“ కరవీర సుమాభూషా చక్షురానందమూర్తయే !
కొడవటంచ నివాసాయ
శ్రీ నృసింహాయ మంగళమ్ !!”
💠 శ్రీ స్వామి వారు యోగముద్ర లో నుండగా వామాంకముపై నిత్యానపాయిని యైన లక్ష్మీదేవి వెలసియుండుట ఈ క్షేత్ర విశిష్టత గా చెప్పబడుతోంది.
🔅 స్థల పురాణం 🔅
💠 హిరణ్యకశ్యపుని వథానంతరం ఉగ్రరూపుడైన శ్రీ నృసింహుని శాంతపరచ డానికి కాదు గదా ఆయనను సమీపించడానికి కూడ ఎవ్వరు సాహసించలేక పోయారు.
ఆ సమయంలో ఆయన వక్షస్థలంపై నిత్యం విలసిల్లే శ్రీ లక్ష్మీదేవి కూడ స్వామివారి ఉగ్ర రూపాన్ని చూచి, కొంచెం జంకి దూరంగానే నిలబడిపోయిందట.
💠 అప్పుడు సనకసనందనాది మహర్షులు,దేవతాగణము కలిసి పరమ భక్తాగ్రగణ్యుడైన ప్రహ్లాదకుమారుని వేడుకొనగా, ప్రహ్లాదుడు శ్రీ స్వామి చెంతకు వెళ్లి వివిథస్తోత్రాలతో ఆయనను శాంతపరచాడు.
శాంత స్వరూపుడై, యోగముద్రలో నున్న శ్రీ స్వామి వారి వామాంకమున కలుముల జవరాలు శ్రీ లక్ష్మీదేవి ఆసీనురాలైంది.
💠 మాంథాత కాలం నాటికే ఈ క్షేత్రము ఉన్నదనడానికి నిదర్శనంగా ఈ ఆలయానికి కొంచెం దూరములో మాంథాత బండ అని పిలువబడే ఒక శిల నేటికి కన్పిస్తుంది.
💠పూర్వం ఈ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తల వంశీకుడైన శ్రీమాన్ తూపురాణి రంగాచార్యులు గారు ఒక రోజు ఇప్పుడు ఆలయ ప్రాంగణము నందు గల బావిలో నుండి నీరు తోడుచుండగా చేద (దీనినే కొన్ని ప్రాంతాల్లో బక్కెట అంటారు) లో అంగుష్ట ప్రమాణంలో ఉన్న శ్రీ స్వామి వారి ప్రతిమ ఒకటి వచ్చింది.
💠 ఒకరోజు శ్రీ రంగాచార్యుల వారికి
శ్రీ నృసింహస్వామి స్వప్నము నందు సాక్షాత్కరించి చిన్న ప్రతిమ లభించిన బావికి సమీపంలో తాను అర్చారూపంగా వెలసినట్లు చెప్పి ,తన అర్చారూపము గల ప్రదేశమునకు ఆనవాలు గా ఇటుక ఆకారమున్న శిలపై శ్రీ ఆంజనేయుని విగ్రహము కన్పించగలదని చెప్పారట. ఆ ప్రదేశమున వెతగ్గా శ్రీ ఆంజనేయ విగ్రహము, దాని సమీపంలో ఒక మట్టి దిబ్బ కనిపించాయి. అప్పుడు ఆచార్యుల వారు తన చేతిలో నున్న కొడవలి తో ఆ మట్టి దిబ్బ ను పెళ్ళగించగా, శ్రీ స్వామివారి విగ్రహం వెలుగు చూసింది. కొడవలి వంచిన శ్రీ స్వామివారి పేర ఈ క్షేత్రం కొడవటి వంచ అయి, క్రమంగా ప్రజల వాడుకలో కొడవటంచగా పిలువబడుతోంది.
ప్రస్తుతం పరిసర గ్రామాల ప్రజలు దీన్ని కొడంచ అనే పిలుస్తున్నారు.
💠 ఆనాడు బావి చేదలో దొరికిన చిన్న ప్రతిమ ఈనాటికి సాలగ్రామాల మథ్య ఆలయం లో పూజించబడుతోంది. ఆనాడు స్వామి విగ్రహము వెలసిన ప్రదేశమందే ఆలయ నిర్మాణం జరిగి,దిన దిన ప్రవర్థమానమౌతోంది.
💠 ఆలయ ముఖమండపంలో ఉత్తరాభిముఖుడుగా ఉన్న ఆంజనేయుడు భక్తుల మొఱలను స్వామికి నివేదిస్తున్నట్లు స్వామి వైపుకు ముకుళిత హస్తుడై దర్శనమిస్తాడు.
అంతరాలయానికి రెండు వైపులా జయవిజయులు కొలువుతీరి ఉన్నారు.
శ్రీ స్వామి వారికి ఎదురుగా ముఖమండపంలో గరుడాళ్వరు వేంచేసియున్నాడు.
గర్భాలయంలో శ్రీ నృసింహుడు వామాంకస్థిత లక్ష్మీ యుతుడై దర్శనమిస్తున్నారు. వారి చుట్టు ఆళ్వారులు పరివేష్టించి ఉన్నారు.
💠 ఈ క్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారిని మానసికరోగములను నివారించే పరమాద్భుతమూర్తిగా భక్తులు విశ్వసిస్తారు. తీవ్రమైన మానసిక వ్యాధులతో బాధపడుతూ,గొలుసులతో బంధింపబడి,ఈ క్షేత్త్రానికి తీసుకురాబడిన వ్యాధిగ్రస్తులు అనేకమంది ప్రతిరోజు ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా శ్రీ స్వామి వారికి ప్రదక్షిణలు శ్రీ స్వామి తీర్థాన్ని సేవించి, సాంబ్రాణి పొగ వేసుకుంటూ మండలం రోజులు సేవిస్తే వారు ఆరోగ్యవంతులైన నిదర్శనాలు కొల్లలుగా ఉన్నాయట. దారిద్య్ర,ఋణబాధలు స్వామివారి దర్శన మాత్రముననే దూరమౌతాయని భక్తుల దృఢవిశ్వాసం.
💠 ఈ ఆలయంలో పాంచరాత్రాగమ సంప్రదాయానుసారముగా పూజలు నిర్వహించ బడుతున్నాయి.
ప్రతి సంవత్సరం వృషభ సంక్రమణ మాసంలో శ్రీ నృసింహుని జయంత్యుత్సవాలు,ఫాల్గుణ మాసంలో పాంచాహ్నిక దీక్ష తో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఫాల్గుణ పౌర్ణమి రోజున శ్రీ స్వామి వారి శకటోత్సవం జరుగుతుంది.
ఆ రోజున ఆలయం చుట్టు వివిధ రకాల ప్రభలతో అలంకరించిన బోనాలు, ఎడ్లబండ్లు తిరగటం విశేష ఆకర్షణ. ఈ సందర్భంగా దాదాపు రెండు లక్షలమంది యాత్రికులు శ్రీస్వామి వారిని దర్శించుకుంటారు.
💠 ఉగాది, శ్రీరామనవమి, తొలిఏకాదశి,ఆండాళ్ తిరునక్షత్రం, శ్రీకృష్ణ జన్మాష్టమి,దసరా, దీపావళి, కార్తీకపౌర్ణమి, ధనుర్మాసము లో అధ్యయనోత్సవం, మొదలైన పర్వదినాల సందర్భంగా విశేషపూజలు,సేవలు జరుగుతాయి.
💠 తెలంగాణ రాష్ట్రంలో అతి వైభవంగా జరిగే జాతరలో కొడవటంచ లోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి జాతర ఒకటి.
💠ఎక్కడా లేని విధంగా త్రికాల ఆరగింపు కేవలం కొడవటంచలో నిర్వహించడం ప్రత్యేకత. సమానత్వానికి సూచికగా భక్తులను కోర్చోబెట్టి స్వామివారి ప్రసాదాన్ని అందిస్తారు.
💠 సంతానం లేనివారు 40 రోజలపాటు ఉదయం సాయంత్ర స్వామి వారిని దర్శించుకొని సాంబ్రాని పొగ వేసుకోవడం వల్ల సంతనవంతులవుతారని భక్తులు విశ్వసిస్తారు.
💠 రేగొండకి 9కి.మీ. దూరం
No comments:
Post a Comment