Adsense

Tuesday, March 21, 2023

శ్రీ ఆంజనేయ స్వామి మాహత్మ్యం.. మైందుని కథ

శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం...!!
మైందుని కథ

🌿పూర్వం సుందరి అనే ఒక పట్టణం వుండేది. అది పేరుకు తగ్గట్టు, సర్వాంగ సుందరంగా వర్ధిల్లింది. అందులో మైందుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు.

🌸వేద శాస్త్రాలన్నీ బాగా చదువుకొన్నవాడు. అతనికి “హనుమన్మంత్రం” అంటే మహా ప్రీతి. అన్నిటి సారం అందులోనే వుంది అని తెలుసుకొన్నాడు.

🌿నిత్యం ఆ మంత్రాన్ని జపిస్తూ, నిష్టగా జీవించేవాడు. మనసులో ఏ విధమైన కోరికలు అతనికి లేవు. నిష్కాముడుగా జీవించటం నేర్చుకొన్నాడు.

🌸మైందుడికి కాశీ వెళ్లి శ్రీ విశ్వనాథుణ్ణి దర్శించాలనీ, గంగా స్నానంతో పులకించాలని అనిపించింది. చాలా ప్రయాసపడి నడిచి వారణాసి చేరాడు. గంగా నదికి దక్షిణ తీరం చేరాడు.

🌿ఆ నదీమ తల్లికి భక్తితో నమస్కరించాడు. నది నిండుగా ప్రవహిస్తోంది. దాన్ని దాటే మార్గం కోసం ఆలోచిస్తున్నాడు. కొంతసేపటికి నదిలోకి ఒక పడవ వచ్చింది.

🌸 దానిని ఎక్కాడు. పడవ బాగానే కొంత దూరం ప్రయాణం చేసింది. తర్వాత దాని అడుగున రంధ్రం ఏర్పడినట్లు గుర్తించారు. నీరు, దాని ద్వారా పడవలోకి చేరుతోంది.

🌿 పడవ బరువెక్కి, మునిగిపోవటానికి సిద్ధంగా వుంది. భయం వేసిన మైందుడు, తలమీద వస్త్రాన్ని కప్పుకొని, భక్తితో “హనుమన్మంత్రాన్ని” పఠిస్తున్నాడు.

🌸హనుమ దీనిని గమనించి, తన భక్తుని కాపాడాలనే సంకల్పనతో ఒక “వానర” రూపం ధరించి, ఆ పడవను నెత్తిన పెట్టుకొని గంగా నదికి ఉత్తర భాగం వరకు తీసుకొని వెళ్లి, అక్కడ మనుష్యులంతా చూస్తుండగా అదృశ్యమైనాడు.

🌿దీన్ని గమనించిన వారందరూ ఆశ్చర్యంతో నిండిపోయారు. భక్తితో, ఆ కోతికి నమస్కరించారు. పడవలో నిశ్చల జపంలో వున్న మైందుడికి ఇదేమీ తెలీదు.

🌸 తెల్లవారి లేచి చూసేసరికి గంగ ఒడ్డున పడవ వుండటం చూసి ఆశ్చర్యపడ్డాడు. పడవ ఎలా ఇంత ప్రమాదం నుంచి తప్పించుకొని ఒడ్డుకు చేరిందో తెలీలేదు.

🌿అప్పుడు ఒడ్డున వున్న ఒక మనిషి ఒక మహా వానరం ఈ పడవను తలమీద మోసుకొని ఒడ్డుకు చేర్చి వెళ్లిపోయిందని చెప్పాడు.

🌸మైందుడికి ఆశ్చర్యం వేసి “మీరు పుణ్యాత్ములు, వానర రూపంలో హనుమను దర్శించారు. జపం చేస్తూ నేను ఏదీ గమనించలేకపోయాను.

🌿 నేను అదృష్టహీనుణ్ణి. హనుమ దర్శనం పొందని ఈ శరీరం వృధా. గంగ పాలు చేస్తాను" అని చెప్పి గంగా నదిలోకి దూకటానికి సిద్ధమైనాడు. అప్పుడు హనుమ పట్టు వస్త్రాలు ధరించి, వాత్సల్యంతో నిజరూపంతో మైందునికి దర్శనం ఇచ్చాడు.
హర్ష పులకితుడై మైందుడు హనుమను స్తుతించాడు.

🌷“ఉష్ట్రా రూఢ, సువర్చలా సహచర, సుగ్రీవ మిత్రాంజనా సూనో, వాయుకుమార, కేసరి తనూజా అక్షాది దైత్య కాంతకా,

సీతా శోక హరా, అగ్ని నందనా, సుమిత్రా సంభవ, ప్రాణదా-శ్రీ భీమాగ్రజ, శంభు పుత్ర, హనుమాన్, పంచాస్య తుభ్యం నమ:” 🌷

🌸అని చేసిన స్తోత్రానికి ఆనంద పరవశుడై హనుమ "భక్తా! మైందా! నువ్వు ఈ లోకంలో భోగాలన్నీ అనుభవించు. నీ దగ్గరే నేను ఉంటాను. జీవితాంతంలో నన్ను పొందుతావు” అని వరం ఇచ్చి అదృశ్యం అయ్యాడు.

🌿అలాగే మైందుడు భక్తితో జీవించి, సుఖాలు పొంది, చివరికి హనుమ మంత్ర ఫలం వల్ల కైవల్యం పొందాడు...స్వస్తి.

No comments: