Adsense

Thursday, October 27, 2022

36వ మహర్షి దత్తాత్రేయ మహర్షి

 మన మహర్షుల చరిత్ర...
 36వ దత్తాత్రేయ మహర్షి గురించి తెలుసుకుందాం

🌿ఇపుడు మనం దత్తాత్రేయ మహర్షిని గురించి చదవడం మొదలు పెట్టేదాం . ఎందుకంటే బ్రహ్మ , విష్ణు , ఈశ్వర అంశలో పుట్టాడాయన .

🌸గొప్ప మహర్షి . పూర్వం కౌశికుడనే బ్రాహ్మణుడి భార్య సూర్యోదయం అవగానే తన భర్త మరణిస్తాడని తెలిసి తన పాతివ్రత్యంతో సూర్యోదయాన్నే ఆపేసింది .

🌿సూర్యుడు ఉదయించకపోతే ఇంకేమన్నా ఉందా ! అందుకే అందరూ అత్రి మహాముని భార్య అనసూయని ప్రార్థించారు .

🌸అనసూయ కౌశిక పత్నిని ఓదార్చి సూర్యోదయం అయ్యేటట్లు కౌశికుడు బ్రతికేటట్లు చేసింది . బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనసూయ పాతివ్రత్యానికి మెచ్చి ఏంకావాలో అడగమన్నారు .

🌿మీ ముగ్గురి అంశతో ఒక కొడుకు కావాలని అడిగింది . కోరుకున్నట్లే అనసూయకి కొడుకు పుట్టాడు . ఆయనే దత్తాత్రేయుల వారు .

🌸చిన్నప్పటినుంచీ దత్తాత్రేయుడు గొప్ప యోగి . మిగిలిన మునుల పిల్లలు ఇతణ్ణి వదలకుండా తిరుగుతున్నారు .

🌿దత్తాత్రేయుడికి పిల్లలందరూ తన దగ్గరే ఉంటుంటే తపస్సు చేసుకోవడానికి వీలుపడట్లేదని వాళ్ళని ఎలా అయినా తప్పించుకోవాలని ఒక నది నీళ్ళల్లో వుండిపోయాడు .

🌸పిల్లలు కూడా అక్కడే వుండిపోయారు . దత్తాత్రేయుడు లక్ష్మీదేవితో పాటు పైకి వచ్చి ఆటలు పాటలు మొదలెట్టేసరికి పిల్లలు అతణ్ణి అసహ్యించుకుని వెళ్ళిపోయారు .

🌿ఇలా ఎందుకు చేశాడో పిల్లలకేం తెలుస్తుందీ , యోగులకి మాత్రమే తెలుస్తుంది . రాక్షస వీరులైన జంభుడు మొదలైన వాళ్ళు ఇంద్రుడి మీద యుద్ధానికి వచ్చారు .

🌸వాళ్ళతో యుద్ధంలో దేవతలు గెలవలేక బృహస్పతిని సలహా అడిగారు . అత్రి మహర్షి కొడుకు దత్తాత్రేయుడు మీకు సహాయం చేస్తాడని చెప్పాడు బృహస్పతి .

🌿అందరూ కలిసి దత్తాత్రేయుణ్ణి పూజచేశారు . దత్తాత్రేయుడు యుద్ధం చెయ్యడం నావల్ల కాదన్నాడు .

🌸మహాత్మా ! నీ దగ్గర ఉన్నది లక్ష్మీదేవనీ , నీవు విష్ణుమూర్తివనీ సర్వసమర్ధుడివనీ మాకు తెలుసు . కరుణించమని వేడుకున్నారు .

🌿దత్తాత్రేయుడు మీరు అన్నీ తెలుసుకున్నారు కదా . వెళ్ళి ఆ రాక్షసుల్ని యుద్ధం వంకతో ఇక్కడికి తీసుకురండి .

🌸క్షణంలో వాళ్ళని చంపుతానన్నాడు . జంభుడు సైన్యంతో అక్కడికి వచ్చి లక్ష్మీదేవిని చూసి ఆమెని దొంగతనంగా తీసుకెళ్ళిపోయాడు .

🌿దత్తాత్రేయుడు దేవతలతో ఇప్పుడు రాక్షసులు బలహీనులయ్యారు . యుద్ధం ప్రారంభించండి అన్నాడు . దేవతలు రాక్షసుల్ని క్షణంలో చంపారు

🌸ఆ రోజుల్లో హైహయవంశం వాడు కార్తవీర్యార్జునుడు రాజ్యం నేను పాలించలేను తపస్సు చేసుకుని యోగసిద్ధి పొందటానికి వెళ్ళిపోతానన్నాడు .

🌿దత్తాత్రేయుడ్ని ఆరాధిస్తే నీకు కావలసినవన్నీ దొరుకుతాయని చెప్పాడు గర్గ మహర్షి .

🌸కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుణ్ణి పూజచేసి ఆయన పెట్టిన పరీక్షలన్నింటికీ నిలబడి అనుగ్రహం పొందాడు . అప్పుడు కార్తవీర్యుడికి చేతులు ఎన్ని వచ్చాయో తెలుసా ?

🌿వెయ్యి చేతులు అంతేకాదు , ఇంకా భూమి మొత్తాన్ని పాలించగల సమర్ధత , సిరిసంపదలు , భూలోకంలోను , పాతాళలోకంలోను కూడ తిరగ గలిగేలా రథం ,

🌸ధర్మకార్యాల మీద మనస్సు లగ్నమయ్యేటట్లు వరం పొందాడు .
ఇవన్నీ ఇచ్చేను కాని ఎప్పుడయితే అధర్మంగా మహర్షుల్ని బాధపెడతావో అప్పుడే నువ్వు చస్తావ్ ! అని షరతు కూడా పెట్టాడు దత్తాత్రేయుడు .

🌿ఆయన అన్నట్లే చివరికి ఈర్యతో జమదగ్ని మహర్షిని కామధేనువు కోసం చంపినందుకు పరశురాముడి చేతిలో చచ్చిపోయాడు .

🌸ఎంత గొప్ప వరాలు పొందినా కార్తవీర్యార్జునుడి అసూయే ఆయన్ని నాశనం చేసింది . అందుకే పెద్దవాళ్ళు అసూయ ఉండకూడదూ .... అని చెప్తుంటారు .

🌿అలర్కరాజు దత్తాత్రేయుణ్ణి స్వామీ ! స్థిరంగా ఉండే జ్ఞానం నాకు ఉపదేశించండి అనడిగాడు . దానికి దత్తాత్రేయుడు రాజా ! నాది అనే మాటని విడిచి పెట్టు .

🌸నాది అనేది అహంకారంలో పుట్టి , మమకారం అనేటువంటి మొదలు కలిగి , గృహం అనే చిగుళ్ళు వేసి భార్య పిల్లలు అనే కొమ్మలతో , ధనం ధాన్యం అనే పెద్ద ఆకుల్తో ,

🌿పుణ్యం పాపం అనే పువ్వులు పూసి , సుఖం దుఃఖం అనే పండ్లు పండి ఎంతో కాలం ఇలాగే ఉండి , అజ్ఞానం అనే వేళ్ళతో ముక్తి మార్గాన్ని కప్పేస్తున్న దాన్ని విద్య అనేటటువంటి గొడ్డలి తీసుకుని ,

🌸ధర్మకార్యాలు మంచివాళ్ళతోనే కలిసి ఉండడం అనే రాయి మీద పదును పెట్టి ఎవరయితే నరికేస్తారో వాళ్ళకే నిత్యానందం దొరుకుతుంది .

🌿ఇంకా ఇలా చెప్పాడు . సర్వసంగ పరిత్యాగం వల్ల నాది అన్నదిపోయి , వైరాగ్యం దానివల్ల జ్ఞానం , మోక్షం వస్తాయన్నాడు .

🌸రాజా ! యోగి ముందుగా మనస్సుని జయించాలి . గౌరవాన్ని విషంగానూ , అవమానాన్ని అమృతంగానూ అనుకుని తను ఎక్కడుంటే అదే ఇల్లుగా అనుకుని దొరికినదే ఆకలికి తిని ,

🌿తనకి ఉన్నదే ధనంగా అనుకుని నాది అన్నమాటని వదిలి పెట్టినప్పుడే యోగపురుషుడవుతాడు అని చెప్పాడు .

🌸అలర్కుడు దత్తాత్రేయుడు చెప్పినట్లుగా నడుచుకుని కొడుకుకి రాజ్యం ఇచ్చి తపస్సు చేసుకుని యోగి అయ్యాడు .

🌿దత్తాత్రేయుడు విల్లు అమ్ములు పట్టుకుని రెండు వేటకుక్కలు కూడా వస్తుంటే చెంచువాడిలా ఉంటాడు . ఇదీ దత్తాత్రేయ మహర్షి కథ !

No comments: