THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Thursday, October 13, 2022
శ్రీకంఠేశ్వర ఆలయం - నంజనగూడు......!!
🌸కర్ణాటక రాష్ట్రంలోనే అతి పెద్ద దేవాలయం - నంజనగూడు
🌿నంజనగూడు, మైసూరు జిల్లాలోని ఒక తాలూకా కేంద్ర పట్టణం. ఇది మైసూరు నుండి 23 కి.మీ.ల దూరంలో ఉంది. నంజనగూడు కపిలానది తీరంలో ఉన్న ఒక ప్రఖ్యాత ధార్మిక మరియు చారిత్రక పట్టణం. ఇక్కడ వెలసిన శ్రీకంఠేశ్వర దేవాలయం ఒక ప్రసిద్ధ ధార్మిక కేంద్రం.
🌸నంజనగూడు దక్షిణకాశిగా ప్రసిద్ధి చెందింది. తాలూకా ముఖ్యపట్టణమైన నంజనగూడు "Temple Town"గా కూడా పేరుపొందింది.
🌿ఈ పట్టణంలో నెలకొని ఉన్న శ్రీకంఠేశ్వర దేవాలయాన్ని నంజుడేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. హిందూ పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మథిస్తారు. సాగరమథనంలో అమృతానికన్నా ముందుగా హాలాహలం ఉద్భవిస్తుంది.
🌸ఆ కాలకూట విషం లోకమంతా విస్తరించకుండా ఈశ్వరుడు దానిని మ్రింగివేస్తాడు. అయితే పార్వతీదేవి కోరికపై శివుడు ఆ హాలాహలాన్ని తన గొంతులోనే నిలుపుకుంటాడు. ఆ విషం శివుని కంఠంలోనే నిలిచిపోయి ఆ కంఠం నీలంగా మారిపోతుంది.
🌿అప్పటి నుండి ఈశ్వరుడు నీలకంఠుడుగ పిలువబడుతున్నాడు. కన్నడ భాషలో నంజనగూడు అంటే నంజుడి యొక్క నివాసస్థానం అని అర్థం. నంజుండ అంటే విషము మ్రింగినవాడు అని అర్ధం.
🌸నంజనగూడు వేల సంవత్సరాల నుండి ముఖ్యమైన శైవక్షేత్రంగా విలసిల్లుతున్నది. 9వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం దాకా ఈ క్షేతాన్ని గంగులు, చోళులు, హొయసలులు, శ్రీకృష్ణదేవరాయలు, ఒడయారులు వివిధ దశలలో అభివృద్ధి చేశారు.
🌷హకీమ్ నంజుండేశ్వరు🌷
🌿హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ లకు ఈ దేవస్థానంతో సన్నిహిత సంబంధాలున్నాయి. తన పట్టపుటేనుగు కంటిచూపును కోల్పోతే టిప్పు సుల్తాన్ ఇక్కడి నంజుండేశ్వరుని ప్రార్థించాడని, దానితో పట్టపుటేనుగుకు చూపు మరలా వచ్చిందని అప్పటి నుండి టిప్పు సుల్తాన్ ఈ దేవుడిని హకీమ్ నంజుండేశ్వర అని కొలిచేవాడని ఒక కథనం.
🌷శ్రీకంఠేశ్వర దేవస్థానం: 🌷
🌸ఈ దేవస్థానం ఈ పట్టణంలో ముఖ్యదేవాలయం. ఇక్కడి శివలింగాన్ని గౌతమ మహర్షి ప్రతిష్ఠించాడని అంటారు. ఈ దేవుడిని నంజుండేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఈ నంజుండేశ్వరుని పేరునుండే నంజనగూడు ఏర్పడింది.
🌿ఈ దేవాలయాన్ని మొదట 9వ శతాబ్దంలో కర్ణాటకను ఏలిన పశ్చిమ గంగులు రాజవంశము వారు నిర్మించారు. టిప్పు సుల్తాన్ ఈ దేవుడిని వైద్యుడు (హకీం) గా కొలిచాడు. ఈ దేవాలయం 560 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కపిలానది తీరాన ద్రావిడశైలిలో నిర్మించబడింది
🌸ఈ దేవాలయము ముఖద్వారం ఈశాన్యదిక్కుగా ఉంది. ఈ దేవాలయ గోపురం 120మీటర్ల ఎత్తు కలిగి ఉండి కర్ణాటకలోని అతి పెద్ద దేవాలయాలలో ఒకటిగా పిలువబడుతూ ఉంది. ప్రతియేటా ఈ దేవాలయంలో రెండుసార్లు పెద్దజాతర, చిన్నజాతర జరుపుతారు
🌿పెద్దజాతర సందర్భంలో రథోత్సవం ఘనంగా జరుగుతుంది. శ్రీకంఠేశ్వరుడిని, పార్వతీదేవిని, గణపతిని, సుబ్రహ్మణ్యస్వామిని, చండికేశ్వరుడిని ఐదు ప్రత్యేక రథాలలో ఉంచి వేలాది భక్తులు ఈ రథాలను పురవీధులలో లాగి ఊరేగిస్తారు.
🌷త్రివేణీ సంగమం: 🌷
🌸నంజనగూడు సమీపంలో కపిలానది, కౌండిన్యనది, చూర్ణవతి నదుల త్రివేణీ సంగమం ఉంది. దీనికి పరశురామ క్షేత్రం అని పేరు. పరశురాముడు తన తల్లిని సంహరించిన తరువాత ఈ ప్రాంతానికి వచ్చి నదీస్నానం చేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడని అంటారు.
🌿ఈ స్థల పురాణం ప్రకారం ఆ సమయంలో అక్కడ ఆదికేశవుని దేవాలయం (ప్రస్తుతం ప్రధాన దేవాలయం ప్రక్కన ఉంది) మాత్రమే ఉండేది. పరశురాముడు తన ఆయుధం గొడ్డలిని నదీ జలంలో శుభ్రం చేసుకొనే సందర్భంలో అతని గొడ్డలి నదిలోపలి శివలింగానికి తాకి శివుడి తల నుండి నెత్తురు ప్రవహిస్తుంది
🌸అది చూసి పరశురాముడు భీతి చెంది శివుడిని క్షమించమని వేడుకుంటాడు. శివుడు కరుణించి ఆదికేశవుని దేవాలయం ప్రక్కనే తనకు కూడా ఒక దేవస్థానాన్ని నిర్మించమని ఆదేశిస్తాడు. పరశురాముడు ఆనందంతో ఇప్పుడు నంజుండేశ్వరుడు ఉన్న స్థలంలో దేవాలయాన్ని నిర్మిస్తాడు.
🌿శివుడు సంతోషించి తన దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడు పరశురామ దేవాలయాన్ని సందర్శించాలని వరాన్ని ప్రసాదిస్తాడు. నంజనగూడు దేవస్థానాలకే కాక అక్కడ పండే ప్రత్యేక రకం అరటి పళ్లకు ప్రసిద్ధి. ఈ రకం అరటి పళ్లను స్థానికులు నంజనగూడు రసబాళె అని పిలుస్తారు.
🌸కపిలానదిపై 1735లో నిర్మించిన అతి పురాతన వంతెన ఈ పట్టణంలో ఉంది. రోడ్డు, రైలు మార్గాలు ఈ వంతెనపై ఉన్నాయి. భారతప్రభుత్వం ఈ వంతెనను పురాతన కట్టడంగా గుర్తించింది.
🌿ఈ ఆలయానికి తిరుపతి నుండి మైసూర్ కు రైలు ద్వారా వెళితే 14 గంటలు పడుతుంది. అదే కారులో ప్రయాణిస్తే సుమారు 9 గంటల సమయం పడుతుంది..స్వస్తి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment