Adsense

Wednesday, October 5, 2022

మహబూబ్ నగర్ జిల్లా రంగాపూర్ శ్రీ రంగనాయకస్వామి ఆలయం

 


💠 ఇక్కడ వెలసిన రంగనాథుడు భక్తుల కోరిన కొరికేలు నెరవేరుస్తూ ప్రసిద్ధి చెందాడు.
ఈ ఆలయంలోని శిల్ప సంపద, గాలిగోపురం అందరిని విశేషంగా ఆకట్టుకుంటాయి.

💠 తెలంగాణ రాష్ట్రంలోని, మహబూబ్ నగర్ జిల్లా, పెబ్బేరు మండల పరిధిలోని,
శ్రీ రంగాపూర్ లో రంగనాయక స్వామి ఆలయం ఉంది.

💠 ఆలయ వాస్తు రీత్యా, శిల్ప సంపద దృష్ట్యా ఈ క్షేత్రము తమిళనాడు లోని శ్రీరంగ దివ్య క్షేత్రమును పోలియున్నది.
కనుకనే శ్రీమాన్ హోసదుర్గ కృష్ణమాచార్యులు తమ 'ఉత్తర రoగ మాహాత్మ్యము అను సంస్క త గ్రంథములో ఈ క్షేత్రమును ఉత్తర శ్రీ రంగముగా అభివర్ణించారు.
ఆలయం నిర్మాణ కౌశలములోను, శిల్ప వైభవములోను రాష్ట్రములోని ప్రముఖ దేవాలయములలో ఒకటిగా నిలచి, సొంత జిల్లాకు వన్నె తెచ్చింది.

💠 గ్రామంలో రంగసముద్రం పేరు గల చెరువు ఒడ్డున గరుడాద్రి మీద నిర్మించిన రంగనాయకస్వామి ఆలయం అపర శ్రీరంగంగా పేరొందింది.

💠 తమిళనాడు రాష్ట్రంలో సుప్రసిద్ధ వైష్ణవపుణ్యక్షేత్రంగా ప్రఖ్యాతిగాంచిన శ్రీరంగంకు దీటుగా శ్రీరంగపూర్‌ గ్రామంలోని రంగనాయకస్వామి ఆలయం ప్రసిద్ధికెక్కింది. శ్రీరంగం వెళ్లి స్వామివారిని దర్శించే శక్తి లేని భక్తులు శ్రీరంగాపూర్‌లోని ఆలయాన్ని దర్శించి తరించవచ్చని భక్తుల నమ్మకం.

⚜ స్థలపురాణం ⚜

💠 శ్రీకృష్ణదేవరాయల వారు ఒక సమయంలో శ్రీరంగక్షేత్రం దర్శించడం జరిగింది.
ఆ ఆలయం సందర్శించిన నాటి నుండి ఆయనకు మనస్సులో తను పరిపాలిస్తున్న రాజ్యంలో కూడా అటువంటి ఆలయం నిర్మించాలనే కోరిక మనస్సులో బలీయంగా ఉండేదట. అంతలో ఒకనాటి రాత్రి శ్రీరంగనాయకస్వామి రాజు స్వప్నంలో సాక్షాత్కరించి, నీ రాజ్యంలోనే నేను వేంచేసి ఉన్నానని తను ఏ చోట ఉన్నదో ఒక గద్దను ఆనుసరించుట వలన తెలుస్తుందని, ఆ గద్ద వాలిన చోట తన విగ్రహం లభిస్తుందని చెప్పి అంతర్థానమయినాడట.
ఆ విగ్రహాన్ని శ్రీ రంగాపూర్ లోని రత్నాపుష్కర సరస్సు ఒడ్డున నిర్మించమని కృష్ణ దేవ రాయలుని కలలో
ఆదేశించగా వేకువనే లేచిన రాయలకి ఎదురుగా గద్ద కనిపించిందట.

💠  కలలో స్వామి చెప్పినదంతా జ్ఞప్తికి వచ్చి గద్దని అనుసరించి వెళ్ళి అది వాలిన చోట త్రవ్వించగా శ్రీరంగస్వామి విగ్రహం లభించినదట.
విగ్రహం లభించిన ప్రాంతం కరపాలక కొండ మధ్య ప్రాంతం.
శ్రీ రంగ నాయక స్వామి విగ్రహం గమనించి శ్రీ రంగాపూర్ లోని రత్నాపుష్కరసరస్సు ఒడ్డున ఆలయం నిర్మించి స్వామిని ప్రతిష్టించెనట

⚜ ఆలయ విశేషములు ⚜

💠 గరుడాద్రి యని పిలువబడుచున్న చిన్న తిన్నెపై శ్రీరంగనాథాలయం నిర్మించబడినది.
శ్రీరంగనాయకస్వామి ఆలయంలో నెలకొన్న అద్భుతమైన శిల్పసంపద భక్తులను కట్టిపడేస్తుంది. వివిధ శిల్ప సంప్రదాయాలతో, ద్వారపాలక శిల్పాలతో ఆకాశాన్నంటే అంతస్తులతో భక్తులకు ఆలయం స్వాగతం పలుకుతోంది.

💠 శేషశయనుడై అభయహస్తం చూపుతూ స్వామివారు, ఆయనకు ఎడమవైపున చతుర్భుజ తాయారు ఆలయంలో శ్రీలక్ష్మిదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. రంగనాయకస్వామి ఆలయంలో అడుగుపెట్టగానే కనిపించే గాలిగోపురం ఎన్నో విశిష్టతలను స్వంతం చేసుకుంది.

💠ఈ గోపురం ఐదు అంతస్థుల 60 అడుగులు ఎత్తుతో 20 అడుగుల ద్వారం కలిగి ఉంది. మొదటి అంతస్తులో క్రమపద్ధతిలో రామాయణగాథను వివరిస్తున్న శిల్పాలు ఉన్నాయి. తర్వాతి అంతస్థులలో వరుసగా అందమైన స్త్ర్రీ మూర్తుల చిత్రాలతోపాటు క్షీరసాగర మథనం, శ్రీకృష్ణుని బాల్యక్రీడలు, ప్రణయ సన్నివేశాలు, రంగనాయక స్వామి స్వరూపం, నరసింహ అవతారం, లక్ష్మీదేవి, సరస్వతీదేవి దేవతామూర్తుల చిత్రాలను అందంగా చెక్కించారు.
ఈ గాలిగోపురం పైభాగాన సింహముఖంతో పూర్తిచేయబడి బంగారుపూతతో కూడిన ఏడుకలశాలు కనిపిస్తాయి. ఈ గాలిగోపురం ఆనాటి శిల్పసౌందర్యానికి ప్రతీకగా నిలిచింది.

💠 ఆలయం ప్రక్కనే ఆనాటి ప్రభువులు నిర్మించిన శ్రీరంగసముద్రం అనే సువిశాలమైన చెరువు చూపరులను ఆకట్టుకొంటుంది.
ఆలయంలోని నేలమాళిగలో ఆనాటి చిత్రకళకు నిదర్శనంగా బంగారుపూత పూసిన అరుదైన దేవతామూర్తుల చిత్రపటాలు దర్శనమిస్తాయి.

💠 రంగనాయకస్వామి ఆలయానికి సమీపంలో నిర్మించిన కోనేరు ఆనాటి అద్భుతమైన రాతికట్టడానికి నిలువుటద్దంగా నిలిచింది. ఈ కోనేరు పూర్తిగా రాతికట్టడాలతో నేటికి చెక్కుచెదరకుండా ఉంది.

💠 చెక్కు చెదరని శిల్ప సంపద, ఆకాశాన్నంటే గాలి గోపురాలు, వర్ణించనలవి కాని అపురూప దేవతామూర్తుల చిత్రాలు, ఆలయం పక్కనే సువిశాల రంగసముద్రం చెరువు ఇలా ప్రతి ఒక్కటి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

💠 ఇక్కడ స్వామిని కోలిచిన వారికి సర్వ శుభాలు జరుగుతాయి అని భక్తుల విశ్వాసం .
ఆలయంలో వివాహాది శుభ కార్యాలు ఎక్కువ గా జరిగుతాయి .
నిత్యం ఇక్కడ హరినామ సంకీర్తనలు జరుగుతాయి .
స్వామి కళ్యాణము సంధర్భంగా రధోత్సవ0 అత్యంత వైభవం గా జరుగుతుంది .
భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీరంగనాయకస్వామిని దర్శించి తరించండి

💠 ఈ ఆలయము వనపర్తి కి 12కిలో మీటర్ల దూరము లో ఉన్నది బస్ సౌకర్యం ఉన్నది
మహబూబ్ నగర్ నుండి 100 కి.మీ. దూరంలో ఉన్నది.

No comments: