Adsense

Sunday, March 19, 2023

కరుణ’దేవుడు.. వరుణుడు



వరుణుడు చల్లని దేవుడు. అష్టదిక్పాలకులలో ఒకడు. పడమటి దిక్కుకు అధిపతి. శ్వేతవర్ణుడు. అతడి నెత్తిన నవరత్న ఖచిత కిరీటం ఉంటుంది. దాని పేరు.. కరండ మకుటం. సృష్టిలోని ప్రతి ప్రాంతాన్నీ సస్యశ్యామలం చేయాలి కాబట్టి, నిత్య సంచారం తప్పదు. కాబట్టే, వరుణుడి వాహన సముదాయమూ పెద్దదే. కొన్నిసార్లు చేపమీద, కొన్నిసార్లు మొసలి మీద ప్రయాణిస్తుంటాడు. కొన్నిసార్లు పాదచారియై కర్తవ్య నిర్వహణకు బయలుదేరతాడు. వాన దేవుడికి హంసల తేరూ ఉంది. చినుకులు, వర్షం, తుపాను, పెను తుపాను.. ఉద్ధృతిని బట్టి అతడి స్వభావం మారుతుంది. కాబట్టే, కొన్నిసార్లు రెండు చేతులతో, కొన్నిసార్లు నాలుగు చేతులతో దర్శనమిస్తుంటాడు. సూర్యుడిలా వరుణుడూ ప్రత్యక్ష భగవానుడే. వర్షాకాలంలో రోజూ వరుణ కటాక్షమే.

వరుణుడు.. వేదాలు కొలిచిన దేవుడు. అనేక రుక్కులు అతడిని కీర్తిస్తాయి, ప్రార్థిస్తాయి. ఉపనిషత్తుల్లో, పురాణాల్లో వరుణుడి ప్రస్తావనలు అనేకం. మహాభారతం, విష్ణుధర్మోత్తర పురాణం వరుణతత్వాన్ని విశ్లేషించాయి. మట్టిలోని చిట్టిగింజ మొలకెత్తడానికి చినుకై చేయూతనిచ్చినట్టే.. భక్తుడి ఆకాంక్షల్ని నిజం చేయడానికి... వరుణుడు సమస్త ప్రకృతినీ నియోగిస్తాడని అంటారు. ముఖ్యంగా ఆ రూపాన్ని తలుచుకుంటే చాలు.. మనసులోని చికాకులు తొలగిపోతాయి. వర్షం వెలిసిన ఆకాశంలా మనసు నిర్మలం అవుతుంది. కష్టాలూ కన్నీళ్లూ వెంటాడుతున్న సమయంలో హంసవాహనుడైన స్వామిని కండ్ల ముందు నిలుపుకోవాలని సూచిస్తారు ఆధ్యాత్మికవేత్తలు. ఓ వర్ణన ప్రకారం...వరుణుడి వాహనాన్ని ఏడు హంసలు లాగుతుంటాయి. లంబోదరుడైన స్వామి అందులో ఊరేగుతుంటాడు. రథంపై మత్స్య ధ్వజం రెపరెపలాడుతూ ఉంటుంది. ఆ బానపొట్ట.. భోజన ప్రియత్వానికి ప్రతీక! సకాల వర్షమై వరుణుడు సకల ధాన్యాలకూ ప్రాణశక్తిని ఇస్తాడు. ఆ గింజలే అందరి ఆకలినీ తీరుస్తాయి. ముల్లోకాలూ సుభిక్షంగా ఉంటే వరుణుడి కడుపు నిండినట్టే! ఆ పొట్టనిండా సంతృప్తే! వరుణదేవుడిని సంతాన సాఫల్య దైవంగానూ కొలుస్తారు. ఆయన ఎడమ తొడమీద ప్రియపత్ని దర్శనమిస్తుంది. ఆమె చేతిలో నల్లకలువ. అది మేఘాలకు ప్రతీక కావచ్చు. మరొక చేతితో ఆమె స్వామిని ఆలింగనం చేసుకుని ఉంటుంది. ఆ భంగిమ ఆదర్శ దాంపత్యానికి నిదర్శనం. దంపతులకు అటూ ఇటూ గంగాయమునలు దర్శనమిస్తారు.

ఓం జలబింబాయ విద్మహే
నీల పురుషాయ ధీమహి
తన్నో వరుణః ప్రచోదయాత్‌'

.. అంటూ వరుణ గాయత్రీ మంత్రంతో ఉపాసకులు స్వామిని కొలుస్తారు.

రెండు నగరాలు

వరుణదేవుడు రెండు నగరాలకు అధిపతి. పడమటి దిక్కును పాలించేటప్పుడు.. శద్ధావలు అనే నగరంలో కొలువుదీరతాడు. జలాధిదేవతగా పాలన సాగిస్తున్నప్పుడు.. సముద్రగర్భంలో విశ్వకర్మ నిర్మించిన మణిమయ మందిరంలో సభ నిర్వహిస్తాడు. స్వామి జలసంపదకూ అధిపతి. జలం.. సకల ఔషధ సమాయుక్తం. ‘వాటర్‌ థెరపీ’గా చెప్పుకునే జలచికిత్స వేదకాలం నుంచీ ఉంది.

‘ఆకాశంలో సూర్యోదయ సూర్యాస్తమయాలకు అవకాశాన్ని కల్పించిన వరుణుడు మా శత్రువులను
నిర్మూలించుగాక!’
‘స్వామీ! నీ చేతిలో సకల ఔషధాలూ ఉన్నాయి. మమ్మల్ని పాపాలకు పురిగొల్పేవారిని శిక్షించు. ఆ చెడు ప్రభావానికి మమ్మల్ని దూరంగా ఉంచు’

అంటూ వేదం వరుణుడిని ప్రార్థించింది. ఏ రాజ్యం సుభిక్షంగా ఉండాలన్నా, వరుణుడి కటాక్షం ఉండాల్సిందే. ప్రభువు నీతిమంతుడు అయినప్పుడే ... వానదేవుడు అనుగ్రహిస్తాడు, సకాలంలో వర్షాలు కురుస్తాయి. ఆ గడ్డ మీద ఈతిబాధలు ఉండవు.

పాలకుడి పట్టాభిషేక సమయంలోనూ వరుణుడి ప్రస్తావన వస్తుంది..

‘ధ్రువం తే రాజా వరుణో..
ధ్రువం దేవో బృహస్పతి’ అంటూ!

రాజైన వరుణుడు.. సస్యవృద్ధితో ప్రజలను రక్షించుగాక - అని ఈ మంత్రానికి అర్థం.

వరుణుడు యజ్ఞప్రియుడు. వేదాల్లో ప్రస్తావితమైన ‘కారీరి’ యజ్ఞాన్ని నిర్వర్తిస్తే ఆనందభరితుడు అవుతాడట. ‘ఇమం మేవరుణ శ్రుధీహవ మద్యాచమృడయ’.. తదితర శుక్ల యజర్వేద మంత్రాల్లో ‘వరుణా! మా ఆయుర్దాయం క్షీణించకుండా చూడు’ అన్న విన్నపం వినిపిస్తుంది. ‘అయ్యా! అగ్నిదేవా వరుణుడికి ఓ మాట చెప్పు. నువ్వు పూనుకుంటేనే ఆయన శాంతించేది. హవిస్సును ఇద్దరూ పంచుకుని తినండి’ అని వేడుకుంటుందో వేద రుక్కు.

మహా పరివారం

వరుణదేవుడి కుటుంబం పెద్దదే. ఆయనకు పలువురు భార్యలు. వారిలో వరుణాని, చార్షణి, జ్యేష్ఠ.. అనేవారి ప్రస్తావన పలు సందర్భాలలో కనిపిస్తుంది. వరుణానికే గౌరీ అనే పేరు ఉన్నట్టు తెలుస్తున్నది. వరుణుడికి సుషేణుడు, వంది, వసిస్ఠుడు అనే కుమారులు, వారుణి అనే కుమార్తె ఉన్నారు. వీరంతా వరుణ, వరుణాని సంతానమని చెబుతారు. అలాగే జ్యేష్ఠాదేవి వల్ల బల, సుర, సురనందిని, అధర్మకుడు అనే పిల్లలు కలిగారు. మనువులలో దక్షసావర్ణి మనువు, పుష్కరుడు వరుణ సంతానమని పేర్కొంటున్నారు. ఈయన సంతానంలోనివాడే రామాయణ కథలో వానర ప్రముఖుడైన సుషేణుడు.

అయినా, వరుణుడు ఎవరో కాదు. సాక్షాత్తు సృష్టికర్తే! వరుణ, అగ్ని, పృథివి, వాయువు, అంతరిక్షం - ఇలా ఎనిమిది రూపాలూ ధరించి పరమాత్మ ప్రాణులను ఉత్పన్నం చేస్తున్నాడని అంటున్నది వేదం.

అనన్తావైవేదాః -

వేదాలు అనంతాలు.

వరుణుడి ప్రస్తావనలూ అనంతాలే!
స్వామి కటాక్షానికి..
వరుణుడు జలాలకు అధిదేవుడు. బావులూ చెరువుల నిర్మాణానికి ముందు వరుణపూజలు చేస్తారు. కరువుకాటకాల సమయంలో వరుణయాగాలూ, వరుణ జపాలూ నిర్వహిస్తారు. సముద్ర యాత్రలకు బయల్దేరుతున్నపుడు వరుణ వ్రతాలు చేసుకుంటారు. వరదలూ తుపానులూ తదితర జలసంబంధ ఉపద్రవాల నుంచీ కాచి కాపాడేదీ ఈ దేవుడే. పడమటి దిక్కుకు పెద్ద కాబట్టి, ఆ వైపు నుంచి ఏ ముప్పు వచ్చినా.. ప్రజలకు తానే దిక్కు! హంసవాహనుడైన వరుణుడికి క్షీరనీర న్యాయమూ తెలుసు. కాళ్లు పట్టుకున్నవారినంతా కటాక్షించడు. నీతివర్తనులకే అభయమిస్తాడు. దారితప్పితే వరుణ పాశంతో శిక్షిస్తాడు. ఆకాశంలోని నక్షత్రాలు స్వామి నేత్రాలు. ఆ కండ్లతో సృష్టిలో ప్రతి కదలికనూ గమనిస్తూ ఉంటాడని పురాణాలు పేర్కొంటాయి.

జన్మజన్మల బంధం

సనాతన ధర్మం ప్రకారం.. పుట్టడం, గిట్టడం అనేవి కర్మ సిద్ధాంతం ఆధారంగా నడుస్తుంటాయి. ఈ ప్రక్రియలో సూత్రధారి వరుణదేవుడే. ప్రతి జీవీ పాపపుణ్య ఫలాలను అనుభవించాల్సిందే. ఆ చక్రంలో భాగంగా జీవుడు.. ముందుగా చంద్రలోకానికి, ఆ తర్వాత ‘ద్యు’లోకానికి వెళతాడు. అక్కడి నుంచి మేఘాలకు చేరతాడు. అక్కడ, వర్షంతో కలిసి భూమికి చేరి, పంట మొక్కలకు జీవంగా మారతాడు. పూర్వజన్మ కర్మలను అనుసరించి ఎవరు ఆ ఆహారాన్ని తినాలో వారే దాన్ని తింటారు. అలా తిన్న పురుషుడి నుంచి స్త్రీ గర్భంలోకి చేరి పునర్జన్మ పొందుతాడు జీవుడు. ఇలా సంతాన ప్రాప్తికి కూడా వరుణదేవుడు కారకుడంటారు. కాబట్టే, పండంటి బిడ్డల కోసం సంతానార్థులు వరుణపూజలు చేస్తారు. సత్య హరిశ్చంద్రుడికి చాలాకాలం సంతానం ఉండదు. వరుణుడి వరంతోనే రోహితుడు జన్మిస్తాడు. ఆ అల్పాయుష్కుడిని మళ్లీ వరుణుడే బతికిస్తాడు.

No comments: