Adsense

Friday, April 21, 2023

బంగారానికీ అక్షయ తృతీయకీ సంబంధం ఏమిటి ?

 బంగారానికీ అక్షయ తృతీయకీ సంబంధం ఏమిటి ?..


🌿మన సంస్కృతిలో ప్రతి పండుగ వెనుకా ఓ కారణం కనిపిస్తుంది. కాకపోతే ఒక్కోసారి ఆ కారణాన్ని మర్చిపోయి , ఆచరణకే ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాము.

🌸అందుకు ఉదాహరణే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజున బంగారం కొనితీరాల్సిందే అన్న స్థాయిలో ఇప్పుడు ఆలోచిస్తున్నారు.

🌹నిజంగా అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిందేనా ! అసలు బంగారానికీ అక్షయ తృతీయకీ సంబంధం ఏమిటి ?🌹

🌿అక్షయ తృతీయ రోజున బంగారం కొనితీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు. కాకపోతే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని , ఏ పుణ్య కర్మని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి.

🌸 అందుకనే అక్షయ తృతీయ రోజున తప్పకుండా దానధర్మాలు చేయాలని చెబుతారు. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉదకుంభదానం పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు.

🌿అక్షయ తృతీయనాడు విష్ణుమూర్తిని పూజించాలని మత్స్య పురాణం పేర్కొంటోంది. విష్ణుమూర్తి పాదాలను అక్షతలతో అర్చించి , ఆ అక్షతలను దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెబుతోంది.

🌸 జపం , హోమం , వ్రతం , పుణ్యం , దానం... ఇలా అక్షయ తృతీయ నాడు చేసే ప్రతి పనీ అనంతమైన ఫలితాన్నిస్తుందని మాత్రమే మతగ్రంథాలు పేర్కొంటున్నాయి.

🌿 అక్షయ తృతీయనాడు వివాహం చేసుకుంటే ఆ బంధం చిరకాలం  నిలుస్తుందనీ , జాతకరీత్యా వివాహబంధంలో ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయని నమ్ముతారు.

🌸అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా అక్షయమైన ఫలితం దక్కుతుంది కాబట్టి , ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే... మన సంపదలు కూడా అక్షయం అవుతాయన్న నమ్మకం మొదలైంది.

🌿అయితే కష్టపడో , అప్పుచేసో , తప్పు చేసో సంపదను కొనుగోలు చేస్తే మన కష్టాలు , అప్పులు , పాపాలు కూడా అక్షయంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పెద్దలు.

🌹అక్షయ తృతీయ రోజున వర్జ్యం , రాహుకాలంతో పనిలేదు
🌹

🌹🙏'వైశాఖ శుక్ల పక్షోతు తృతీయ రోసిణి యుతా
దుర్లభా బుధచారేణ సోమనాపి ఉతా తథా
''🙏🌹

🌸మత్స్య పురాణంలో 65వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు.

🌿వైశాఖ శుద్ధ తదియ రోజున చేసే ఏ వ్రతమైనా , జపమైనా , దానాలు ఏవైనా సరే అక్షయమౌతుంది.

🌸పుణ్యకార్యాచరణతోవచ్చే ఫలితం అక్షయమైనట్లే , పాపకార్యాచరణతో వచ్చే పాపం అక్షయమే అవుతుంది. అక్షయ తృతీయ రోజున ఉపవాస దీక్ష చేసి ఏ పుణ్య కర్మనాచరించినా అక్షయముగా ఫలము లభిస్తుంది.

🌿 అక్షయుడైన విష్ణువును పూజిస్తున్నందునే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది. ఈ రోజున ఏ శుభకార్యాన్నైనా వారం , వర్జ్యం , రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పండితులు చెప్తున్నారు.

🌸ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం , పుస్తకావిష్కరణ , పుణ్యస్థలాలను సందర్శించడం మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు అంటున్నారు.

🌿ఇంకా గృహ నిర్మాణం , ఇంటిస్థలం కొనడం , బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం.

🌸అలాగే అక్షయ తృతీయనాడు
శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి.

🌿అందుకే ఈ పర్వదినాన పుష్పమో , ఫలమో భగవంతుడికి సమర్పించినా , దైవనామస్మరణ చేసినా , చివరికి నమస్కారం చేసినా సంపద , పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి...స్వస్తి..

No comments: