవు ,

🌸 పరమపదమవు , దేహకర్తవు , దేహభర్తవు , దేహివి , ప్రాణగతివి అన్నీ నువ్వే . జనన మరణాలు కలిగించేది నువ్వే .

🌿దిక్కులు , యుగాలు , అయనాలు నువ్వే . రాత్రి పగలు చెవులు , కళ్ళుగా , పక్షాలు శిరస్సుగా మాసాలు భుజాలుగా , ఋతువులే వీర్యముగా , మాఘమాసం ధైర్యంగా , సంవత్సరాలు పాదాలుగా అంతట నువ్వే నిండి వున్నావు .

🌸ఈ విధంగా స్తోత్రం చేసిన తండి మహర్షి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు వత్సా ! నువ్వు తేజశ్శాలివి , కీర్తిమంతుడివి , జ్ఞానివి , ఋషుల్లో గొప్పవాడివి అవుతావు .

🌿నీకేం కావాలో అడగమన్నాడు . ఈశ్వరా ! నీ దయకంటే నాకు కావలసింది ఏమీ లేదు . ఎప్పుడూ నాకు నీ పాదాల దగ్గరే భక్తితో ఉండేటట్లు అనుగ్రహించమన్నాడు తండి మహర్షి .

🌸తర్వాత తండి ఒక ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు . ఉపమన్యు మహర్షి తండి దగ్గరకు వచ్చి పరమేశ్వరుడి సహస్ర నామాలు చెప్పమని అడిగాడు .

🌿ఇంతకు ముందు దేవతలకి పదివేల నామాలు బ్రహ్మ చెప్పాడు . వాటి నుండి వెయ్యి నామాలు స్వర్గలోకంలో వున్న వాళ్ళకోసం బ్రహ్మ ఇచ్చాడు .

🌸 భూలోక వాసుల కోసం తండి వెయ్యి నామాలు భూలోకంలోకి తెచ్చాడు . దీన్నే ' తండికృత శివసహస్రనామస్తోత్రం ' అన్నారు .

🌿ఆ వెయ్యి నామాల గురించి తండి మహర్షి ఉపమన్యుకి చెప్పాడు .
అందులో నామాలు మనం కూడా పలుకుదాం . అన్నీ ఎలాగూ చెప్పుకోలేం కదా ...

🌸స్థిరుడు , స్థాణువు , ప్రభువు , భీముడు , ప్రవరుడు , వరదుడు , వరుడు , సర్వాత్మ , జటి చర్మా శిఖండి , ఖచరుడు , గోచరుడు మొదలైనవి . ఇలా వెయ్యి నామాలు జపిస్తే అనుకున్న పనులు జరిగి ముక్తి పొందుతారు .

🌿చూశారా ! మనకి కష్టం లేకుండా ముక్తి వచ్చే ఉపాయం తండి మనకి చెప్పాడు . వాళ్ళందరు అంతంత తపస్సులు చేసి మన కోసం శివసహస్రనామస్తోత్రం ఇచ్చి మనం సులభంగా ముక్తి పొందేలా చేశాడు . తండి మహర్షి !

🌸ఇదండీ తండి మహర్షి చరిత్ర

No comments: