Adsense

Saturday, October 29, 2022

71వ మహర్షి.. వ్యాఘ్రపాద మహర్షి

మన మహర్షుల చరిత్రలు..
71వ వ్యాఘ్రపాద మహర్షి గురించి తెలుసుకుందాం

🌿ఇప్పుడు మనం వ్యాఘ్రపాద మహర్షి గురించి తెలుసుకుందాం . పేరు అలా వుందేంటి ? అనిపిస్తోందా ! ఆయన పాదాలు పెద్ద పులి పాదాల్లా వుంటాయని ఆయనకా పేరు వచ్చింది .

🌸అంతేకాదు వ్యాఘ్రపాదుడు జంతువుల్లో వుండే కామం , క్రోధం , మదం , మాత్సర్యం అనే నాలుగు చెడ్డ గుణాలని వదిలేసి వాటి యందు వ్యాఘ్రంలా వుండేవాడు ,

🌿ఈయన ధర్మ ప్రవచన దక్షుడు. వేద వేదాంగ విదుడు. ఆయనకున్న పులి పాదాల కారణంగా జంతువుల యెడల భయంకరంగా సంచరించేవాడు.

🌸 అందుకే ఆయనకు వ్యాఘ్ర పాదుడు అనే పేరు వచ్చింది. పురాణాలలోనూ ఈ మహర్షి గురించి ఘనమైన ప్రస్తావనలే ఉన్నాయి.

🌿 లభిస్తున్న ఆధా రాలను బట్టి ఈయన భారతదేశంలోని తమిళనాడుకు చెందిన వారు. అక్కడి చిదంబరం ఆలయ ప్రాంగణంలో గల నటరాజ స్వామి (శివుడు)కి వ్యాఘ్రపాదుడు పరమ భక్తుడు.

🌸ఆయనకు నిత్యం భక్తిశ్రద్ధలతో పూజలు ఆచరించేవాడు. ఈ క్రమంలో నటరాజును అర్చించేందుకు.. తేనె టీగలు తాకని పూలను సేకరిస్తుండే వాడు ఈ మహర్షి.

🌿అయితే, పుష్పాలు కోసి, సేకరించే సమ యంలో వ్యాఘ్రపాదుడు ముళ్లు ఇంకా పెద్ద బండరాళ్ల కారణంగా గాయాలకు గురయ్యే వాడు.

🌸ఈ మహర్షి తన పట్ల చూపిస్తున్న భక్తి శ్రద్ధలకు, తనను పూజించడం కోసం సేకరిస్తున్న పూల కోసం పడుతున్న కష్టాలకు చలించిన శివుడు..

🌿ఈ మహర్షికి పులి పాదాలను ప్రదానం చేశాడు. దీంతో పువ్వులు కోసేటప్పుడు పాదాలు కఠినమైన పరిస్థితులకు గురయ్యే బాధ తప్పింది. శివుని వర ప్రభావంతో పులి పాదాలను పొందిన కారణంగా అప్పటి నుంచి వ్యాఘ్రపాదుడు అనే పేరు స్థిరపడింది.

🌸తమిళనాడులోని చిదంబరం వెళ్లినపుడు, అక్కడి నటరాజ స్వామి పక్కన సర్ప పాదాలతో, పులిపాదాలతో నిల్చుని ఉన్న ఇద్దరు మహర్షులు నటరాజ స్వామిని ప్రార్థిస్తున్న చిత్రాలను చూడ వచ్చు.

🌿 అందులో పాము పాదాలతో ఉన్న మహ ర్షిని పతంజలి మహర్షి అనీ, పులి పాదాలతో ఉన్న మహర్షిని వ్యాఘ్రపాదుడని అంటారు.

🌸 వ్యాఘ్రపాదుడు సగం పులి శరీరం, మిగతా సగం మానవ శరీరం కలిగి ఉంటాడు. వ్యాఘ్రపాదుడు ఒక ముని కన్యను వివాహం చేసుకున్నాడు.

🌿 అనంతరం గృహస్థ ధర్మాలను ఆచ రించాడు. ఈయనకు ఇద్దరు కుమారులు కలిగారు. పెద్ద కుమారుని పేరు ఉపమన్యుడు. రెండో కుమారుని పేరు ధౌమ్యుడు.

🌸వీరిద్దరూ కూడా తల్లిదండ్రుల ఆశీర్వాద బలంతో మహా యోగిగా, మహర్షిగా భారతీయ రుషి పరంపర చరిత్రలో నిలిచిపోయారు.

🌿ఉపమన్యుడు శివుని యొక్క కటాక్షం పొంది మహా జ్ఞాని, మహా యోగి అయ్యాడు. బాల్యంలో ఒకనాడు ఉపమన్యుడు తల్లిని పాలు అడుగుతాడు.

🌸ఆమె లేదని చెప్పి చింతిస్తుంది. మనకన్నీ ఇచ్చే వాడు శివుడేనని, అతనినే అడగాలని తల్లి అంటుంది. దీంతో ఉపమన్యుడు శివధ్యానం చేసి ఏకంగా పాల సముద్రాన్నే పొందుతానని ప్రతిన చేస్తాడు.

🌿వెయ్యేళ్లు శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. పట్టుదలలో అంతటి మేటి ఉపమన్యుడు. ఉప మన్యుని కథ మహా భారతంలోని అనుశాసనిక పర్వంలో ఉంటుంది.

🌸అయితే, ఇది తిక్కన భారతంలో లేదు.అలాగే, రెండవ కుమారుడు ధౌమ్యుడు మహర్షి అయ్యాడు. అనంతర కాలంలో పాండవు లకు పురోహితుడిగానూ వ్యవహరించాడు.

🌿ఒకసారి వ్యాఘ్రపాదుడు కాశికా పట్టణం వెళ్ళి కాశీ విశ్వేశ్వరుడిని భక్తితో స్తోత్రం చేశాడు . దాన్నే మనం ఇప్పటికీ విశ్వనాథాష్టకం అంటూంటాం .

🌸 ‘‘గంగా తరంగ కమనీయ జటా కలాపం..’’ అంటూఎనిమిది పాదాలతో సాగే అష్టకం చివరిలో ‘‘వ్యాఘ్రోక్త మష్టక మిదం పఠతే మనుష్య:..’ అని ముగుస్తుంది.

🌿కాశీ విశ్వేశ్వరుడు వ్యాఘ్రపాదుని భక్తిప్రపత్తులతకు సంతోషించి, అతనికి సాక్ష్యాత్కరించి కోరిన వరాలను ఇచ్చాడు

🌸ఏ యుగాలకి ఏ ధర్మాలు చెప్పారో అవి పాటించాలిగాని ధర్మప్రవక్తల్ని తిట్టకూడదన్నాడు వ్యాఘ్రపాదుడు .

🌿వ్యాఘ్రపాద స్మృతిలో బ్రహ్మచారి , గృహస్థు , యతి , వానప్రస్థుడు మొదలైన వాళ్ళకి సంబంధించిన విషయాలు వాళ్ళు ఆచరించాల్సిన విషయాలు ఉన్నాయి

- స్వస్తి

No comments: