Adsense

Saturday, March 25, 2023

శ్రీ రామప్ప దేవాలయం, వరంగల్ జిల్లా : పాలంపేట



💠 సహజంగా ఏవైనా  ఆలయాలకు గుళ్లో ఏ దేవుడిని ప్రతిష్టించారో ఆ ఆలయం పేరు పెడతారు. లేకపోతే ఫలానా రాజు హయాంలో కట్టించారని తెలిసేందుకు గానూ.. రాజుల పేర్లు  కలసి వచ్చేలా పేర్లు పెడతారు.
కానీ, ఇక్కడ మాత్రం 40 ఏళ్ల పాటు శ్రమించిన శిల్పి రామప్ప పేరు పెట్టడం అప్పటి రాజుల గొప్పదనం.

💠 హోయసలనాడు (ఈనాటి కర్ణాటక రాష్ట్రం)
కి చెందిన రామప్ప  అనే శిల్పి నాయకత్వం లో ప్రణాళిక ప్రకారం 14 సంవత్సరాలలో కట్టబడిన శివాలయం యిది.
కానీ ఈ ఆలయంలో కొలువున్న ఈశ్వరుని పేరు మీద కాకుండా  శిల్పి పేరు మీద 'రామప్ప' దేవాలయంగా జగత్ప్రసిధ్ధి చెందినది.

💠 కాకతీయుల పాలన శిల్ప కళకు స్వర్ణయుగం, అందులోనూ త్రికూటాలయాలు ప్రసిద్ధి చెందాయి. అయితే, రామప్ప గుడి త్రికూటాలయం కాదు.
కానీ, ఈ ఆలయానికి మూడు ప్రవేశ ద్వారాలున్నాయి.
ఎత్తయిన పీఠంపై నక్షత్ర ఆకారంలో, తూర్పునకు అభిముఖంగా గుడిని నిర్మించారు.

💠 ఈ ఆలయాన్ని  రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం  ప్రక్కనే రామప్ప చెరువు వున్నది. ఈ చెరువు కాకతీయుల కాలం నాటిది.
ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడని తెలుస్తున్నది. రామప్పగుడిగా ప్రఖ్యాతి చెందిన ఈ రుద్రేశ్వరాలయం కాకతీయ వాస్తు, శిల్పకళకు నిదర్శనం.

💠 రామప్ప ఆలయ గోపురం తేలికైన ఇటుకలతో రూపొందించారు. ఈ ఇటుకలను ప్రత్యేకమైన మట్టితోపాటు ఏనుగులద్దె, అడవి మొక్కల జిగురు, ఊకపొట్టు, మరికొన్ని పదార్థాలు కలిపి తయారు చేశారు.
ఈ పదార్థాలన్నీ సరైన మోతాదులో ఉపయోగించి గట్టిదనం ఉంటూనే, తేలికగా ఉండే ఇటుకలను రూపొందించారు. ఇవి నీటిలో తేలుతాయి.

💠 ఈ దేవాలయం నక్షత్రాకారంలో వుంది. మూడు దిక్కులా ప్రవేశద్వారాలున్నాయి.
కర్ణాటలోని హోయసల సామ్రాజ్యానికి చెందిన బేలూరు, హళేబేడు దేవాలయాల తర్వాత అంతగొప్ప శిల్పకళాసౌందర్యం రుద్రేశ్వరాలయంలో వుంది.

💠 రామప్ప గుడిలో  పెద్దస్తంభాలు, విశాల రంగమండపము దూలముల , అందమైన పై కప్పులు, శిఖరములు వున్నాయి. రంగమండపస్తంభాల మీద పురాణ, ఇతిహాస గాథలతో శిల్పాలను సుమనోహరంగా చెక్కారు. అంతరాళం, గర్భగృహం, ముఖమండప ప్రవేశ ద్వారాల మీద యవ్వన స్త్రీలను, చెట్లు, పద్మములు, గజలక్ష్మి తదితర శిల్పాలను చెక్కారు.
ఆలయంలోని వివిధ భంగిమల్లోని శిల్పాలు ఆకర్షణీయంగా వున్నాయి.
అందులో పురుష-స్త్రీ దేవతలు, యుద్ధవీరులు, గారడీవిద్య చేస్తున్నవారు, సంగీత, నృత్యకారులు, యక్షిణిలు, బూతుబొమ్మలు చూపురులను కట్టిపడేస్తాయి.

💠 ముఖ్యంగా వివిధ నృత్యభంగిమల్లో గల 12 మంది స్త్రీలు పొడుగ్గా యున్న సాలభంజికలు, దేవనర్తకీమణులు (అప్సరసలు), నాగకన్యలు కడు శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా వున్నాయి.

💠 ప్రఖ్యాత నాట్యాచార్యుడు డాక్టర్ నటరాజ రామకృష్ణ 45 సార్లు రామప్పగుడిని సందర్శించి కాకతీయ శిల్పంలోని నృత్యమును పరిశోధించి “పేరిణి శివతాండం” అనే నృత్యరీతిని రూపొందించారు.

💠 రామప్పగుడి చుట్టూ ఎర్రని రాతితో వాత్సాయన కామసూత్రాలను మలిచారు. కామిగానివాడు మోక్షగామికాడు అని మన పూర్వీకులు ఊరకే అనలేదు. ధర్మార్థకామములను పాటించినవానికి మోక్షం లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. మనస్సును స్థిమితంగా వుంచినవారే ఆధ్యాత్మిక శాంతిని పొంది భగవంతుని దర్శించగలరు.

💠 ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది.
ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని, చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా అన్నట్లుంటుంది.
ముందు నుంచి ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది.

🔅 శిల్ప కళా చాతుర్యం 🔅

💠 రామప్పగుడి ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్ప నైపుణ్యం వర్ణిచనలవికానివి.

⚜ ముఖ్యమైన శిల్పాలు ⚜

🔅 ధనుర్బానం పట్టిన యువతికి చెందిన అరికాలి నుండి ముల్లు తీస్తున్న సేవకురాలు.

🔅 నర్తకీమణి :
అల్పరూపాల్లో వున్న వాయిద్యకులు, వారి ముఖ కవళికలు, శరీర సౌష్టవం, అందంగా మలచిన వెంట్రుకలు, ఆభరణాలను గమనించాలి. నర్తకీలో నాట్యభంగిమ, సున్నితమైన అంగసౌష్టవము, ఆభరణములు కలవు. రూప సౌందర్యాన్ని ప్రదర్శించే నర్తకి “హైహీల్స్”తో కూడిన పాదరక్షణలు.

🔅 క్షీరసాగర మధన దృశ్యం కనువిందుగా వుంది. మేరుపర్వతమును కవ్వంగా, వాసుకి సర్పమును తాడుగా చేసుకొని తలదిక్కులో రాక్షసులు, తోకవైపు దేవతలు, సాగరమధనం చేస్తున్నట్టుగా చెక్కిన శిల్పాలు.

🔅 గోపికలు స్నానం చేస్తుండగా శ్రీకృష్ణుడు వారి వస్త్రాలను దొంగిలించి చెట్టుపై కూర్చొని వుండగా నగ్నంగా వున్న గోపికలు శ్రీకృష్ణున్ని ప్రార్థిస్తున్న శిల్పాలు.

🔅 త్రిపురసంహారం, దక్ష సంహారం, గిరిజాకళ్యాణం.

💠 తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు సృష్టించింది.
యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఒక్కటి కూడా లేదు. తాజాగా రామప్ప ఆలయానికి ఈ ఖ్యాతి దక్కడం ప్రాధాన్యం సంతరించుకుంది.

💠 రామప్ప దేవాలయం వరంగల్ 70కి.మీ. దూరంలో వుంది.

No comments: