Adsense

Friday, October 7, 2022

కేరళలో చాముండీదేవి దేవాలయం




🌸కేరళ రాష్ట్రంలో ప్రసిధ్ధి చెందిన ఆలయాలలో కరిక్కమ్ చాముండీ దేవి ఆలయం ఒకటి.

🌿ఆదిపరాశక్తి ముగ్గురు దేవీలుగా దర్శనమిచ్చే దేవాలయం. ఈ ఆలయంలో కొలువై వున్న చాముండి దేవిని నీతిదేవతగా, న్యాయ పరిరక్షకురాలిగా భక్తులు కొలుస్తారు.

🌸కరి అంటే ఏనుగు. ఈ కేరళ ప్రాంతంలో ఏనుగులు చాలా ఎక్కువగా వుండడం వలన( కరి..అగమ్) కరిక్కమ్
అని యీ స్ధలానికి పేరు వచ్చినట్లు చెప్తారు.

🌿కళి అంటే ఆట. కధకళి, ఓట్టమ్, తుళ్ళల్ అనే కళాప్రక్రియలకు  నిలయంగా వున్నందున కళియగమ్ అనే పిలువబడి కాలక్రమేణా కళి అనేది 'కరి'గా మారి కరిక్కమ్ అనే పేరు  వచ్చింది అని కూడా చెప్తారు.

🌸కరిక్కమ్ ప్రాంతంలోని ఒక బ్రాహ్మణుడు చాముండీ దేవిని పూజిస్తూండేవాడు. దేవీ ఉపాసకుడైన ఆయన కుటుంబంతో 'నడుత్తలైవీడు' తెగకు చెందిన ఒక నాయర్ యువకుడు అతి సన్నిహితంగా వుండేవాడు.

🌿ఆ బ్రాహ్మణ భక్తుడు తన అంత్యకాలంలో తాను నిత్యం భక్తితో పూజించే దేవీ విగ్రహాన్ని ఒక పెట్టిలో పెట్టి ఆ యువకునికి అప్పగించారు.( ఇది కేరళ పంచాంగం ప్రకారం కొల్లం  572 వ సంవత్సరంలో జరిగింది).

🌸ఆ పవిత్ర మందసం మహిమ తెలియని ఆ ఇంటి స్త్రీ ఒకామె ఆ పెట్టిని ఒక పనికిరాని వస్తువుగా భావించి వీధిలో పారవేసింది. మరుక్షణమే ఆ స్త్రీ స్పృహ తప్పి పడిపోయి మంచం పట్టింది. ఏ వైద్యం పనిచేయని స్ధితిలో, ఏం చేయడానికి తోచని ఆ ఇంటివారు ఒక జ్యోతిష్కుని సంప్రదించారు.

🌿ఆ జ్యోతిష్కుడు ఆ స్త్రీ జాతకం చూసి జరిగిన తప్పు గ్రహించి తగిన ప్రాయశ్చిత్తములు జరిపించి, చాముండీ దేవిని మనసారా క్షమించమని వేడుకున్నా‌రు. దేవి వారిని కరుణించినది. ఆ తర్వాత ఆ కుటుంబంవారు చాముండీ దేవికి ప్రత్యేక ఆలయం నిర్మించి భయభక్తులతో పూజించసాగారు.

🌸ఈ సంఘటన అదే సంవత్సరం ( కొల్లం సంవత్సరం 572)  మీన మాసం మఖా నక్షత్రం రోజున జరిగినదని స్ధల చరిత్ర. ప్రతి సంవత్సరం ఆ రోజున బ్రహ్మోత్సవం జరుగుతుంది.

🌿తిరువిదాంకూర్ యువరాజు
చిత్తిరై తిరునాళ్ కు 18 సంవత్సరాలు వచ్చే వరకూ మహారాణి పార్వతీ బాయి యువరాజు తరఫున  రాజ్యపాలనా భారాన్ని నిర్వహించినది.

🌸కరిక్కమ్ ప్రాంతంలో పారుతున్న చిన్న నదిని ఎర్నాకుళం, ఆలప్పుళా కొల్లం, వైక్కమ్ మొదలైన ఊళ్ళతో అనుసంధానం చేసి నీరు సక్రమంగా పారడానికి తగిన ఏర్పాట్లు చేయించింది.

🌿ఈ ప్రాంతాల్లో ప్రజలకు త్రాగు నీటి సమస్య, వ్యవసాయసాగుబడికి ఈ నది వుపయోగపడుతున్నది. ఆ రాణిగారి కృతజ్ఞతతో మర్యాద పూర్వకంగా ఆ నదికి పార్వతీ పుత్తనారు అనే పేరు పెట్టారు.

🌸చాముండీ దేవి ఆలయం
సౌందర్యంతో విరాజిల్లుతూటుంది.  చాముండీ దేవి మూలదేవతగా కరుణతో ప్రత్యేక సన్నిధిలో అనుగ్రహిస్తుండగా బాల చాముండి, రక్త చాముండి విడి విడిగా సన్నిధులు కలిగి వున్నారు. ఒకానొక కాలంలో రక్త  చాముండికి జంతు బలులు యిచ్చే ఆచారం వుండేది.

🌿ఈనాడు ఆ ఆచారం మారింది. దానికి బదులుగా కాయలను నైవేద్యంగా పెట్టి పూజిస్తున్నారు. చాముండీ దేవి
పాపాలు చేసేవారిని దండిస్తూ అమాయక ప్రజలకు రక్షణ దైవంగా
అనుగ్రహిస్తున్నది.

🌸ప్రజలు తమ సమస్యలకు తీర్పు కావలసినప్పుడు తమ న్యాయపరమైన సమస్యలను, తమ తరఫు వాదనలను
దేవి ముందు ముమ్మారు చెప్పి
కర్పూరం వెలిగించి ఒట్టు వేస్తారు. అమ్మవారి ముందు నీతి నిజాయితీలతో ఒట్టు పెట్టుకున్న వారికి అమ్మవారు న్యాయం చేస్తుందని వారి ధృఢనమ్మకం.

🌿ఈనాటికీ, ఎన్నికలలో డబ్బుకు ఆశపడి అసత్యపు ఒట్లు వేసేవారి కుటుంబాలలో మూడు తరాల వరకు  అమ్మవారు శిక్షిస్తుందని వారికి అష్టకష్టాలు తప్పవని నమ్ముతారు. అందువలన అమ్మవారి సన్నిధిలో అసత్యం పలకరు.

🌸ఈ దేవికి పెద్ద పాత్రలో పాయసం నివేదిస్తారు. ఆ సమయంలో అర్చకునికి
పూనకం వచ్చి తన చేతులతో వేడి వేడి పాయసం తీసుకుని త్రాగడం అనే ఆచారం యీనాటికి కొనసాగుతున్నది.

🌿బ్రహ్మోత్సవ సమయాలలో ఆలయ తంత్రి అనే పూజారులు చుక్క మంచినీరు  కూడా త్రాగకుండా  కటిక ఉపవాసం చేస్తారు. కొబ్బరి కంకులకి వస్త్రం చుట్టి నూనె కాగడాలు వెలిగించి పూజించడం ఇక్కడి విశిష్టత.

🌸ఇదేవిధంగా శ్రావణమాసం శ్రవణా నక్షత్రం నాడు కొత్త వరికంకుల నివేదన జరుగుతుంది. విజయదశమినాడు  పిల్లలకి విద్యాభ్యాసం ఆరంభిస్తారు.
చాముండి దేవీని దర్శించి పూజించే భక్తులకి దుష్ట శక్తుల బాధలు తొలగుతాయి.

🌿వివాహం విషయంలో అడ్డంకులు తొలగి వివాహాలు జరగడం, సంతానం లేనివారికి సంతానభాగ్యం కలుగుతుంది. కరిక్కమ్ చాముండి దేవి ఆలయం తిరువనంతపురం నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో వున్నది..స్వస్తి.

No comments: