Adsense

Wednesday, October 5, 2022

ప్రద్యుమ్నే శృంఖలాదేవీ..!!




🌹అష్ఠాదశ శక్తిపీఠంలో 3వ శక్తిపీఠం - శృంఖల దేవి.

🌸ఈ క్షేత్రం గురించి వివరణలో పండితులూ, చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు వున్నాయి. ఇలా విభేదించిన క్షేత్రాలలో శృంఖల ముఖ్యమైనది.

🌿 కొన్ని కథనాల ప్రకారం:

🌸శక్తి పీఠాల్లో కొన్నింటిని గురించి పండితుల్లోనూ, చరిత్రకారుల్లోనూ విభేదాలు వున్నాయి. ఆవిధంగా విభేదాలు ఉన్న క్షేత్రాల్లో ‘ప్రద్యుమ్నం’ ప్రధానమైంది. ప్రద్యుమ్నం ఎక్కడ వుందనే విషయమై పలు అభిప్రాయాలున్నాయి.

🌿ప్రస్తుతం పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లా ప్రాంతం ’ప్రద్యుమ్నం’గా భావిస్తున్నారు. శృంఖలాదేవి ఆలయం ఎక్కడ వుండేది సరిగ్గా తెలియడం లేదుగానీ..

🌸కొందరు కలకత్తా నగరం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుగ్లీ జిల్లాలోని ‘పాండువా’ అనే గ్రామంలో కొలువుదీరి వున్న దేవియే ’శృంఖలాదేవి’ అని అంటున్నారు. ఇంకొంతమంది గంగాసాగర్ లోని ఆదినాధ క్షేత్రం అని, కొంతమంది గుజరాత్ లోని చోటిల్లా అని, విభిన్న కథనాలు ఉన్నాయి.

🌿అయితే ప్రస్తుతం ఇక్కడ హజ్రత్ షా దర్గా – మినార్ మాత్రమే ఉంది. అవసాన దశలో ఉన్న ఆలయంలోని కొన్ని ప్రదేశాలు మాత్రం పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉన్నాయి.

🌸ఇప్పటికీ ఇక్కడ ఏ ఆలయం లేనప్పటికీ ప్రతి మాఘమాసంలో మేళతాళాలతో ఉత్సవాలు,తిరున్నాళ్ళు జరుగుతుంటాయి. త్రేతాయుగంలో ఋష్యశృంగ మహర్షి శృంఖలాదేవిని ప్రతిష్ఠించినట్లు కథనం.

🌿పూర్వం వంగదేశమును రోమపాదుడు అనే రాజు పరిపాలించేవాడు. రాజ్యం సస్యశ్యామలమై ఉండేది. అయితే ఒకసారి తీవ్రమైన కరవు పరిస్థితులు ఏర్పడి ప్రజలు విలవిలలాడసాగారు.

🌸కరువును గురించి తీవ్రమైన ఆలోచనలు చేసిన రోమపాదుడు ఋష్యశృంగుని గురించి విన్నాడు. ఋష్యశృంగుడు – విభాండకుడు, చిత్రరేఖల కుమారుడు. తపోబల సంపన్నుడు.

🌿ఆయన ఎక్కడ కాలుమోపితే అక్కడ సస్యశ్యాలమే! ఈ విషయం గురించి విన్న రోమపాదుడు, ఋష్యశృంగుని తీసుకువచ్చేందుకు కొందరు యువతులను ఆశ్రమానికి పంపాడు.

🌸అంతవరకూ ఆశ్రమం వదలి బయటకు వెళ్ళని, ముని కుమారులను మినహా యితరులను చూసి ఎరుగని ఋష్యశృంగుడు యువతులను, వారి అందాలను చూసి ఆశ్చర్యపడి, వారి ఆశ్రమాలు ఎంత అందంగా వుంటాయో చూడాలనే ఉత్సాహం కలుగగా..

🌿వారి వెంట వంగదేశం చేరుకున్నాడు. ఋష్యశృంగుడి పాదం మోపడంతోనే కరువుపోయి, వర్షాలు కురిసి రాజ్యం సస్యశ్యామలం అయింది. రోమపాదుడు తన కుమార్తె శాంతాదేవిని ఋష్యశృంగునికిచ్చి వివాహం చేశాడు.

🌸ఈవిధంగా కొంతకాలం వంగదేశంలో గడిపిన ఋష్యశృంగుడు శృంఖలాదేవిని ప్రతిష్ఠించి పూజించినట్లు కథనం. శృంగుడు ప్రతిష్ఠించిన దేవత కనుక శృంగలా దేవి అని పేరు. కాలక్రమంలో ఆ పేరు శృంఖలాదేవి అయింది.

🌿’శృంఖల’ అంటే రెండు రకాల అర్థాలున్నాయి. మొదటిది, బంధనానికి ఉపయోగించే గొలుసు (సంకెళ్ళు.)అని, రెండవది బాలింతలు నడుముకు కట్టుకునే వస్త్రం అని అర్థం. ఇక్కడ అమ్మవారు బాలింతలా నడుముకు వస్త్రం కట్టుకుని దర్శనమిస్తారు.

🌸శృంఖలాదేవి భక్తుల సమస్యల సంకెళ్ళు తొలగించే తల్లిగా పేరుపొందింది. సాధారణంగా బాలింతలు నడుముకు గుడ్డ కట్టుకుంటారు. దీనికి బాలింత నడికట్టు అని అంటారు.

🌿దీనికే శృంఖల అనే పేరు వుండడం వల్ల క్రొత్తగా ప్రసవించిన బాలింత చంటి బిడ్డకు పాలిచ్చి కంటికి రెప్పలా ఎలా కాపాడుతుందో ఈ తల్లి కూడా అలాగే కాపాడుతుందని భక్తుల నమ్మకం.

🌸🌿ఈ శక్తి పీఠం వివరాలను గమనిస్తే దాదాపు ఇలాంటి మరొక కథనం కూడా వినిపిస్తుంది. దాని ప్రకారం..

🌿ఈ క్షేత్రంలో వెలిసిన దేవీ విగ్రహంలో కనిపించే మాతృప్రేమను అర్ధం చేసుకోలేని సాధకులకు ఇది శృంగార క్షేత్రంగా కనిపించేది.  కనుక పూర్వంకాలం నాటి గురువులు తమ శిష్యులలో నిర్వికారులైన ఉత్తమమైన వారిని మాత్రమే ఈ క్షేత్రదర్శనానికి అనుమతించేవారు.

🌸దీనికి పురాణకాలం నాటి కథ ఒకటి ఆలంబనగా ఉంది.

🌿త్రేతాయుగంలో దశరథుని పుత్రిక ఐన శాంతను వివాహం చేసుకున్న రుష్యశృంగ మహర్షి సతీసమేతుడై దేవిని చాలాకాలం ఉపాసించాడు. ఆయనకు దేవి యొక్క విచిత్రమైన ఆజ్గ్న మనస్సులో వినిపించసాగింది.

🌸అపుడు రుష్యశృంగ మహర్షి అక్కడనుండి దక్షిణ పశ్చిమ దిశగా వచ్చాడు. శృంఖలాదేవి యొక్క దివ్వశక్తి రుష్యశృంగ మహర్షిలో ఉంది. అలా వచ్చిన మహర్షి శృంగగిరి శిఖరపై తపస్సు చేసి ఆత్మానందం పొందుతాడు.

🌿తరువాత ఆ శృంగగిరి ప్రాంతంలో కొన్ని శక్తి క్షేత్రాలను ఏర్పరచి వాటిలో శృంఖలాదేవి శక్తిని భాగాలుగా స్థాపించుతాడు. శృంగ మహర్షి స్థాపించిన దేవతలు కనుక సాథనికులు దేవతలను శృంఖలా దేవతలుగా పిలిచారు.

🌸కలియుగంలో ఆదిశంకరాచార్యులు శారదాదేవి విగ్రహాన్ని మహిష్మతీ నగరం నుంచి తీసుకొని వస్తూ శృంగగిరి ప్రాంతానికి వస్తాడు. ఇక్కడ అమ్మ శక్తితరంగాలకు లోనవుతాడు. తరువాత ఈ ప్రాంతంలోనే శారదా మాతను ప్రతిష్టిస్తాడు.

🌿ప్రదుమ్మనం పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ ప్రాంతమని పండితుల అభిప్రాయం. కాని పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ గాను బెంగాల్ గాను విడిపోయింది. ఇక్కడ రెండు ప్రాంతాలలోనూ శృంఖలాదేవి క్షేత్రం ఎక్కడా కనపడదు.
🌸శృంఖలా దేవి క్షేత్రంపై భిన్నాభిప్రాయలున్నవి. ప్రస్తుతం బెంగాల్ లోని ప్రద్యమ్నంలోని అమ్మవారి ఆలయాన్ని శక్తిపీఠంగా కొలుస్తున్నారు. కలకత్తా సమీపాన గల సాగరసంగమంలో గంగానది ప్రవేశించే గంగాసాగర్ లో ఉన్న అధినాధ క్షేత్రమే శృంఖలాదేవి శక్తిపీఠమని కొందరి అభిప్రాయం...స్వస్తి.

No comments: