Adsense

Friday, March 10, 2023

కృష్ణా జిల్లా : " కదళీపురo "పెద్ద కళ్ళేపళ్లి" శ్రీ దుర్గా నాగ మల్లేశ్వరస్వామి ఆలయం

కృష్ణా జిల్లా : " కదళీపురo "పెద్ద కళ్ళేపళ్లి"
 శ్రీ దుర్గా నాగ మల్లేశ్వరస్వామి ఆలయం


💠 ఆదిదేవుడు ఆవిర్భవించిన పరమ పవిత్రమైన ప్రాచీన క్షేత్రాల్లో 'పెదకళ్ళేపల్లి' ఒకటిగా కనిపిస్తుంది.
పురాణాల్లో కదళీపురం పేరుతో కనిపించే ఈ క్షేత్రంలో దుర్గానాగేశ్వరస్వామి స్వయంభువు మూర్తిగా దర్శనమిస్తూ ఉంటాడు.

💠 కృష్ణాజిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో  పెదకళ్లేపల్లి ఒకటి.
పవిత్ర కృష్ణవేణి తీరాన కొలువైన ఈ తీర్థక్షేత్రాన్ని నాగేశ్వర క్షేత్రమనీ, కర్నాటక క్షేత్రమనీ కూడా అంటుంటారు.

💠 ఈ క్షేత్రంలో శివలింగం కర్కోటకుడనే సర్ప రూపంలో వుంటుంది. కనుక దీనికి కర్కోటక క్షేత్రం అని విశ్వామిత్రుడు మదన గోపాలుని ప్రతిష్ఠించినందున విశ్వామిత్ర క్షేత్రమని కూడా పేరుపొందింది.
దీనికే కదళీపురమని ,రంభాపురమని కూడా పిలుస్తుంటారు.

💠 ఈ క్షేత్ర మహిమను అగస్త్య మహర్షి శ్రీరామచంద్రునికి వివరించినట్లుగా పద్మపురాణం చెబుతోంది.
కాశీలో గంగ ఉత్తర వాహినిగా ప్రవహించినట్లే కృష్ణానది కూడా ఇక్కడ ఉత్తర వాహినిగా ప్రవహించి శ్రీ నాగేశ్వరస్వామి వారి దృష్టిచే పునీతమై తరింపచేస్తోంది.
కావున ఇది దక్షిణ కాశిగా ప్రసిద్ధి.

🔔స్థలపురాణం :

💠 ఈ క్షేత్రంలో కశ్యప ప్రజాపతి పుత్రులైన కర్కోటకుడు మొదలగు
ఎనిమిది మంది సర్పరాజులు విధివశాన శాపగ్రస్తులై, ఆశాప విముక్తికోసం శిలావేదిక నిర్మించి నలుపక్కలా కదళీ వృక్షాలు నిలిపి
దానికి ఈశాన్యభాగాన ఒక సరోవరం తవ్వి, ఆ జలంతో శివుని అభిషేకించి పూజించగా, మంటప మధ్య భాగంలో  శంకరుడు ప్రత్యక్షమై 'కదళీ వృక్షాల’ నడుమ నన్ను ఆరాధించారు కనుక కదళీపురనామంతో ఇక్కడొక పుణ్యక్షేత్రం విలసిల్లగలదని వరమును గ్రహించాడట.
ఆ కదళీపురమే  తర్వాత సముద్రానికి దగ్గరగా ఉన్న ఈ పల్లె అని 'కడలి పల్లె' అని పిలువబడేదంటారు. అదే కాలక్రమంలో కళ్లేపల్లిగా నామాంతరం చెందింది.

💠 ఇక్కడ ఎన్నో తీర్థాలు ఆవిర్భవిస్తాయనీ శివుడు చెప్పాడు. అలాగే పరికర్ణకాతీర్థం, తక్షక తీర్థం, శంఖపాలుని తీర్థం, కర్కటక తీర్థం, వాసుకీ తీర్థం, శంఖ చూడ తీర్థం వున్నాయి. సారంగుడనే రాజు ఒక తటాకంలో స్నానం చేస్తే స్ర్తిగా మారిపోతే శంఖతీర్థంలో స్నానం చేసి మరల పురుషాకృతి వచ్చింది.

💠 బృహస్పతి భార్య తారతో చంద్రుడు సుఖించిన కారణంగా ఆమె గర్భవతియై శిశువును కంటుంది. పాప పరిహారార్థమై నారదుని సలహాతో చంద్రుడు కదళీపురానికి వచ్చి నాగేశ్వరస్వామిని పూజించాడు.
అతడు తవ్విన గుండమే మముద్వతి గుండమని పేరుపొందింది.

💠 ఇచట కృష్ణానదిలో స్నానమాచరిస్తే పునర్జన్మ లేదని స్కాంధ పురాణం ఉద్ఘోషించింది.

💠 ఇచట దుర్గాపార్వతీ సమేత నాగేశ్వరాలయాన్ని తొలుత క్రీ.శ.1292లో సోమశివాచార్యులువారు కట్టించారు.
ఆ తరువాత తిరిగి 1782లో శ్రీ శంకరస్వామివల్ల ప్రేరేపితులై చల్లపల్లి సంస్థానాధీశులు జీర్ణోద్ధరణగావించినట్లు శాసనాలు చెబుతున్నాయి.అప్పటినుంచి చల్లపిల్ల జమిందారులే వంశపారంపర్య ధర్మకర్తలుగా వుంటున్నారు.

💠 ఆలయ ప్రాంగణంలో శ్రీపార్వతీ, వీరభద్ర, భద్రకాళీ, సుబ్రహ్మణ్యేశ్వర, కాలభైరవ ఆలయాలు; నవగ్రహ మంటపం, యాగశాల, వాహనశాల, భోజనశాల,కల్యాణమంటపం ఉన్నాయి.
సింహ వాహనంపై ఉన్న పంచముఖగణ పతి ఈ ఆలయంలో ఉండటం మరొక విశేషం.

💠 అమ్మవారు దుర్గాదేవి .
అమ్మవారిని ‘’సిద్దేశ్వరి’’అంటారు .
కోరిన కోర్కెలు తీర్చే దుర్గా నాగేశ్వర స్వామి ఈ ప్రాంత జనుల అభీష్ట దైవం .

🔔 'సత్య స్తంభం':

💠 ప్రాచీనకాలంలో ఎవరైనా అవినీతికీ ... అన్యాయానికి పాల్పడితే, ఆరోపణలు ఎదుర్కున్న వ్యక్తి, తనపైపడిన నింద .. నిజం కాదని నిరూపించుకోవలసి వచ్చేది.
ఈ తతంగం పెద్దల సమక్షంలోను ... దైవ సన్నిధిలోను జరుగుతూ ఉండేది. అలా ఆనాటి దేవాలయాలో మొదలైన సత్య నిరూపణ ... నేటికీ కొన్నిక్షేత్రాల్లో కొనసాగుతూనే వుంది. అలాంటి క్షేత్రాల జాబితాలో పెదకళ్ళేపల్లి కూడా దర్శనమిస్తుంది.

💠పూర్వం ఇక్కడి స్వామి సన్నిధిలో ... అంటే ఆల య ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సత్యస్తంభం దగ్గర సత్యనిరూపణ జరుగుతూ ఉండేది. ఈ నేపథ్యంలో అమాయకుడు ... నిజాయితీపరుడైన ఒక వ్యక్తిని మరొక వ్యక్తి మోసం చేశాడట. చేసిన మోసాన్ని స్వామి సన్నిధిలో .. సత్యస్తంభం చెంత అతను అంగీకరించకుండా అసత్యమాడాడు. అంతే ... ఫెళ ఫెళ మంటూ ఆ సత్య స్తంభం విరిగి అతనిపై పడటంతో అక్కడే మరణించాడు.

ఆనాటి నుంచి ఇక్కడి స్వామివారి సన్నిధిలో ఎవరు ఎలాంటి పరిస్థితుల్లోను అసత్యమాడరని స్థానికులు చెబుతుంటారు. ఒకవేళ అసత్యమాడే సాహసం ఎవరైనా చేస్తే అందుకు తగిన ఫలితాన్ని వెంటనే పొందుతారని అంటారు. ఈ విషయాన్ని స్పష్టం చేయడానికేనన్నట్టుగా గతంలో విరిగిన ఆ స్తంభం ఇప్పటికీ ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది.
ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా దీనికి నమస్కరించుకునే స్వామి దర్శనానికి వెళుతూ ఉంటారు.

💠 మచిలీపట్నం నుండి అక్కడ నుంచి రోడ్డు మార్గాన 35 కి.మీ. ప్రయాణం చేస్తే ఈ ప్రదేశానికి చేరుతాం. ఇది చల్లపల్లికి 10 కి.మీ. దూరంలోనే ఉంది.

No comments: