Adsense

Saturday, October 29, 2022

73వ మహర్షి.. వ్యాసమహర్షి

మన మహర్షుల చరిత్రలు..!!

 73వ మహర్షి.. వ్యాసమహర్షి గురించి తెలుసుకుందాం


🌸ఇప్పుడు మనం కారణజన్ముడు పరమేశ్వర స్వరూపుడు, మహర్షుల్లో గొప్పవాడు అయిన వ్యాస మహర్షిని గురించి తెలుసుకుందాం. ఈయన చాలా చాలా గొప్ప మహర్షి.

🌿ఆదికాలంలో ప్రజాసృష్టికోసం విష్ణుమూర్తి నాభినుంచి బ్రహ్మని పుట్టించాడు. మిగిలిన సృష్టి మొత్తం బ్రహ్మకి అప్పగించాడు. విష్ణుమూర్తి ముఖం నుంచి వేదాలు ఆవిర్భవించాయి. తన మనస్సు నుంచి అపాంతరతముడనే పేరుగల వాణ్ణి పుట్టించి వేదాలన్నీ నేర్చుకోమని చెప్పాడు విష్ణుమూర్తి.

🌸అపాంతరతముడు విష్ణుమూర్తి చెప్పినట్లు వేదాలన్నీ నేర్చుకున్నాడు. విష్ణుమూర్తి అతడిని అన్ని మన్వంతరాల్లోను పుట్టి వేదాలు వ్యాపింపచేస్తాడని, విష్ణుతత్త్వం గ్రహించి ముల్లోకాల్లోనూ ధర్మాలన్నీ తెలుసుకుని గొప్ప ఋషి అవుతాడని,

🌿తర్వాత కాలంలో వసిష్ఠుడికి మనుమడయిన పరాశరుడికి పుట్టి వేదాలు వ్యాప్తి చేసి, అందరి ధర్మ సందేహాలు తీర్చి లోకహితం కోసం శ్లోకాలుగా రాస్తాడని చెప్పాడు. పూర్వం పరాశర మహర్షి తీర్థ యాత్రలు చేస్తూ యమునానదీ తీరానికి వచ్చి ఒక నావ మీద ఎక్కాడు.

🌸దాశరాజు కూతురయిన సత్యవతి ఆ నావ నడుపుతోంది. ఆమెని చూసి ఇష్టపడ్డాడు. పరాశరుడు దివ్యదృష్టితో ఆమో పూర్వ జన్మ గురించి తెలుసుకుని తన కోరిక ఆమెకి చెప్పాడు. వాళ్ళకి వేదమయుడైన వేద వ్యాసుడు కలిగాడు.

🌿పరాశరుడు కుమారుణ్ణి దీవించి సత్యవతికి చెప్పి తీర్థయాత్రలకి వెళ్ళిపోయాడు. వేదవ్యాసుడు లోక కళ్యాణం కోసం తపస్సు చెయ్యడానికి బయలుదేరి తల్లికి నమస్కరించి అమ్మా! మీకు అవసరమైనప్పుడు నన్ను తల్చుకోండి, నేను వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు.

🌸వేద వ్యాసుడు యమునా నదీ తీరంలో పుట్టాడు. కాబట్టి కృష్ణ ద్వైపాయనుడని వేదాల్ని విభజించినవాడవడం వల్ల వేదవ్యాసుడని, పరాశరుడి పారాశర్యుడని, సత్యవతీ పుత్రుడుగా సాత్యవతేయుడని కూడా పేర్లున్నాయి.

🌿వేదవ్యాసుడు ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఎంతోమంది శిష్యులతో వెలిగిపోతున్నాడు. కొంత కాలం తర్వాత కురువంశానికి రాజయిన శంతన మహారాజు సత్యవతిని పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు.

🌸సత్యవతి తండ్రి దాశరాజు ఒక షరతు పెట్టాడు. తన కూతురు సత్యవతికి పుట్టిన పిల్లలకే రాజ్యం ఇవ్వాలని శంతన మహారాజుకి చెప్పాడు. మహారాజు కుమారుడుగా అందుకు అంగీకరించలేదు.

🌿అతని మొదటి కొడుకు భీష్ముడు దాశరాజు మాటనే బలపర్చి తను పెళ్ళి చేసుకోకుండా ఉండిపోయి సత్యవతీ శంతనులకి పుట్టిన పిల్లలకే రాజ్యం ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు. దీన్నే భీష్మ ప్రతిజ్ఞ అంటారు.

🌸సత్యవతీ శంతనులకి పెళ్ళి జరిగింది. కొన్నాళ్ళకి వాళ్ళకి కొడుకులు చిత్రాంగదుడు విచిత్రవర్యుడు కలిగారు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయ్యాక శంతనుడు మరణించాడు. వాళ్ళల్లో చిత్రాంగదుడు గంధర్వులతో యుద్ధం చేసి మరణించాడు.

🌿భీష్ముడు విచిత్ర వీర్యుణ్ణి రాజుగా చేసి అతడికి పెళ్ళికూడ చేశాడు. విచిత్ర వీర్యుడికి పిల్లలు కలగలేదు. కానీ, కొంత కాలానికి అతడు కూడా మరణించాడు. సత్యవతి భీష్ముణ్ణి పెళ్ళిచేసుకోమని ఎంత చెప్పినా అతడు వినలేదు. నేను నా ప్రతిజ్ఞ ప్రకారం పెళ్ళి చేసుకోకూడదు చేసుకోను అన్నాడు భీష్ముడు.

🌸సత్యవతి తన కొడుకయిన వ్యాస మహర్షిని పిలిచి జరిగినదంతా చెప్పి తన కోడళ్ళకి పిల్లలు కలిగేటట్లు చూడు లేకపోతే వంశం నాశన మయిపోతుందని చెప్పింది. వ్యాసుడు అందుకు అంగీకరించి ఒక సంవత్సరం అంబిక అంబాలికల్ని పరి శుద్ధులవడానికి వ్రతం చేయించమన్నాడు.

🌿తర్వాత అంబిక అంబాలికల్ని వ్యాసుడి దగ్గరకి పంపించింది సంతానం కోసం సత్యవతి. వ్యాసుడి రూపం చూసి భయపడి కళ్ళుమూసుకున్న అంబికకి దృతరాష్ట్రుడు పుట్టు గ్రుడ్డితో పుట్టాడు.

🌸వ్యాసుణ్ణి చూసి అచేతనంగా అయిపోయిన అంబాలికకి పాండురోగంతో పాండురాజుపుట్టాడు. సత్యవతి అంబికకి నచ్చచెప్పి వ్యాసుడి దగ్గరకి వెళ్ళమంది. కానీ , అంబిక తన దాసిని పంపించింది. ఆ దాసి వ్యాసుడికి నమస్కరించి మహర్షిని భక్తి శ్రద్ధలతో సేవించింది.

🌿ఆమెకి యమధర్మరాజు విదురుడుగా మహాజ్ఞానిగా పుట్టాడు. తర్వాత కౌరవులు పాండవులు పుట్టడం పాండురాజు మరణించడం జరిగిపోయింది. వ్యాసభగవానుడు వచ్చి సత్యవతికి అమ్మా! రాబోయే కాలం అన్నీ కష్టాలేవుంటాయి.

🌸సంసారం మీద ప్రేమవదిలి నీ కోడళ్ళని కూడా తీసుకుని పుణ్యలోకాలు చేరడానికి ప్రయత్నించమని చెప్పాడు . తన కోడళ్ళతోపాటు తపస్సు చేసుకుని శరీరం విడిచిపెట్టింది సత్యవతి.

🌿లక్క యింట్లోంచి బయటపడిన పాండవులకి శాలిహోత్రుడి ఆశ్రమంలో వున్న కొలనులో స్నానం చేసిన వాళ్ళకి ఆకలి దాహం వుండవని వాళ్ళని కూడ అలా చెయ్యమని చెప్పాడు వ్యాసుడు.

🌸మత్స్యయంత్రం పడగొట్టాక ద్రౌపదిని అయిదుగురికి పెళ్ళి చెయ్యడం ఎలాగా అని ఆలోచిస్తున్న ద్రుపదుడికి ద్రౌపది పూర్వ జన్మ వృత్తాంతం చెప్పి పాండవులకి ద్రౌపదితో పెళ్ళి జరిపించాడు.
🌿ద్వైతవనంలో వున్న పాండువులు భీష్మ, ద్రోణ, కృపాచార్యుల్ని ఓడించగలమో లేదోనని సందేహిస్తున్న సమయంలో వ్యాస భగవానుడు వచ్చి “ప్రతిస్మతి ” అనే విద్యని ధర్మరాజుకి ఉపదేశం చేశాడు. దాన్ని ధర్మరాజు అర్జునుడికి ఉపదేశించాడు.

🌸దాని వల్ల అర్జునుడు తపస్సు చేసి దేవతల్ని మెప్పించి అస్త్రశస్త్రాల్ని సంపాదించాడు. దృతరాష్ట్రుడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు ఓడిపోతారా? కౌరవులు ఓడిపోతారా? అని అడిగినప్పుడు వ్యాసుడు పాండువులకే జయం కలుగుతుందని చెప్పాడు.

🌿సంజయుడు చెప్పినట్లు శ్రీకృష్ణుడు సాక్షాత్తు విష్ణుమూర్తేనని ఆయన చెప్పినట్లు సంధి చేసుకోవడం మంచిదని లేకపోతే యుద్ధం తప్పదని చెప్పాడు వ్యాసభగవానుడు.

🌸సమయం దగ్గర కొచ్చిందనీ, యుద్ధం తప్పదనీ, యుద్ధంలో కౌరవులు మరణిస్తారనీ చెప్పి ఎప్పటికప్పుడు యుద్ధం గురించి తెలియచెప్పే శక్తి సంజయుడి కిస్తున్నాను. అతడిని అడిగి విషయాలు తెలుసుకోమని దృతరాష్ట్రుడికి చెప్పి అంతర్ధానమయ్యాడు వ్యాసుడు.

🌿కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు మరణించాక దుఃఖంలో వున్న పాండవులని ఓదార్చాడు వ్యాసుడు. అశ్వత్థామ నారాయణాస్త్రం వ్యర్థమయిపోయిందని బాధపడ్తున్నప్పుడు నారాయణుడే శ్రీకృష్ణుడు అతని అంశ అర్జునుడూ అయినప్పుడు నీ అస్త్రం వాళ్ళ మీదెలా పనిచేస్తుందని అతని అజ్ఞానాన్ని పోగొట్టాడు వ్యాసభగవానుడు.

🌸అర్జునుడికి యుద్ధం చేస్తుంటే తనకంటే ముందు ఒక మహా పురుషుడు శూలంతో రాజుల్ని చంపుతున్నట్లు తను ఊరకే బాణాలు వేస్తున్నట్లు కనిపించింది. దీనికి అర్ధమేమిటని వ్యాస భగవానుణ్ణి అడిగాడు అర్జునుడు. శంకరుడే కరుణించి అర్జునుడికి సహాయపడ్డాడని చెప్పి అర్జునుడిలో శివభక్తిని పెంచి ఉత్సాహపరిచాడు వ్యాసుడు.

🌿శంకరుడినే మనస్సులో తల్చుకుంటూ యుద్ధం చెయ్యమని చెప్పాడు. కౌరవులు యుద్ధంలో మరణించినప్పుడు పుత్రుల మీద ప్రేమతో ధృతరాష్ట్రుడు గాంధారి పాండవుల్ని శపించకుండా ఇదంతా వాళ్ళు స్వయంగా చేసుకున్నదే అని వివరించాడు వ్యాసుడు.

🌸యుద్ధం తర్వాత బంధుమిత్రులు, అనేకమంది రాజులు పోయినందుకు బాధపడ్తున్న ధర్మరాజు దగ్గరకి వచ్చి రాజ్యాన్ని అనాధగా వదిలి బాధపడ్డం ధర్మం కాదని, సుద్యుమ్నుడి చరిత్ర, సేనజిత్తుడి మాటలు , ధర్మాధర్మాలు , ప్రాయశ్చిత్త విశేషాలు అన్నీ చెప్పి, మరుత్తుడి కథ చెప్పి అశ్వమేధయాగం కూడా చేయించాడు వేదవ్యాసుడు.

🌿వ్యాసుడి ఉపదేశం ప్రకారం ధృతరాష్ట్రుడు ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని గాంధారితో కలిసి ఉంటున్నాడు. పాండవులతో కలిసి వున్న దృతరాష్ట్రుడి దగ్గరకి వ్యాస భగవానుడు వచ్చి వాళ్ళ కోరిక ప్రకారం దివ్యదృష్టితో చనిపోయిన వాళ్ళందర్నీ చూడగలిగేలా చేసి ఎవరెవరు ఎక్కడెక్కడి చేరారో చూపించాడు.

🌸యాదవ స్త్రీలని రక్షించడానికి అస్త్రం తీసిన అర్జునిడికి అస్త్రాలు పనిచెయ్యలేదు. అర్జునుడు వేదవ్యాసుడి పాదాల మీద పడి తన అవమానం గురించి చెప్పి దుఃఖించాడు.

🌿నాయనా! కృష్ణావతారం అయిపోయాక ఆయన ప్రభావం నీ మీద లేదు. కాలం మనది కానప్పుడు మనం ఏం చేసినా అది కలిసిరాదు. జ్ఞానమున్న వాడివి కనుక విషయాలు తెలుసుకుని నువ్వు కూడా సర్వసంగ పరిత్యాగం చేసి నీవాళ్ళతో కలిసి ఉత్తమ గతులు పొందమని చెప్పాడు.

🌸పాండవులందరు శరీరాలు విడిచి పెట్టాక పాండవుల కీర్తి విస్తరింప చెయ్యడానికి రాజుల చరిత్రలు ప్రజలకు తెలియచెయ్యడానికి, దేవదేవుడి లీలలు, సర్వదేవతల జన్మలు ఇల్లాంటివి ఎన్నో తెలియపరుస్తూ సర్వజ్ఞుడు, సత్యదర్శి సర్వవిజ్ఞానభవుడు అయిన వేదవ్యాసుడు మహాభారతాన్ని పంచమవేదంగా రచించి మనకి అందించాడు.

🌿వేదవ్యాసుడు నడిచి వెడుతుండగా దారిలో ఒక పురుగు భయంతో పరుగెడుతూ కనిపించింది. వ్యాసుడు ఆ పురుగుని నీ బ్రతుకే నికృష్టం కదా! బ్రతికి ప్రయోజనం ఏముంది? చచ్చిపోడమే సుఖం కదా! భయపడ్డావెందుకన్నాడు వ్యాసుడు.

🌸మహాత్మా ! నేను పురుగునయినప్పుడు నాకంత విషయ పరిజ్ఞానం ఉండదు కదా! బ్రతకడమంటే సుఖం చావడమంటే భయం తప్ప నాకింకేమీ తెలియవు. అన్ని జీవులకి తెలిసేది ఇదే కదా అంది. నీకు శూద్ర, వైశ్య, క్షత్రియ జన్మలు వరుసగా వచ్చేలా నేను వరమిస్తాను, నువ్వు ధర్మమార్గంలో నడుచుకో అన్నాడు వ్యాసుడు.

🌿ఆ పరుగు మహర్షి చెప్పినట్లే నడుచుకుని క్షత్రియ జన్మలో వ్యాసుడికి కన్పించి పూజించింది. నువ్వు ఆవుల కోసం గాని బ్రహ్మణుడి కోసం గాని ఏదైనా త్యాగం చేస్తే నీకు బ్రాహ్మణ జన్మవచ్చేలా చూస్తానన్నాడు వ్యాసుడు.

🌸తర్వాత ఆ రాజు బ్రహ్మణుగా పుట్టి యజ్ఞాలుచేసి, తీర్ధయాత్రలు చేసి ఇంద్రుడికి ప్రియశిష్యుడిగా అయ్యాడు. ఇదంతా ఆ పురుగుమీద వ్యాసభగవానుడు చూపించిన దయ.

🌿విష్ణు ప్రభావం వల్ల పుట్టిన కృష్ణదైపాయనుడు అంటే మన వేద వ్యాసుడు బ్రహ్మ చెప్పగా వేదాల్ని నాలుగు భాగాలుగా చేసి ఋగ్వేదం పైలుడికి, యజుర్వేదం వైశంపాయనుడికి,  సామవేదం జైమినికి, అధర్వణవేదం సుమంతుడికి చెప్పి, వాళ్ళ వాళ్ళ శిష్యులతో వ్యాప్తి పొందేలా చేశాడు.

🌸ఇలా చతర్వేదాలు, అష్టాదశ పురాణాలు, చతుర్ధశ విద్యలు అన్నీ నేర్చుకుని,  బ్రహర్షులు, దేవర్షులు, రాజర్షులు చదివి అందరికీ చెప్పగలిగేలా చేశాడు వేదవ్యాసుడు.


🌿వ్యాసుడు పరమేశ్వరుణ్ణి ఆరాధించి పక్షి రూపంలో వున్న ఘృతాచి అనే అప్సరస యందు ఒక కొడుకుని పొందాడు. అతడి పేరు శుకుడు. పుడుతూనే అన్ని వేదాలు నేర్చుకుని వ్యాస భగవానుడంతటి వాడయ్యాడు శుకుడు.

🌸తండ్రి దగ్గర సమస్త విషయాలు తెలుసుకుని చివరకు యోగమార్గంలో శుకుడు అంతర్థానమయ్యాడు. వ్యాస మహర్షి రచనలు “వ్యాస సంహిత" , "వ్యాసస్మృతి”. వీటిలో మనకి నిత్యకర్మల గురించి అనేక విషయాల గురించి చెప్పబడివుంది. వ్యాస భగవానుడు కారణజన్ముడు. ఇదీ వ్యాస మహర్షి కథ !!

🌿ఇదండి మనము తెలుసుకున్న వ్యాసమహర్షి గురించి రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాము...స్వస్తి


No comments: