Adsense

Tuesday, October 4, 2022

దుర్గాష్టమి - మహర్నవమి - విజయ దశమి (దసరా)....!!

దుర్గాష్టమి - మహర్నవమి - విజయ దశమి (దసరా)....!!



            🌷దుర్గాష్టమి🌷

🌿ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులనూ 'దసరా' లేక 'దేవీ నవరాత్రులు'అంటారు.

🌸ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి , మహర్నవమి , విజయదశమి. విద్యార్ధులు పుస్తకపూజ , శ్రామికులు పనిముట్లపూజ , క్షత్రియులు ఆయుధపూజ చేసి , అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు.

🌿దేవి మహిషాసురమర్దనిగా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించిన స్పూర్తితో , పూర్వం రాజులు ఈ శుభముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకొనే వారని పురాణాల్లో చెప్పబడింది.

🌸కొన్ని ప్రాంతాలలో దసరాకు ఒక వేడుకగా బొమ్మల కొలువు పెట్టే ఆచారం ఉంది.

        🌹దుష్ట సంహారం..🌹

🌿దుర్గాదేవి "లోహుడు"అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని , అందువల్ల లోహపరికరాలని పూజించే ఆనవాయితి వచ్చింది అని చెప్తారు.

🌸 ఇక దుర్గ అంటే ? దుర్గమైనది దుర్గ. దుర్గతులను తొలగించేది దుర్గ. ఈమె దుర్గేయురాలు కనుక దుర్గ అయింది. "దుర్గలోని 'దుర్' అంటే దుఃఖం , దుర్భిక్షం , దుర్వ్యసనం , దారిద్ర్యం మొదలైనవి.

🌿 'గ' అంటే నశింపచేసేది", అని దైవజ్ఞులు వివరణ చెప్తూ ఉంటారు. ఈమె ఆరాధనవల్ల దుష్టశక్తులు , భూత , ప్రేత , పిశాచ , రక్కసుల బాధలు దరిచేరవు , చేరలేవు. అందువల్లనే

🌸 మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను , తదుపరి మూడురోజులు లక్ష్మిరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను , చివరి మూడురోజులు సరస్వతిరూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని , ఆక్రమంలో ఈ నవరాత్రులలో ఆతల్లిని ఆరాధించి తగు ఫలితాలు పొందవచ్చునని పెద్దలు చెప్తుంటారు.

🌿ఈరోజు దుర్గసహస్రనామ పారాయణము , 'దుం' అను బీజాక్షరముతో కలిపి దుర్గాదేవిని పూజిస్తారు. "ఈ దుర్గాష్టమి సోమవారం తో కలిసిన మరింత శ్రేష్టము", అని అంటారు.

           🌹మహర్నవమి🌹

🌸 ఇక ఈ నవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనదిగా ఈ నవమి తిధిని గూర్చి చెప్పుటలో ఆంతర్యం ఈ తొమ్మిదవ రోజు మంత్ర సిద్ది కలుగును.

🌿 కావున 'సిద్ధదా' అని నవమికి పేరు. దేవి ఉపాసకులు అంతవరకు వారు చేసిన జపసంఖ్య ఆధారంగా హోమాలుచేస్తూ ఉంటారు.

🌸అలా వ్రతసమాప్తి గావించిన వారికి సర్వసిద్ధుల సర్వాభీష్ట సంసిద్ధి కలుగును. ఇక క్షత్రియులు , కార్మికులు , వాహన యజమానులు , ఇతర కులవృత్తులవారు అందరూ ఆయుధపూజ నిర్వహిస్తారు.

          🌹విజయదశమి🌹

🌿 'శ్రవణా' నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి 'విజయా' అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయదశమి' అనుపేరు వచ్చినది.

🌸ఏపనైనా తిధి , వారము , తారాబలము , గ్రహబలము , ముహూర్తము మున్నగునవి విచారించకుండా , విజయదశమినాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము.

🌿'చతుర్వర్గ చింతామణి' అనే ఉద్గ్రంధము ఆశ్వీయుజ శుక్ల దశమినాటి నక్షత్రోదయ వేళనే 'విజయం' అని తెలిపియున్నది. ఈ పవిత్ర సమయము సకల వాంచితార్ధ సాధకమైనదని గురువాక్యము.

🌹'శమీపూజ' చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది..🌹

🌸 శమీవృక్షమంటే 'జమ్మిచెట్టు'. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను , వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు.

🌿అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి , తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది , శమీవృక్ష రుపమున ఉన్న 'అపరాజితా'దేవి ఆశీస్సులు పొంది , కౌరవులపై విజయము సాధించినారు.

🌸శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ అపరాజితా' దేవిని పూజించి , రావణుని సహరించి , విజయము పొందినాడు.

🌿తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం 'పాలపిట్ట' ను చూచే ఆచారం కూడా ఉన్నది.

🌸ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని , విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి ,

🌿 ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.

శ్లో"🌷 శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |

అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||🌷

🌸పైశ్లోకము 👆వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటు , శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి...స్వస్తి..

No comments: