Adsense

Saturday, October 29, 2022

62వ మహర్షి.. మృగశృంగ మహర్షి

 మన మహర్షుల చరిత్రలు..
 62వ మృగశృంగ మహర్షి గురించి తెలుసుకుందాం


🌿మనం తెలుసుకోబోయే మహర్షి పేరు మృగశృంగ మహర్షి . పేరు గమ్మత్తుగా వుంది కదూ ! మృగం అంటే లేడి . శృంగం అంటే కొమ్ములు అని అర్థం .

🌸కానీ ఈ పేరేమిటో ? ఈ మహర్షి గొప్పతనం ఏమిటో ? తెలుసుకోండి మరి ... పూర్వం కృతయుగంలో కుత్సుడనే బ్రాహ్మణుడుండేవాడు . వేదశాస్త్ర విద్యలు నేర్చుకుని కర్దమ ప్రజాపతి కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడు .

🌿కొంతకాలం తర్వాత వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు . అతని పేరు వత్సుడు . వత్సుడు పెరిగి పెద్దవాడయి శ్రద్ధా భక్తుల్లో బ్రహ్మచర్యం పాటిస్తూ వేదశాస్త్ర విద్యలన్నీ నేర్చుకుని కావేరి నది పశ్చిమతీరానికి చేరాడు .

🌸కావేరీ నది ప్రవహించిన భూభాగంలో పశ్చిమ భాగం పవిత్రమైంది . అక్కడ మూడు నెలలు తపస్సు చేసి తత్త్వజ్ఞానం పొంది అక్కడినుంచి బయల్దేరి సహ్యజానది ఉత్తరభాగంలో ఉన్న నారాయణాద్రిలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని తపస్సు ప్రారంభించడు

🌿నారాయణాద్రికి దగ్గర్లో కళ్యాణ తీర్థంలో స్నానం చేసి తపస్సు చేస్తూ ఆత్మజ్ఞానంతో ఆనందాన్ని పొందేవాడు వత్సుడు .

🌸కొంతకాలం తపస్సు చేస్తూ శరీరాన్ని మర్చిపోయాడు . మహర్షి శరీరం ఎండు కట్టెలా అయిపోయింది . అక్కడ తిరిగే లేళ్ళు వాటి కొమ్ముల్ని వత్సుడు శరీరానికి రాసుకుని వెడుతుండేవి .

🌿అందుకే వత్సుణ్ణి మృగశృంగుడని అక్కడి మునులు పిలిచేవాళ్ళు . మృగశృంగుడు తన తపశ్శక్తితో విష్ణుమూర్తిని దర్శించి స్తుతించి స్వామీ ! నన్ను కాపాడమని ప్రార్థించాడు .

🌸విష్ణుమూర్తి మహర్షీ ! నువ్వు వచ్చే జన్మలో ఋభువసు మహర్షిగా పుడతావు . అదే నీ చివరి జన్మ . ఇప్పటి వరకు నువ్వు బ్రహ్మచర్యంతో ఋషుల్ని సంతోషపెట్టావు .

🌿ఇప్పుడు యజ్ఞం చేసి పితృదేవతల్ని సంతోషపెట్టమని చెప్పి మహర్షి కోరిక ప్రకారం ఆ తీరంలో వెలిశాడు విష్ణుమూర్తి .

🌸మృగశృంగ మహర్షి ఇంటికి వచ్చి జరిగింది తల్లిదండ్రులకి చెప్పాడు . కుత్సుడు ఉతథ్య మహర్షి కూతురు సువృత్త నిచ్చి మృగశృంగుడికి పెళ్ళి చెయ్యాలని నిశ్చయించుకున్నాడు .

🌿ఒకనాడు సువృత్త ముగ్గురి చెలికత్తెలతో కలిసి కావేరిలో స్నానం చేసి వస్తుండగా ఒక ఏనుగు తరుముకు వచ్చింది .

🌸వాళ్ళు భయంతో పరిగెడుతూ ఒక పాడుపడ్డ నూతిలో పడి చనిపోయారు .

🌿మృగశృంగుడికి విషయం తెలిసి వాళ్ళ శరీరాన్ని జాగ్రత్తగా చూడమని అక్కడి వాళ్ళకి చెప్పి సహజనదిలో కంఠందాకా నీళ్ళలో మునిగి యమధర్మరాజు కోసం తపస్సు చేసి నలుగుర్నీ బ్రతికించాడు .

🌸మృగశృంగుడికి సువృత్తకి పెళ్ళి జరిగింది . చెలికత్తెలు ముగ్గురు కూడా మమ్మల్ని నువ్వే బ్రతికించావు కనుక మమ్మల్ని పెళ్ళి చేసుకోమన్నారు మృగశృంగ మహర్షిని .

🌿వ్యాస మహర్షి సలహా మీద వాళ్ళని కూడా పెళ్ళి చేసుకున్నాడు మృగశృంగుడు . వాళ్ళ నలుగురికి నలుగురు కొడుకులు పుట్టారు .

🌸కొంతకాలం తర్వాత మృగశృంగుడికి సంసారం మీద విరక్తి వచ్చి అందర్నీ వదిలేసి తపస్సు చేసుకుందుకు అడవిలోకి వెళ్ళి అక్కడ మృగాల్లో తిరుగుతూ జీవితాన్ని ప్రశాంతంగా గడిపి చివరికి శరీరాన్ని వదిలేశాడు .

🌿విష్ణుమూర్తి చెప్పినట్లుగా తర్వాత జన్మలో ఋభువసువనే పేరుతో పుట్టి చివరికి మోక్షం సాధించాడు . 

🌸ఇదీ మృగశృంగ మహర్షి కథ !! చూశారా తపశ్శక్తితో యమధర్మరాజునే లొంగదీసుకుని చనిపోయిన వాళ్ళని బ్రతికించుకున్నాడు .

🌿అంతటి గొప్ప మహర్షి రేపు మరో మహర్షి విశేషాలు తెలుసుకుందాము స్వస్తి.

No comments: