తులసీ మాహాత్మ్యము
ఏ మానవులు యథావిధిగా తులసిని నాటి పూజించెదరో, గుణకీర్తనము గావించెదరో వారికి సిద్ది లాభము కలుగును, అర్ఘ్య మిచ్చి నమస్కరించి, తులసీదళమును శిరసున ధరించెదరో వారికి ముక్తి కరతలమున నుండును.
నదీతీరమున, శ్మశానమున, చవిటి నేలయందు, మ్లేచ్ఛ సన్నిధిని తులసి చెట్లను వేసిన కర్త యమలోకమునకు పోవును. ఈ స్థలములందు తులసిని నాటరాదు. గృహమున ఈశాన్యమూలను నాటుట కర్తవ్యము.
తులసి మూలమందలి మృత్తికను శిరస్సున ధరించువాఁడు కేవలము తమోనాశమునకయి సూర్యుని రూపమును ధరించి యుండును. గంగ మృత్తికగాని, చందనముగాని లేదా తులసి మొదటినందలి మృత్తిక గాని చేర్చి తులసీపత్రమును శిరస్సున ధరించు వ్యక్తి తీర్థస్వరూపము.
తులసితోట యున్న తావున యముని పెత్తనము లేదు. ఆ స్థలమున ప్రాణము పోయినవానికి మరల దేహము ధరింపవలసిన పనిలేదు. బాగుగ అలంకారము చేసి, ఎత్తైన స్థలమున తులసిని నుంచినవానికి అక్షయమగు స్వర్గవాసము లభించును. ఇందుకు సందేహము లేదు. శ్రాద్ధము, దానము, తపస్సు, హోమము, సంధ్య, ఉపాసన, పూజ, పురాణపాఠము తులసీ సన్నిధిలో చేయవలెను.
No comments:
Post a Comment