Adsense

Saturday, October 29, 2022

63వ మహర్షి.. మైత్రేయ మహర్షి

 మన మహర్షుల చరిత్రలు
63వ మైత్రేయ మహర్షి గురించి తెలుసుకుందాం


🌿మైత్రేయుడు ఎంత గొప్పవాడంటే తల్లి గర్భంలో వుండగానే ధర్మశాస్త్రాలు , వేదవేదాంగాలు అన్నీ నేర్చేసుకున్నాడు .

🌸చిన్నతనంలోనే రాక్షసులందర్నీ నాశనం చేసే యజ్ఞం చేశాడు . పులస్త్య బ్రహ్మర్షి దగ్గర దివ్యజ్ఞానసిద్ధి పొందాడు .

🌿 ఒకసారి గురువు పరాశర మహర్షిని మీ దగ్గర విద్యలన్నీ నేర్చుకున్నాను . దేవతలందరికీ మూలమైన భగవంతుడు విష్ణుమూర్తె అంటారు కదా .

🌸ఆయన తత్వాన్ని నాకు వివరించండని అడిగాడు మైత్రేయ మహర్షి . ఇవే కాకుండా భూమి మొదలైన భూత ప్రమాణాలు , సప్తసాగరాలు , సప్తద్వీపాలు , సప్తకులపర్వతాలు ,

🌿సూర్యగ్రహం మొదలైన వాటి సంచారాలు , చతుర్విధ భూతనిర్మాణం , చతుర్ధశ మన్వంతరాలు , చతుర్యుగ ప్రమాణాలు , కల్పకల్ప విభాగం , యుగధర్మాలు , దేవర్షి చరిత్రలు ,

🌸బ్రాహ్మణ వర్ణధర్మాలు , బ్రహ్మచర్యం మొదలైన వాటి గురించి కూడ చెప్పమన్నాడు . పరాశరుడు ఆనందంతో విష్ణుతత్త్వం గురించి చక్కగా వివరంగా చెప్పాడు మైత్రేయుడికి .

🌿మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం . పుట్టడం , చావడం మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం ఇవన్నీ ఏ జీవికి ఒకే చోట జరగదు .

🌸ఎవరి కర్మని బట్టి వాళ్ళకి జరుగుతూ ఉంటుంది . డబ్బు సంపాదించడం , దాచడం , ఖర్చు పెట్టడం , ఇదంతా దుఃఖానికే , కాని , ఎవరికేనా చాలా డబ్బుంది అంటే అది సంతోషపడే విషయం కాదు .

🌿 స్త్రీలు , స్నేహితులు , చుట్టాలు , పిల్లలు , ఇళ్ళు , పొలాలు ఇవన్నీ పోవడం రావడం వల్ల కష్టమే గాని సుఖముండదు .

🌸అసలు దుఃఖానికి కారణం మనం చేసే పని . అది విత్తనం . అదే చెట్టులాగ పెరిగి పెద్దదవుతుంది . పుడుతూ ఉండడం ,

🌿రోగాలు , వృద్ధాప్యంతో బాధపడుతూ ఉండడం ఇవన్నీ లేకుండా భగవన్నామం చేసుకుని మోక్షానికి ప్రయత్నించడమే మంచిదని జ్ఞానులు చెప్తున్నారని అన్నీ వివరంగా పరాశరుడు మైత్రేయ మహర్షికి చెప్పాడు .

🌸 మైత్రేయుడు అన్ని తీర్థాలు తిరుగుతూ కామ్యకవనంలో పాండవుల్ని చూసి బాధపడి దుర్యోధనుడికి బుద్ధి చెప్పాలని వాళ్ళదగ్గరకి వెళ్ళాడు .

🌿 ధృతరాష్ట్రుడు మహర్షిని సత్కరించి పాండవులెలా వున్నారని అడిగాడు . మహామునుల దీవనలందుకుంటున్న పాండవులకి కష్టాలెందుకుంటాయి ? వాళ్ళు ధర్మం తప్పితే సూర్యచంద్రులు గతులు తప్పుతారు .

🌸బలంలో ఒక్కక్కడు నూరేసి ఏనుగులకి సమానమని చెప్పాడు మైత్రేయుడు . మైత్రేయ మహర్షి చెప్తుంటే దుర్యోధనుడు తొడలు కొట్టుకుంటూ కూర్చున్నాడు .

🌿 దుర్యోధనా ! నా మాట లక్ష్య పెట్టక నన్ను గౌరవించని నువ్వు భీముడితో తొడమీద గదతో కొట్టించుకుని ఛస్తావ్ ! అని శపించాడు మైత్రేయుడు .

🌸దృతరాష్ట్రుడు మైత్రేయుడి కాళ్ళమీదపడి క్షమించమన్నాడు . మైత్రేయుడు వినకుండా కోపంతో వెళ్ళిపోయాడు .

🌿కొంతకాలం తర్వాత విదురుడు మైత్రేయుడి దగ్గరికి వెళ్ళి గంగానది దగ్గర ఇసుక మీద పద్మాసనం వేసుకుని,

🌸 ఇంద్రియాల్ని అరికట్టి ఆచార , వ్రతాల , ఉపవాసాల్లో కృశించిపోయిన పుణ్యపురుషుడయిన మైత్రేయ మహర్షి పాదాలకి నమస్కారం చేసి మహర్షి ! భగవంతుడు స్వతంత్రుడైనా ఎన్నో అవతారాలెత్తుతాడు కదా ...

🌿 ఏఏ పన్లు చేశాడు ? ఏ తత్వాలు బోధించాడు ? ఇల్లాంటి విషయాలన్నీ తెలుసుకోవాలనుంది వివరంగా చెప్పమని అడిగాడు .

🌸మైత్రేయ మహర్షి విదురుడితో లోకానికంతకి ఈశ్వరుడు హరి . జీవుడు భగవంతుడి మీద ఆధారపడ్డాడు . నారాయణుడు అన్నింటికీ తాను ఆధారమవుతాడు కానీ , తాను ఆధారపడడు .

🌿 హరి భజన వల్ల సమస్త కష్టాలు పోతాయని చెప్పాడు . విష్ణుమూర్తి అవతారాలు అన్నింటి గురించి కూడా చెప్పించుకుని విని విదురుడు ఆనందంగా వెళ్ళిపోయాడు .

🌸 ఒకసారి మైత్రేయుడి ఆశ్రమానికి వ్యాసుడు చెప్పకుండా వచ్చాడు . మైత్రేయుడు భక్తితో పూజచేసి చక్కటి భోజనం పెట్టి స్వామీ ! మీరాక నాకు చాలా ఆనందంగా వుంది . మీరాకకు కారణం చెప్పండన్నాడు .

🌿మహర్షీ ! తపము , దానము ఈ రెండింటిలో ఏది గొప్పదో తెలుసా ! దానమే గొప్పది . అలాగే దానాలన్నింటిలో అన్నదానం చాలా గొప్పది .

🌸ఎందుకంటే ప్రాణం శరీరంలో ఉంటుంది . శరీరానికి బలం అన్నం వల్లనే వస్తుంది . జ్ఞానవంతులు అన్నదానం చేస్తారు . తపము , విద్య , దానము , ధర్మగుణాన్ని పెంచుతాయి .

🌿 ఉన్నతమైన విద్య భగవంతుణ్ణి చూపించే మార్గం . నువ్వు చేసిన అన్నదానం వల్ల నేను ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పి వ్యాసుడు మైత్రేయుణ్ణి అభినందించి వెళ్ళిపోయాడు .

🌸ఇది  ! మైత్రేయ మహర్షి కథ !! మైత్రేయ మహర్షి చెడ్డవాడయిన దుర్యోధనుణ్ణి బాగుచేద్దామని మంచి మాటలు చెప్పినా వినలేదని శపించాడు .

🌿 వినయ విధేయతలు గల విదురుడికి విష్ణుతత్వాన్ని బోధించాడు . తాను వ్యాసుడి నుండి తపంకంటే కూడ దానం అందులో అన్నదానం గొప్పదని తెలుసుకున్నాడు .

🌸స్వస్తి 

No comments: