Adsense

Tuesday, October 4, 2022

మహబూబ్ నగర్ జిల్లా "సోమశిల" శ్రీ లలితా సోమేశ్వరస్వామి దేవాలయం




💠 బోళాశంకరుడి అత్యంత శక్తిమంతమైన క్షేత్రాలుగా ద్వాదశ జ్యోతిర్లింగాలను చెబుతారు. వీటిలో ఏ ఒక్క క్షేత్రాన్ని దర్శించినా చాలనుకుంటారు.
అలాంటిది దేవదేవుడు ఒకేచోట పన్నెండు రూపాల్లో పూజలందుకుంటున్న ప్రాంతం సోమశిల.
ప్రకృతి అందాలకు నెలవైన ఇక్కడ పరమశివుడి ద్వాదశ జ్యోతిర్లింగాలూ కొలువై ఉండటం విశేషం

💠 ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాల నేపధ్యంగా అలరారుతున్న ఈ దివ్యాలయం ప్రాంగణంలోని కృష్ణా నదిలో పుష్కర స్నానాదికాలు చేస్తే విశేష పుణ్యఫలాలు సొంతమవుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.
సోమశిలలోని శ్రీ లలితా సోమేశ్వర స్వామి దేవాలయాన్ని ఏడవ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు.
శ్రీశైలం ప్రాజెక్టు వల్ల ఈ ఆలయం నదిలో మునిగిపోకుండా గట్టున ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించారు.

💠 ఈ ఆలయం పదిహేను ఆలయాల సముదాయంగా విరాజిల్లుతోంది. జ్యోతిర్లింగాలుగా ప్రసిద్ధమైన ద్వాదశ లింగాల ప్రతిరూపాలను ఒకే చోట ఆలయంలో ప్రతిష్టించారు.
ఈ ఆలయాలలోని అన్ని గర్భగుడుల లలాట బింబంగా గజలక్ష్మి ఉండడం ఈ ఆలయ విశేషంగా చెబుతారు.

💠మనసుదోచే నల్లమల అందాలూ పరవళ్లు తొక్కే కృష్ణమ్మ గలగలలూ మధురానుభూతిని మిగిల్చే పడవ ప్రయాణాలూ... ఇలా ప్రకృతి సోయగాలకు చిరునామాగా నిలుస్తున్న సోమశిల ఆధ్యాత్మికంగానూ అంతే ప్రసిద్ధి చెందింది.
కృష్ణుడి ఆనతిమేరకు ద్వాపరయుగంలో పాండవులు ప్రతిష్ఠించిన ఆలయాలుగా సోమశిలలో కొలువైన ద్వాదశ జ్యోతిర్లింగాలకు పేరు.

💠 ఆధ్యాత్మికత.. ప్రకృతి రమణీయత
కలిగిన లలితా సోమేశ్వర స్వామి ఆలయానికి సోమ, శుక్రవారాల్లో జనం అధికంగా వస్తుంటారు.
శివరాత్రి, దసరా, దీపావళి, సంక్రాంతి, కార్తిక మాసం, తొలి ఏకాదశి... ఇలా పండుగ, సెలవుల దినాల్లో సందర్శకులు పోటెత్తుతారు.
ఈ ప్రాంతానికి మరింత ఆకర్షణ జోడించే క్రమంలో సోమశిల రిజర్వాయర్‌లో బోటింగ్‌ సదుపాయం కూడా కల్పించారు.

💠 అమరగిరి, సిద్ధేశ్వరం, సంగమేశ్వరం దుర్గం గుహలు.. తదితర చుట్టు పక్కల ఉన్న సందర్శనీయ ప్రదేశాలను బోట్‌లో వెళ్లి చూడడం చక్కని అనుభూతిని అందిస్తుంది. రిజర్వాయర్‌ మధ్యలో ఉన్న సంగమేశ్వర ఆలయాన్ని నీటి నిలువ తగ్గినప్పుడు మాత్రమే చూడొచ్చు.
అదే విధంగా కొల్లాపూర్‌ మాధవస్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాలను కూడా దర్శించుకోవచ్చు.
శిల్పాలు, దైవ ప్రతిమలతో ఉన్న మ్యూజియం కూడా ఉంది.


💠 ద్వాపరయుగంలో పాండవులు అరణ్యవాస సమయంలో ఈ ప్రాంతంలో కొంతకాలం నివసించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి.
జూదంలో ఓడిన పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారిని కలిసిన కృష్ణుడు సోమశిల ప్రాంతంలోని రెండు కొండల మధ్య ప్రవహిస్తున్న సప్తనదుల సంగమంలో శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెబుతాడు. అందుకు అంగీకరించిన ధర్మరాజు శివలింగాన్ని తీసుకొచ్చే బాధ్యతను భీముడికి అప్పగిస్తాడు. భీముడు కాశీకి వెళ్లి లింగాన్ని తీసుకొచ్చే క్రమంలో కాస్త జాప్యం అవుతుంది. సమయం మించిపోతుందని భావించిన ధర్మరాజు మరోలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తాడు.
తాను తెచ్చిన లింగాన్ని పెట్టలేదని ఆగ్రహించిన భీముడు కాశీనుంచి తీసుకొచ్చిన లింగాన్ని దూరంగా విసిరేస్తాడు. దీంతో ఆ లింగం పన్నెండు ముక్కలై చెల్లాచెదురుగా పడిపోతుంది. తర్వాతికాలంలో ఆ శకలాలే పన్నెండు లింగాలుగా ఆవిర్భవించాయని భక్తుల నమ్మకం.

💠 ఈ ఆలయ ప్రాంగణంలోనే సోమేశ్వరుడు, మహాకాళేశ్వరుడు, కాశీవిశ్వనాథుడు, నాగేశ్వరుడు, త్రయంబకేశ్వరుడు, కేదారేశ్వరుడు, శ్రీశైల మల్లికార్జునుడు, భీమశంకరుడు, రామలింగేశ్వరుడు... ఇలా పన్నెండు జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు. ఇక్కడ పూజలు చేస్తే అవివాహితులకు వివాహమవుతుందనీ సంతానం లేనివారికి సంతానం కలుగుతుందనీ భక్తుల విశ్వాసం. ఒకసారి వచ్చి మనసులోని కోర్కెలు స్వామికి తెలియజేస్తే అవి తప్పక నెరవేరతాయని చెబుతారు.

💠 ఎలా వెళ్లాలంటే...
హైదరాబాద్‌కి 185 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకోవడానికి రోడ్డు, జల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లా కేంద్రాల నుంచి కొల్లాపూర్‌ వరకు ప్రతి అరగంటకూ ఒక ఆర్టీసీ బస్సు సిద్ధంగా ఉంటుంది. జలమార్గం ద్వారా అయితే... కర్నూలులోని శ్రీశైలం, నందికొట్కూరు నుంచి పడవల్లో రావచ్చు.

No comments: