Adsense

Saturday, April 22, 2023

పశ్చిమ గోదావరి జిల్లా : రాట్నాలకుంట

 పశ్చిమ గోదావరి జిల్లా : రాట్నాలకుంట

⚜ శ్రీ రాట్నాలమ్మ ఆలయం

💠 కోస్తా జిల్లాల కల్పవల్లిగా వేంగి చాళుక్యుల చక్రవర్తుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న అనంత కరుణామయి రాట్నాలమ్మ.
జిల్లాలో ప్రసిద్ధిగాంచి కోట్లాది భక్తుల నీరాజనాలు అందుకుంటున్న కల్పవల్లి శ్రీ రాట్నాలమ్మ అమ్మవారు.

💠 పశ్చిమగోదావరి జిల్లాలోని తీర ప్రాంతాన్ని ఎందరో మహారాజులు, చక్రవర్తులు పాలించినారు. వారిలో తూర్పు చాళుక్యులు ముఖ్యులు. వీరినే వేంగిలని, రెడ్డి రాజులని, ఆర్యులని పిలిచేవారు. ఈ తూర్పు చాళుక్యుల కాలంలోనే శ్రీ రాట్నాలమ్మ ఆవిర్భావం జరిగిందని నానుడి.

⚜ స్థల పురాణం ⚜

💠 అప్పటి వేంగి రాజుల ఖాజానాలు విశేషమైన రత్న సంపదలతో మణి మాణిక్యాలతో వజ్ర వైఢూర్యాలతో తులతూగేవి. ఈ సంపద కాపాడుట మానవుల వల్ల కానందున ఒక మహాశక్తిని వేంగిరాజులు ఆశ్రయించినారు. ఆ శక్తిని వారు ఇలవేల్పుగా కొలిచి ఆధిపత్యమిచ్చినారు. ఆ శక్తిమాత శ్రీ రాట్నాలమ్మ అమ్మవారు.

💠 కలి ప్రభావంగా దేశాలలోని ఖజానాలు కొల్లగొట్టబడుతూ వుండేవి. కాని వేంగి దేశ ఖజానా నిత్య కళ్యాణం, పచ్చతోరణం అనే చందంగా సిరిసంపదలతో తులతూగుతూ వున్నది. ఇది చూసి కొందరు దొంగలకు కన్నుకుట్టినది. కాని వారి ఆశ అడిఆశే అయింది. దానికి కారణము, శక్తి రూపిణి, శ్రీ రాట్నాలమ్మ అమ్మవారు .
చోరులు ఎలా అయినా సరే ఈ సంపదను హస్తగతం చేసుకోవాలని పట్టుదలతో ఒక మాంత్రికుని ఆశ్రయించినారు.

💠 మొత్తం వృత్తాంతమంతా చెప్పి అక్కడ వున్న రత్న సంపద దైవనుగ్రహ ప్రసాదమని అది ఉంటే నీవు ఇంకా శక్తులు వశం చేసుకోవచ్చని ఆ మాంత్రికుణ్ని తీసుకువచ్చారు.
గ్రహణ సమయంలో దేవతలు ఆశక్తులు అవుతారని గ్రహించిన ఆ మాంత్రికుడు ఒక చంద్ర గ్రహణం రోజున హోమం చేసి ఆ హోమం లోనుంచి ఒక మంత్ర ఖడ్గాన్ని సృష్టించారు.
ఆ రోజు మంత్ర ఖడ్గంతో నేరుగా అమ్మవారి పైన ప్రయోగం చేశారు.

💠 ఆ మంత్ర ఖడ్గం అమ్మవారి కంఠాన్ని, వక్షస్థలాన్ని, చేతిని, కాలును తాకింది. ఎప్పుడైతే ఆ మంత్ర ఖడ్గం అమ్మవారిని తాకిందో ఆ సమయంలో అమ్మవారి కంఠంలో నుంచి రక్తం నేలమీద పడి ఆ రక్తం పడిన చోటునుంచి పెద్ద అగ్ని పుట్టుకొచ్చింది.
ఆ అగ్నిలో అక్కడ ఉన్న మాంత్రికుడు మరియు దొంగలు దాహణం అయ్యారు. అమ్మవారి కోపానికి వేంగి రాజ్యం మొత్తం కూడా తగలబడి పోయింది. అందుకే నేటికి ఆలయం నుండి కోట వరకు గొప్ప కీకారణ్యంగా వున్నా నేడు ఒక వృక్షము కూడా కానరాదు.

💠 ఈ పరిణామానికి కారణం తెలియని వేంగి చక్రవర్తి అస్థాన జ్యోతిష్యులను రాజపురోహితులను సమావేశపరిచి విషయం విన్నవించెను.
ఆ మహాపండితులు జరిగిన విషయం గ్రహించి మహారాజా మీ ఇంట ఇలవేల్పు, మన సామ్రాజ్యధి దేవతను ఎవరో దుష్టులు కట్టడి చేయుటకు ప్రయత్నించి విఫలమైనవారు. అందుకే ఆ శక్తికి ఆగ్రహం కలిగి వారిని తన కోపాగ్నితో భస్మము చేసింది. అని ఆ మాతను శాంతింప చేయుట మన తక్షణ కర్తవ్యమని, అలా చేయని ఎడల సామ్రాజ్యానికే ముప్పు అని హితవు పలికారు.

💠 వెంటనే మహారాజు  విశేష రత్నాలతో అర్చనలు చేశాడు. ఈ అర్చనలకు పూజలకు శాంతించిన మాత సంతుష్టురాలై మహారాజుకి అభయమిచ్చి వరము కోరుకోమన్నది. అప్పుడు మహారాజు భక్తితో నమస్కరించి అమ్మా నీ చల్లని పాదాల నీడలో నా రాజ్యము, ప్రజల సుఖసంతోషాలతో తూలతూగాలి. నీ దర్శన భాగ్యము మాకు ఎల్లప్పుడు కలగాలి. నీ పాద సేవ భాగ్యము మాకు కల్పించమని పరివిధాల ప్రార్థించాడు. '
అందుకు అమ్మవారు ప్రసన్న హృదయముతో ఓ మహారాజ రత్నాలు అర్పించి నన్ను శాంతింప చేశావు. కాబట్టి నేను నా పరివార దేవతలతో ఈ వేంగిపుర ప్రాంతంలో రత్నాలమ్మగా పూజలందుకుంటాను అని చెప్పింది.

💠 ఒక చేతి ఖడ్గముతో మరొక చేతితో అమృత కలశములతో, పులి వాహనముతో ఈ ప్రాంతంలో వెలిసింది. అలాగే బ్రహ్మ, ఈశ్వరుడు, విష్ణువు, కాలభైరవుడు, కుమారస్వామి, చతుర్భుజ దుర్గాదేవి, షడ్భుజ దుర్గాదేవి వీరులు సుబ్రహ్మణ్యస్వామి, సప్త మాత్రృకలు వైదేహీ సూర్య ఉషాదేవి మొదలగు పరివార దేవతలతో ఇక్కడ కొలువైంది.
నాటి రత్నాలమ్మే కాలగర్భంలో నేటి రాట్నాలమ్మగా ప్రసిద్ది చెందింది.

💠 ప్రతి ఏటా అమ్మవారికి చైత్రశుద్ధ పౌర్ణమి నుండి ఏడు రోజుల పాటు శ్రీ రాట్నాలమ్మ అమ్మవార్ని తిరునాళ్లు ఉత్సవాలు మహావైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల సమయంలో రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు విచ్చేయటం విశేషం.

💠 భక్తులు తమ బిడ్డలకు అమ్మవారి సన్నిధిలో అన్నప్రాసనం, అక్షరాభ్యాసాలు చేయిస్తుంటారు. పాలుపొంగలి వండి నైవేద్యం పెట్టి మొక్కుబడి తీర్చుకుని తలనీలాలు ఇవ్వడం ఆచారం. రైతులు తమ పొలంలో పండిన పంటను కొంత భాగం అమ్మవారికి సమర్పించిన తర్వాతే ఇంటికి తీసుకువెళ్లడం ఈ ప్రాంతంలో ఆనవాయితీగా వస్తోంది.

💠 ఇక్కడ జరిగే తిరునాళ్లలో భాగంగా తొలిరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా, రెండోరోజు మహాలక్ష్మిగా, మూడోరోజు సరస్వతి, నాలుగోరోజు దుర్గాదేవిగా, ఆఖరు రోజున ఫల అలంకరణలో దర్శనమిస్తుంది. ప్రత్యేక పూజలతో పాటుగా పుష్పయాగం, తెపోత్సవం వంటి విశేషాలు చోటు చేసుకుంటాయి. ఆఖరురోజున పెద్ద ఎత్తున అన్నసమారాధన నిర్వహిస్తారు.

💠 ఏలూరు నుండి 15 కి.మీ.

No comments: