Adsense

Saturday, April 1, 2023

సీతమ్మ అగ్నిప్రవేశం



హృదయవిదారకమైన ఘట్టమే. కానీ అందులో రాముని కానీ అందులో రాముని ధర్మానికి ఏ లోటూ లేదు. రాదు. రాముడు ఏనాడైనా సరే, ఏదైనా పనిచేసేసి, తరువాత, దానిని ధర్మమని సమర్థించుకోడు.

🌾 పూర్తిగా ‘ఇది ధర్మం’ అని సూక్ష్మంగా పరిశీలించి నిర్ధారించాకే ఆచరిస్తాడు. అందుకే ఆయన ధర్మవిగ్రహుడు. సీతను రాముడు శంకించలేదు. ధార్మికంగానే రాముని ప్రవర్తనను దర్శించవచ్చు.

🌾రావణవధానంతరం రామాజ్ఞపై అంతఃపుర స్త్రీలు అలంకరించి తెచ్చిన సీతమ్మను చూసిన రామునకు మహదానందం కలిగింది.

🌾 రాముడు సీతాపతి మాత్రమే కాదు. రాజ్యపాలన చేసే రాజు కూడా.

🌾 ఏ విషయాన్ని లోకం ఎలా గ్రహిస్తుందో ఊహించగలిగే జ్ఞానం కలవాడు. తన ధర్మం తనకి తెలిస్తే చాలదు. లోకానికి తెలియాలి. లోకం తప్పుగా గ్రహించకూడదు.

🌾రాజైన తాను, మహారాణి కూడా నిష్కళంక చరిత్రలు – అని ప్రజలకు ప్రత్యక్షంగా తెలియాలి. ‘రాజ్యపాలన వేరు, వ్యక్తిగత జీవితం వేరు’ అనే కాలం కాదది. నిష్కళంక చరిత్ర కలిగిన పాలకులే రాజులు. ‘ఆజన్మ శుద్ధానాం’ – జన్మించిన దగ్గర నుండి శుద్ధులు రఘువంశరాజులు అని కాళిదాసు అభివర్ణించాడు. అందుకు తగ్గట్లుగానే ప్రవర్తించాడు రాముడు.

🌾అతి సామాన్యమానవుడు కూడా, చివరకు రామాయణ ముఖమెరుగని దుశ్శీలుడు కూడా ‘రాముడిక్కడ అధర్మం చేశాడు’ అనగలిగినప్పుడు ఆ సందేహం సర్వ శాస్త్రవేత్త అయిన మహర్షి ఊహించలేడా? మరి ఆయన ఏవిధంగా అక్కడ విషయాన్ని వివరించాడో ఏకాగ్రంగా పరిశీలించాలి.

🌾సీతాదేవిని చూడగానే, రాముడు తన హర్షాన్ని లోపల దాచుకొని, గాంభీర్యం ప్రకటిస్తూ “నేత్రరోగికి దీపం వలె నీవు నాకు ప్రతికూలురాలివి.

🌾పౌరుష ధర్మానుసారం యుద్ధం చేసి, శత్రు సంహారం చేసి, నిన్ను విముక్తురాల్ని చేశాను. ఇంకనీ ఇష్టానుసారం వెళ్ళు. లక్ష్మణుడైనా, భరతుడైనా నీకిచ్చవచ్చినట్లుగా వెళ్ళు” అని అన్నాడు.
ఇందులో హృదయానికి శల్యాలై గ్రుచ్చుకునే తీవ్రత ఉంది.

🌾 అయితే రావణుడు అపహరించడానికి రాకముందు, మారీచవధకు రాముడు వెళ్ళిన సందర్భంలో లక్ష్మణుని శంకిస్తూ సీత మాట్లాడిన మాటలూ ఇంత తీవ్రమైనవే.

🌾ఆ తీవ్రత, అప్పుడు లక్ష్మణుడు పడ్డ బాధ సీతకు తెలియాలని కూడా రామ సంకల్పం.

🌾“నువ్వు, భరతుడు కలిసి మాయతో నన్ను పొందాలని చూస్తున్నారు. అందుకే రాముని ఆర్తనాదం విని కూడా నీవు కదలడం లేదు” అని ఆనాడు సీత అన్నమాట.

🌾లక్ష్మణుడెంత చెప్పినా వినకుండా, తొందర పడడం వల్ల ఇన్ని ఆపత్తులు ఎదుర్కొనవలసి వచ్చినందుకు కూడా, కొంత కోపం రావడం మానవ స్వభావం.

🌾ఇక్కడ మానవ స్వభావం, మానవ ధర్మం – ప్రధానంగా రాజధర్మం కలగలసి కనిపిస్తాయి.

🌾 అంతేకానీ సీతను అగ్నిలో ప్రవేశించమని రాముడు అనలేదు. అప్పుడు సీత తనంత తానుగా అగ్నిలో ప్రవేశించేందుకు ఉద్యుక్తురాలైంది.

🌾ఆ సమయంలో రాముడు –
దధ్యౌ ముహూర్తం ధర్మాత్మా బాష్పవ్యాకుల లోచనః

🌾రాముడు కూడా హృదయంలో సీతపట్ల ప్రేమ, విశ్వాసాలున్న వాడే.

🌾 కానీ ‘ధర్మాత్ముడు’ కనుక నీళ్ళు నిండిన కళ్ళతో ముఖాన్ని ప్రక్కకు తిప్పుకున్నాడు.

🌾ఆ ఘట్టం శ్రీరామునికి హృదయం విదారకంగా ఉంది.
ఆ సందర్భములో దేవతలంతా రాముని వద్దకు వచ్చారు.

🌾ఉపేక్షసే కథం సీతాం పతంతీం హవ్యవాహనే”
“లోకేశ్వరుడవు, జ్ఞానవేత్తవైన నీవు, అగ్నిలో పడుతున్న సీతను ఎందుకు ఉపేక్షించావు?” అని అడిగారు. “నేను మానవుణ్ణి, దశరథ పుత్రుణ్ణి” అని చెప్పాడు రాముడు.

🌾 అంటే తాను మానవ ధర్మానుసారం ప్రవర్తిస్తున్న వాడినని చెప్పడమే.

🌾ఆ కాలాన్ని ఇక్కడ ఆలోచించాలి.

🌾దేవతలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న గొప్ప మానవులు, ధర్మశీలురు ఉన్న కాలం అది.

🌾 అగ్ని, వాయువు, పృథ్వి మొదలైనవి ప్రాకృతిక పదార్థాలే కావు.

🌾 వాటి దేవతామూర్తులతో, ఉత్తమ మానవులకు ప్రత్యక్షంగా సంబంధాలు ఉండే త్రేతాయుగం అది.

🌾“శీతో భవ హనూమతః” – అని అగ్నిని ప్రార్థించి, తన మాటతో హనుమంతుని తోక మంటనే చల్లార్చ కలిగిన పాతివ్రత్యాగ్ని స్వరూపం సీతమ్మ.

🌾“నాగ్నిరగ్నౌప్రవర్తతే” – అగ్నిని అగ్ని ఏమీ చేయలేదు అని హనుమంతుడే, సీతమ్మను అగ్నిగా గుర్తించాడు. ఆమెను అగ్ని ఏమీ చేయలేదు అని ప్రత్యక్షంగా చూశాడు.

🌾 మరి సీతాపతికి ఆ విషయం తెలియదా! బాణాగ్రంతో మహా సముద్రాన్ని శాసించిన శ్రీరామునికి, అగ్నిలో సీత ప్రవేశించడం – అంటే ఆమె మరణించడం కాదని తెలుసు.

🌾సీత క్షేమంగా ఉంటుందనీ తెలుసు.
కానీ ఆమె శక్తి లోకానికి తెలియాలి.

🌾అందుచేతే, ప్రజలను దూరంగా తప్పుకోమని విభీషణుడు చెప్పినా, అందరూ అక్కడే  ఉండాలని రాముడు ఆజ్ఞాపించాడు.

🌾ఈ ఘట్టంలో వాల్మీకి పదేపదే “రామో ధర్మభ్రుతాంవరః”, “ధర్మాత్మా” వంటి శబ్దాలతో రాముని దార్మికతని చాటాడు.

🌾అగ్నిదేవుడు సీతను భద్రంగా తీసుకువచ్చి రామునకు అప్పగించి, ఆమె సుశీల అని అందరూ వినేటట్లుగా తన ‘అగ్నిసాక్షి’త్వాన్ని ప్రకటించాక
“ధర్మాత్మా హర్షవ్యాకులలోచనః” – ఆనందాతిరేకంతో ధర్మాత్ముడైన రాముడు ఇలా అన్నాడు.

No comments: