శ్రీవరాహమూర్తి, వరాహావతారము, వరాహస్వామి - ఇవన్నీ శ్రీమహావిష్ణువు మూడవ అవతారమును వర్ణించే నామములు...
మన పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొరకు, దుష్టశిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు.
వాటిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు.
ఈ దశావతారాలలో మూడవ అవతారము వరాహావతారము.
మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీవరాహమూర్తి అని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు.
వరాహావతారం హిరణాక్షుడిని చంపి, భూమిని ఉద్ధరించి, వేదములను కాపాడిన అవతారము.
స్వామి ప్రార్ధనలలో ఒకటి, ఆది వరాహమూర్తి, యజ్ఞవరాహమూర్తి, మహా సూకరం అని నామాలు కూడా ఉన్నాయి.
తిరుమల కొండలపై మొదట వెలసిన స్వామి వీరే, వీరి అనుమతితోనే వేంకటేశ్వరుడు అక్కడ నివాసము ఏర్పాటుచేసుకున్నారు.
రాక్షసునితో భయంకరంగా యుద్దం చేసి, చక్రాయుధంతో వానిని సంహరించి, భూమాతని జలముపై నిలిపిన స్వామి, వేదాలను రాక్షసుల బారినుండి రక్షించిన స్వామి.
*కథ :*
అనంత భగవానుడు ప్రళయకాలమందు జలమున మునిగిపోయిన పృధ్విని ఉద్ధరించుటకు వరాహ రూపము ధరించాడు.
ఒక రోజు స్వాయంభువ మనువు వినయముగ చేతులు జోడించి తన తండ్రి అయిన బ్రహ్మ దేవునితో ఇలా అన్నాడు .... "తండ్రీ! మీరు సమస్త జీవులకు జన్మదాతలు, జీవము నొసగువారు, మీకు నా నమస్కారములు.
నేను మిమ్మల్ని ఏవిధంగా సేవింపవలెనో ఆజ్ఞ ఇవ్వండి.'' మనువు మాటలు విన్న బ్రహ్మ, "పుత్రా! నీకు శుభమగుగాక. నిన్నుచూసి నేను ప్రసన్నుడనయ్యాను, నీవు నా ఆజ్ఞను కోరావు.
ఆత్మ సమర్పణము చేశావు. పుత్రులు తమ తండ్రిని ఈ విధంగానే పూజించాలి.
వారు తమ తండ్రి ఆజ్ఞను ఆదరముతో పాలించాలి. నీవు ధర్మ పూర్వకముగ పృధ్విని పాలించు, యజ్ఞములతో శ్రీ హరిని ఆరాధించు... ప్రజలను పాలించుటయే నన్ను సేవించినట్ల" అని చెప్పగా మనువు ఇలా అన్నాడు .... "పూజ్యపాదా! మీ ఆజ్ఞను అవశ్యము పాటిస్తాను.
అయినా సర్వజీవులకు నివాసస్ధానము అయిన భూమి ప్రళయ జలమందు మునిగియున్నది.
కావున నేనెట్లు భూమిని పాలింపగలను" అని అడిగాడు!
బ్రహ్మ, పృధ్విని గురించి చింతింస్తూ, దానిని ఉద్ధరించుటకు ఆలోచించసాగాడు.
అప్పుడు అకస్మాత్తుగా ముక్కునుండి బొటనవ్రేలు అకారమంత ఒక వరాహ శిశువు ఉద్భవించాడు. చూస్తుండగానే అది పర్వతాకారము దాల్చి గర్జించసాగెను.
బ్రహ్మదేవుడు భగవానుని ఘరఘరలు విని వానిని స్తుతించసాగెను.
బ్రహ్మ స్తుతించుచుండ వరహ భగవానుడు ప్రసన్నుడయ్యెను,
వరాహ భగవానుడు జగత్కళ్యాణము కొరకు జలమందు ప్రవేశించెను.
జలమందు మునిగియున్న పృధ్విని తన కోరలపై తీసికొని రసాతలము నుండి పైకి వచ్చుచుండగా పరాక్రమవంతుడైన హిరణ్యాక్షుడు జలమందే గదతో వరహ భగవానునితో తలపడెను.
సింహము, ఏనుగును వధించినట్లు వరాహ భగవానుడు క్రోధముతో హిరణ్యాక్షుని వధించెను.
జలము నుండి వెలుపలకు వచ్చుచున్న భగవానుని బ్రహ్మది దేవతలుగాంచి, చేతులు జోడించి స్తుతించసాగిరి, ప్రసన్నుడైన వరాహ భగవానుడు తన గిట్టలతో జలమును అడ్డ్గగించి దానిపై పృధ్విని స్ధాపించెను..పని పూర్తయిన తర్వాత వరాహస్వామి భూమిమీద సంచరించిన ప్రదేశమే నేటి తిరుమలకొండ.
తిరిమల క్షేత్రం మొదట వరాహ క్షేత్రం గా ప్రసిద్ధి పొందినది.
అయితే తిరుమలకొండ పై ఉండేందుకు వేంకటేశ్వరస్వామికి అనుమతి నిచ్చినది వరాహస్వామే, వరాహస్వామిని మూడు రూపాలలో కొలుస్తారు భక్తులు.
ఆదివరాహస్వామిగా, ప్రళయవరాహస్వామిగా, యజ్ఞ వరాహస్వామిగా, ఈ మూడు రూపాలలో తిరుమలలో ఉన్నది ఆదివరాహస్వరూపము.
వరాహస్వామి భూమిమీద సంచరించేటప్పుడు వృషభాసుడనే రాక్షసుడు తటస్థపడేసరికి వాడ్ని చంపి ఆ కోపంతో తిరిగేటప్పుడు అక్కడికి శ్రీనివాసుడు వస్తాడు.
శ్రీనివాసుడే ... శ్రీ మహావిష్ణువని గ్రహిస్తాడు ఆదివరాహస్వామి. వరాహస్వామి రూపములో ఉన్నది శ్రీ మహావిష్ణువే అని శ్రీనివాసుడు తెలుసుకుంటాడు. మహావిష్ణువే రెండు రూపాలను ధరించి ముచ్చటించుకుంటుంటే ... ముక్కోటి దేవతలు మురిసిపోయారట .
నాకు ఈ ప్రదేశం లో కలియుగాంతము వరకు నివసించాలన్న సంకల్పము కలిగింది.
ఇక్కడ నాకు కొంత స్థలము ప్రసాదించమని శ్రీనివాసుడు కోరగా ... అప్పుడు ఆయన (వరాహస్వామి) మూల్యము చెల్లిస్తే స్థలమిస్తానని అంటారు.
అప్పుడు శ్రీనివాసుడు "నా దగ్గర ధనం లేదు, అందుకు ప్రతిగా మీరిచ్చే స్థలానికి దర్శనానికి వచ్చే భక్తుల ప్రథమ దర్శనము, ప్రథమ నైవేద్యము మీకు జరిగేటట్లు చేస్తానని" చెబుతాడు.
అందుకు ఆదివరాహస్వామి అంగీకరిస్తారు.
శ్రీనివాసుడికి 100 అడుగులు స్థలాన్ని ఇచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి.
శ్రీ మహావిష్ణువు ఆదివరాహస్వామిగా అవతరించి, శ్రీనివాసునికి స్థలాన్నిచ్చి నేటి భక్తులు కొలుస్తున్న తిరుమల కొండ క్షేత్రానికి మూలమైనాడు.
రెండు అవతాలతో, రెండు మూర్తులతో భక్తుల కోరికల్ని తీరుస్తున్న శ్రీ మహావిష్ణువు అవతార రహస్యాలలో ఈ రెండు అవతారాలకు ఎంతో ప్రాముఖ్యము ఉన్నది.
*_🌷శుభమస్తు🌷_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
No comments:
Post a Comment