Adsense

Wednesday, October 5, 2022

నవరాత్రి జాగరణ అంతరార్థము

*నవరాత్రి జాగరణ అంతరార్థము*

రాత్రీ, పగలూ కలిసే సమయాలు ఉదయ సంధ్య, సాయం సంధ్య ఇవి ఉపాసనకు మహత్తరమైనవి. శుక్లపక్షములు, పూర్ణిమ, అమావాస్య, దీపావళి, హెూళీ, గురుపూర్ణిమ, శ్రావణి, శరత్ పూర్ణిమ వంటి పండుగలు ఈ సంధి సమయాలలోనే వస్తాయి. శీత, గ్రీష్మ ఋతువుల సంధికాలం సంవత్సరంలో రెండు సార్లు వస్తుంది. చైత్రమాసంలో, ఆశ్వయుజ మాసంలో శరీర క్షాళనకూ, కాయకల్ప చికిత్సకూ ఈ సంధి కాలాలు ఉత్తమమైనవని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. అలాగే చైత్ర నవరాత్రులు, ఆశ్వయుజ నవరాత్రులు అనుష్ఠానాలకు ఉత్తమమైనవి. నవరాత్రులు ప్రకృతి జగత్తులో ఋతువులకు ఋతు కాలములు. ఈ సమయాలలో వేడి, చలి సమతూకంలో ఉంటాయి. పృథివి యొక్క వేగం తగ్గుతుంది.

నవరాత్రులు దేవత్వం భూమిపై దిగివచ్చే సమయాలు; జాగృత ఆత్మలలో దైవీ ప్రేరణను నింపే సమయాలు. ఈ తొమ్మిది రోజులలో ప్రకృతి యొక్క సూక్ష్మ అంతరాళం, మానవ శరీరంలోని సూక్ష్మభాగం విశిష్టమైన పరివర్తన ప్రక్రియకు లోనవుతాయి. శరీరంలో పేరుకుపోయిన వికారాలనూ, మానసిక వికృతులనూ తొలగించడానికై జీవ శక్తి తుఫానులా తీవ్ర సంఘర్షణ జరుపుతుంది. ఆత్మిక ప్రగతికై అంతరిక ప్రేరణలు సహజంగా ఉత్పన్నం అవుతాయి. నవరాత్రులలో సూక్ష్మ జగత్తునుండి దైవీ ప్రేరణలు వర్షిస్తాయి. సంస్కరించబడిన ఆత్మలు తమలోపల సముద్ర మధనం వంటి సంచలనాలు కలగడాన్ని దర్శిస్తాయి. ఈ సంచలనాలను సద్వినియోగపరుచుకునే సాధకులు అదృశ్యమైన ప్రేరణా శక్తిద్వారా ప్రోత్సహించబడి, ఆత్మ కళ్యాణ, లోక కళ్యాణ కార్యకలాపాలలో పాల్గొంటారు; అమూల్యములైన రత్న రాశులను సంపాదిస్తారు; కృతకృత్యులు అవుతారు.

ఈ సంధికాలంలో సాధకులకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఊహకందని ఫలితాలు అందుతాయి. నవరాత్రులకు గూఢార్థం ఉన్నది. మానవశరీరం అనే అయోధ్యలో నవ ద్వారాలు అనగా తొమ్మిది ఇంద్రియాలు ఉన్నాయి. అజ్ఞానం వల్ల దుర్వినియోగ పరిచిన కారణంగా వాటిపై ఆవరించిన అంధకారాన్ని అనుష్ఠానం ద్వారా తొలగించవలసి ఉంది. ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క ఇంద్రియంపై ఆలోచన చేయాలి. వాటిపై సంయమనాన్ని సాధించాలి. వాటిలో ఉన్న సామర్ధ్యాలను వెలికితీయాలి. వాస్తవానికి ఇదే నవరాత్రి సాధన. రాత్రి అంటే చీకటి. ఈ నవద్వారాలపట్ల, తొమ్మిది ఇంద్రియాల -విషయాల పట్ల మెలకువ వహించే సాధకుడు వాటిలో -మునిగిపోడు; వాటిని దుర్వినియోగపరచి తన ఓజస్సునూ, తేజస్సునూ, వర్చస్సునూ వృధా చేయడు. అజ్ఞాన అంధకారం నుండి వెలుగులోనికి తీసుకురావడమే నవరాత్రి జాగరణ.

*- యుగశక్తి గాయత్రీ నుండి..*

_సానుకూల ఆలోచనలే యుగపరివర్తన_

*- యుగపరివర్తనామిషన్*
విచార క్రాంతి ప్రజ్ణా అభియాన్
ఆలోచనా విప్లవం వర్ధిల్లాలి

No comments: