Adsense

Sunday, March 26, 2023

శ్రీ పద్మాక్షి మందిరం, వరంగల్ జిల్లా : హనుకొండ

💠 సాధారణంగా దేవాలయాల్లో వెలసిన దేవతల విగ్రహాలు ఏ రూపంలో ప్రతిష్టిస్తే ఆ రూపంలోనే భక్తులకు దర్శనం ఇస్తారు.
కానీ అక్కడ పూజలు అందుకుంటున్న అమ్మవారు మాత్రం మూడు పూటల్లో మూడు రూపాల్లో దర్శనం ఇస్తుంటారు.
ఇది ఎలా జరుగుతుందన్నది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే ఉంది.

💠 12వ శతాబ్దం ప్రథమార్థంలో కాకతీయుల కాలంలో నిర్మితమైన పద్మాక్షి అమ్మవారి ఆలయం ఈ ప్రత్యేకత సంతరించుకుని భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది.
మొదట జైన మందిరంగా ఉన్న దీన్ని కాకతీయ రాజులు హిందూ ఆలయంగా అభివృద్ధి చేసి తమ ఇలవేల్పు అయిన పద్మావతి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు.
ఆ అమ్మవారే పద్మాక్షి దేవిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు.


💠 తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణంలో ఒక గుట్ట అంటే కొండపై ఈ ఆలయం నిర్మించారు. అప్పటినుంచీ అమ్మవారి పేరుతోనే అది పద్మాక్షి గుట్టగా ప్రసిద్ధి పొందింది.

💠 కొన్ని శతాబ్దాల క్రితం ఈ గుట్టపై బసది పేరుతో ఒక జైన మందిరం ఉండేది. ఓరుగల్లును ఏలిన కాకతీయ రాజులు ఈ మందిరాన్ని 12వ శతాబ్దంలో హిందూ ఆలయంగా తీర్చిదిద్ది తమ ఇలవేల్పు అయిన పద్మావతి అమ్మవారిని ప్రతిష్టింపజేశారు. అయితే ఇప్పటికీ అక్కడ జైన మత ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. గర్భగుడిలో రాతిపై ప్రముఖ జైన తీర్థంకరుడు పార్శ్వనాథుడు ఆయనకు కుడివైపు యక్ష ధరణింద్రుడు, ఎడమవైపు పద్మాక్షి దేవి భారీ చిత్రాలు కనిపిస్తాయి.

🔅 స్థల పురాణం 🔅

💠 సిద్ధులకు మోక్షాన్ని ప్రసాదించడానికి ఈశ్వరుడు అవతరించిన ప్రాంతమే పద్మాక్షీ ఆలయం.
పూర్వం ఇక్కడ సిద్ధులు మోక్ష సాధనకై ఈశ్వరుడికోసం తపస్సు చేశారు.
శివుడు ప్రత్యక్షమై, శక్తి లేనిదే మోక్షంలేదని, ఆవిడకోసం తపస్సు చెయ్యమని చెప్పగా మునులు అలాగే చేశారు.
శక్తి ప్రత్యక్షమై తన పాదాల దగ్గర ఈశ్వరుడు వుంటే అలాగే సిద్ధుల అభీష్టం మేరకు అక్కడ వెలుస్తానన్నది.
ఈశ్వరుడు దానికి ఒప్పుకుని కొండ దిగువను సిద్ధేశ్వరస్వామిగా వెలిశాడు.
అమ్మవారు కొండపైన చిన్న గుహలో పద్మాక్షీదేవిగా వెలిసింది. ఆ చిన్న గుహనే గర్భాలయంగా మలిచారు.

💠 కాకతీయ వంశానికి ‘కాకతీయులు’ అనే పేరుకూడా అమ్మవారే పెట్టిందట.
5వ శతాబ్దంలో కాకతీయ రాజుకి ఖడ్గాన్నిచ్చి, ఆ ఖడ్గం ఆయన దగ్గరున్నంతవరకూ విజయం లభిస్తుందని ఆశీర్వదించింది.

💠 కాకతీయ రాజులలో జైనమతావలంబులున్నారు.
అందుకే కొన్ని జైన శిల్పాలను కూడా కొండమీద చూడవచ్చు.
కాకతీయ సామ్రాజ్య అవతరణకు చాలా ఏళ్లకు ముందే గుట్టపై పద్మాక్షి ఆలయం ఉందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
పద్మాక్షీ అమ్మవారు ఓరుగల్లువాసుల ఇలవేల్పు. కొండముందు కాకతీయులకాలంనాటి చెరువు. ఈ చెరువులో బతుకమ్మల నిమజ్జనం చాలా వైభవంగా జరుగుతుంది.

💠 కాకతీయుల రాజులు అమ్మవారని దర్శించి పూజలు నిర్వహించిన అనంతరం యుద్థముహుర్తాలకు, శుభగడియలుగా భావించి శత్రువులపై యుద్దం ప్రకటించి విజయం సాధించేవారట.

💠 ఈ ఆలయం ఎత్తైన గుట్టమీద ఉన్న ఓ కొండను తొలిచి నిర్మించారు.
ఈ గుట్టను పద్మాక్షి గుట్టగా పిలుస్తుంటారు. గుట్ట కింది భాగం నుండి ఆలయాన్ని చేరుకోవకోవడానికి గుట్టనే తొలిచి మెట్లుగా రూపొందించారు.
ఆలయ ప్రవేశద్వారం వద్ద నలుపు గ్రానైట్ రాతితో నిర్మించిన మూడు జట్ల నిలువు వరుసలను చూడవొచ్చు. దీనిని అన్నకొండ స్తంభం అంటారు.
దీనిమీద ఉన్న చెక్కడాలు మరియు శాసనాలు చూసే ఇది జైనుల యొక్క స్తూపం అని, జైనుల దేవతలకు అంకితం చేసారని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.


💠 వరంగల్‌ జిల్లాలోని ఇతర పురాతన ఆలయాలతో పోల్చుకుంటే పద్మాక్షీ దేవాలయం అభివృద్ధికి ఆమడదూరంలో ఉందనే చెప్పాలి. బతుకమ్మ పండుగ వస్తే తప్ప పాలకులకు పద్మాక్షీ అమ్మవారు గుర్తుకురారు.
ఇంతటి చారిత్రక ఆలయంలో తాగునీటి సౌకర్యం లేకపోవడం ఈ ఆలయం పట్ల సర్కారు నిర్లక్ష్య వైఖరి స్పష్టం అవుతోంది.

💠 గుట్ట పైకి వెళ్ళడానికి సీసీ రోడ్డు వేయాలన్న డిమాండ్‌ ఆచరణకు నోచుకోలేదు. గుండం ఇప్పటికే మురికి కూపంగా మారిపోయింది. బతుకమ్మ, వినాయక విగ్రహాల నిమజ్జనాల వల్ల పూడిక పేరుకు పోతోంది. ఈ పండుగల అనంతరం పూడిక తీయడం వల్ల మరిన్ని సంవత్సరాలు ఈ పండుగల నిర్వహణకు అవకాశ ముంటుంది. లేదంటే కొద్ది సంవత్సరాల్లోనే పూడికతతో నిండిపోయి ఏ నిమజ్జనాలకు పనికి రాకుండా పోయే అవకాశాలు ఉన్నాయి.
కనీస వసతులు కల్పిస్తే సంఖ్య పెరిగే అవకాశముంటుంది.
గుట్ట పైన ఇతర విగ్రహాలు, వింతలు, విశేషాలు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అత్యంత ప్రాచీనమెన ఈ ఆలయాన్ని పరిరక్షించుకోవలసిన అవసరం ఓరుగల్లు ప్రజల పై ఉంది.


💠 పద్మాక్షి దేవాలయం వరంగల్ జిల్లా హన్మకొండ నగరం నడిబొడ్డున వేయి స్తంభాల గుడి కి అతి దగ్గరలో పద్మాక్షి దేవాలయం ఉంది.

No comments: