Adsense

Friday, October 7, 2022

మహబూబ్ నగర్ జిల్లా.. మన్యంకొండ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం

 

💠 భగవంతుడు సర్వాంతర్యామి అని అంటారు. అయితే కొన్ని చోట్ల ఉన్న ఆ భగవంతుడు భక్తులకు కొంగు బంగారమై కోరిన వెంటనే కోర్కెలను తీరుస్తూ ఉంటారు. అటువంటి కోవకు చెందినవాడే ఈ వేంకటేశ్వరుడు.
ఈ విగ్రహం నీటి పై తేలుతూ ఓ భక్తుడి దోసిటకు వచ్చింది. అటుపై భక్తులతో నీరాజనాలు అందుకొంటూ ఆ క్షేత్రం పరమపవిత్రమైనది.
ఆ క్షేత్రం పేరే...మన్యం కొండ .
దీనిని తెలంగాణ తిరుపతి అని కూడా అంటారు

💠 కృష్ణమ్మా పరవళ్ళు తొక్కే అందమైన మహబూబ్ నగర్ జిల్లాలో అడుగడుగునా  దేవాలయాలే. మహబూబ్ నగర్ పట్టణానికి 20 కి మీ దూరం లో మన్యం కొండ గుట్ట పైన వెలసిన ప్రసిద్ద వెంకటేశ్వర క్షేత్రం ఇది .
తెలంగాణకి కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతోంది మన్యంకొండ దేవస్థానం.

💠 తిరుపతి వెళ్లలేని భక్తులు మన్యం కొండకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నా, తిరుపతికి వెళ్లిన ఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం.
మన్యంకొండ దేవస్థానానం రెండవ తిరుపతిగా పేరుగాంచింది.
"" తీరితే తిరుపతి.....తీరకుంటే మన్యంకొండ "" అన్నట్లు ..... ఈ ప్రాంతంలో పేదలు దూరాన ఉన్న తిరుపతికి వెళ్ళలేనివారు, తీరికలేనివారు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు.

💠 సుమారు 600 సంవత్సరాల చరిత్రగల ఈ దేవస్థానంలో తవ్వని కోనేరు, చెక్కని పాదాలు, ఉలి ముట్టని విగ్రహం... ప్రత్యేకతలు.

💠 ఈ స్వామి ఇక్కడ వెలిశాడని చెప్పేందుకు అనేక శ్రుతగాథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం జన సంచారం లేని ఈ కొండపై కొందరు మునులు వేంకటేశ్వర స్వామి కరుణా కటాక్ష - వీక్షణం కోపం తపస్సు చేసేవారు.
మునులు ఈ కొండపై తపస్సులు చేసుకోవడం వల్ల దీనికి 'మునుల కొండ' అనే పేరు ప వచ్చింది. అదే కాలక్రమేణా "మన్యంకొండ”గా మారింది. ఆ మునుల కోరికపైనే తిరుపతి వేంకటేశ్వరుడు ఇక్కడ వెలిశాడని ఆ గాథ తెలియజేస్తుంది.

💠 ఈ కొండల్లో మణులు, పగడాలు దాల్చిన సర్పాలు ఉన్నందున దీన్ని ఒకప్పుడు నాగలోకంగా భావించే వారని పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుతం ఆ స్వామి వెలిసిన గుహ కూడా పాము పడగ రూపంలో ఉండటం ఆ కథకు బలం చేకూరుస్తోంది.

💠 ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతికి మన్యంకొండకు చాలా పోలికల ఉన్నాయి.
🔅తిరుపతిలో వేంకటేశ్వర స్వామి ఏడుకొండలపై వెలియగా ఇక్కడ మూడు కొండల వెలిశాడు.
🔅తిరుపతిలో వెంకన్న శేషునిపై శ్రీలక్ష్మీ సమేతంగా చెక్కించిన శిల్పం రూపంలో మన్యంకొండలో శేషుని పడగ కింద చెక్కిన శిలా రూపంలోనే... శ్రీలక్ష్మీ సమేతంగా అవతరించాడు.
🔅తిరుపతిలో ఏడు కొండలు దాటి స్వామిని దర్శనం చేసుకోవాలి. మన్యంకొండలో ఏడు ద్వారాలు దాటి దర్శనం చేసుకోవాలి.
తిరుపతిని తలపించే విధంగా మన్యంకొండ నయనానందకరంగ ఉంటుంది.

💠 ఈ మన్యం కొండ క్షేత్రానికి దాదాపు 600 ఏళ్ల చరిత్ర ఉంది. తమిళనాడులోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం శ్రీరంగం సమీపంలో అళహరి గ్రామం ఉంది. ఈ గ్రామానికి చెందిన కేశవయ్య విష్ణువు భక్తుడు.
ఒక రోజు శ్రీనివాసుడు ఆయనకు కలలో కనిపించి తాను కృష్ణానది తీరంలోని మన్యం కొండపై వెలిసి ఉన్నానని, వెంటనే అక్కడికి వెళ్లి నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశిస్తాడు.

💠 కేశవయ్య కృష్ణానదిలో స్నానం చేసి సూర్యభగవానుడికి నమస్కరించి అర్ఘ్యం వదులుతుండగా శిలారూపంలో ఉన్న వేంకటేశ్వరుడి ప్రతిమ నదిలో అలలపై తేలుతూ వచ్చి కేశవయ్య దోసిట నిలిచిందని చెబుతారు.
ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి మన్యం కొండ పై శేషశాయి రూపంలో గల గుహలో ప్రతిష్టించి నిత్య ధూప, దీప నైవేద్యాలతో స్మామివారిని ఆరాధించడం మొదలుపెట్టారు.
క్రమంగా భక్తులు కూడా రావడంతో పుణ్యక్షేత్రంగా మారింది. అటు పై దేవస్థానానికి మంటపం నిర్మించారు. దాతల సహకారంతో ఆంజనేయస్వామి, గరుడాళ్వార్ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు.

💠 అళహరి వంశానికి చెందిన హనుమద్దాసుల కీర్తనలతో మన్యం కొండ దేశవ్యాప్తంగా పేరుగాంచింది. హనుమద్దాసు మన్యంకొండ లక్ష్మీ వేంకటేశ్వరుడిని ఉద్దేశించి దాదాపు 300 కీర్తనలు రచించారు.
దీంతో మన్యం కొండ ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ ఉంది.

💠 ఇక్కడ శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఏడాది మాఘమాసంలోను,  స్వామి అలివేలుమంగా పద్మావతుల నీరాజనోత్సవాలు ప్రతి ఏడాది పాల్గుణ శుద్ధ ఏకాదశీ జరుగుతాయి.
ప్రతీ భాద్రపద మాసంలో ఇక్కడ వెలిసిన శ్రీ వీరభద్ర స్వామి అగ్ని గుండం ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి.
దేవస్థానానికి వచ్చే భక్తులు స్వామివారికి కొత్త కుండలో అన్నం వండి, పచ్చిపులుసు చేసి స్వామివారికి నివేదించడం తరతరాలుగా వస్తోంది.

💠 మన్యంకొండ దిగువ కొండవద్ద అలమేలు మంగమ్మ గుడి ఉంది. ఏటా అమ్మవారి సన్నిధిలో వందలాది వివాహాలు జరుగుతాయి. అమ్మవారి సన్నిధిలో పూజలు చేస్తే నిత్య సుమంగళిత్వం, సంతానం, సిరిసంపదలు లభిస్తాయని విశ్వాసం. అందుకే పెళ్లి కావల్సిన వారు, సంతానం లేని వారు అమ్మ సన్నిధిలో ముడుపులు కట్టడం ఆచారం.

💠 మహాబూబ్ నగర్ పట్టణానికి 20 కిలో మీటర్ల దూరంలో మన్యం కొండ ఉంది.

No comments: