Adsense

Sunday, March 19, 2023

శ్రీ కోటదుర్గమ్మ ఆలయం, పాలకొండ, విజయనగరం జిల్లా

విజయనగరం జిల్లా : పాలకొండ
 


💠 కరుణించడంలో, కష్టాలను కరిగించడంలోను కనకదుర్గమ్మ ముందుంటుందని అంటుంటారు.
తనని నమ్ముకున్న బిడ్డల ఆలనా పాలన చూసుకోవడానికి గాను ఆ తల్లి ఆవిర్భవించిన క్షేత్రమే 'పాలకొండ'.

💠 శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఈ పాలకొండ గ్రామంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ అమ్మవారు స్వయంభువుగా వెలసింది అంటారు

💠 బొబ్బిలి రాజుల ఆరాధ్యదేవత పాలకొండ కోటదుర్గమ్మ. ఈ కోటదుర్గమ్మ ఆలయం ఉత్తరాంధ్రకే ప్రసిద్ధి. ఈ జిల్లాలోనే అత్యధిక ఆదాయాన్నిచ్చే ఆలయాల్లో ఇది రెండోది.

💠 అప్పట్లో ఈ ప్రాంతం సవర రాజుల ఏలుబడిలో వుండేది. వారి కోటలో వెలసిన కారణంగానే దుర్గమ్మకి 'కోట దుర్గమ్మ'గా పేరు వచ్చింది.
అయితే అప్పట్లో రాజులు వారి కుటుంబ సభ్యులు మాత్రమే అమ్మవారిని దర్శించుకుని పూజించుకునే వారు.
కాలక్రమంలో రాజరికాలు అంతరించడంతో, కోటలోని అమ్మవారికి ఆదరణ కరవైంది.

💠 అలాంటి పరిస్థితుల్లో అమ్మవారు 'కృష్ణదాసు' అనే భక్తుడి కలలో కనిపించి తన జాడను తెలియజేసింది.
తనకి ఆలయం నిర్మించి భక్తులకి తన దర్శన భాగ్యం కలిగించమని కోరింది.
కృష్ణదాసు గ్రామ పెద్దలకు విషయం చెప్పి వారి సహకారంతో అమ్మవారు చెప్పినట్టుగానే చేశాడు. నాటి నుంచి తిరిగి అమ్మవారు నిత్య పూజలు అందుకుంటోంది.

💠 ఇప్పటికీ ఆనాటి పద్ధతులను అనుసరించే అమ్మవారికి ఉత్సవాలు ,ఊరేగింపులు జరుగుతుంటాయి.
చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కోట దుర్గమ్మను దర్శించి తమ మొక్కుబళ్లు చెల్లిస్తుంటారు.

💠 అడిగినదే తడవుగా అమ్మవారు ఆయురారోగ్యాలను , సిరిసంపదలను ప్రసాదిస్తుందని భక్తులు అనుభవ పూర్వకంగా చెబుతుంటారు

💠 దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ అట్టహాసంగా, సాంప్రదాయబద్ధంగా జరుగుతాయి." కోటదుర్గమ్మ  కరుణించు మాయమ్మ " అన్న నామస్మరణతో పాలకొండ పట్టణం మారుమోగిపోతుంది.
తెల్లవారు జామున నాలుగు గంటలకు స్థానిక భక్తులు అమ్మవారి మాలధారణ కార్యక్రమంతో ప్రత్యేక పూజలు చేస్తారు. పాలకొండలోని కోటదుర్గమ్మను దర్శించేందుకు తొలి రోజే నుంచే అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు.

💠 ఏడాదిలో ఒక్కసారి అమ్మ నిజరూపదర్శనం చేసుకుంటే జీవితకాల పుణ్యం చేకూరుతుందన్న నమ్మకంతో భక్తులు దేవస్థానానికి పోటెత్తుతారు.
తొలిరోజు సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు.


💠 శ్రీకాకుళం పట్టణానికి 36 కిలోమీటర్ల దూరంలో పాలకొండ అనే గ్రామంలో ఉంటుంది ఈ కోట దుర్గమ్మ దేవాలయం.

No comments: