Adsense

Thursday, March 30, 2023

శ్రీరామనవమి అంటే రాముని పుట్టిన రోజా? పెళ్ళి రోజా?

పుట్టినరోజు న వివాహ వేడుకలు జరుపుట లో అంతరార్థం

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు.
ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు
పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో అడుగిడినాడు.
ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము.
శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది.
కనుక జన్మదినం, వివాహదినం & రాజ్య  పునరాగమనం కూడా  నవమి రోజునే జరిగిందని పెక్కుమంది విశ్వాసం.
ప్రసాదంలోని ప్రత్యేకత:

ఈ పండుగ వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది కాబట్టి శ్రీరాముడిని పూజించిన తరువాత

కొత్తకుండలో. మిరియాలు,
బెల్లంతో చేసిన పానకం,
వడపప్పు
నైవేద్యంగా పెట్టి పంచి పెడతారు.

పానకంలో ఉపయోగించే "మిరియాలు," "ఏలకులు" వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని ప్రసాదిస్తూ, ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
అదే కాకుండా "పానకం" శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది.

అలాగే "పెసరపప్ప్పు" శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది, జీర్ణశక్తి అభివృద్ధి పరుస్తుంది, దేహకాంతి, జ్ఞానానికి ప్రతీక పెసరపప్పునే వడపప్పు అంటారు. ఇది మండుతున్న ఎండలలో వడదెబ్బ' కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుంది.

శ్రీరామనవమి:
 "త్రేతాయుగం"లో వచ్చిన విళంబి నామ సంవత్సరంలోనే "చైత్ర శుక్ల నవమి, మధ్యాహ్నం పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు అవతరించాడు".
ఇప్పటికి సుమారు కోటి 81 లక్షల 60 వేల సంవత్సరాలకు పూర్వం "శ్రీరామ అవతరణం" జరిగిందన్నమాట
పుట్టినరోజున వివాహ వేడుకలు:
భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా, అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారని చెప్తారు.

రామ శబ్ద విశిష్ఠత:

మనం శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు
‘రా’ అనగానే మన నోరు తెరచుకుని మనలోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట!

అలాగనే ‘మ’అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట.

*అందువల్లనే మానవులకు ‘రామనామ స్మరణ’ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట!

No comments: