Adsense

Saturday, April 29, 2023

శ్రీ నత్తా రామేశ్వర దేవాలయం, పెనుమంట్ర, పశ్చిమ గోదావరి.

 శ్రీ నత్తా రామేశ్వర దేవాలయం, పెనుమంట్ర, పశ్చిమ గోదావరి.

💠 శ్రీమన్నారాయణుడు ధరించిన దశావతారాలలో 'రామావతారం, 'పరశురామావతారం' ఎంతో విశిష్టమైనవి.
ఈ రెండు అవతారాలలో శ్రీమహా విష్ణువు ఒకే ప్రదేశంలో రెండు శివలింగాలను ప్రతిష్ఠించడం ఒక విశేషం. అలాంటి గొప్పదనాన్ని పొందిన క్షేత్రం 'నత్తా రామేశ్వరం'.
ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుమంట్ర మండలంలో ఉంది

💠 నత్తా రామేశ్వరం' పేరు వినగానే విచిత్రంగా అనిపిస్తుంది. నత్త పేరు ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో తెలుసుకోవాలని అనిపిస్తుంది. సీతా సమేతంగా ఇక్కడికి వచ్చిన శ్రీ రామచంద్రుడు, 'నత్త గుల్లలు' కలిసిన ఇసుకతో శివలింగ ప్రతిష్ఠ చేయడం వలన ఈ ఊరుకి 'నత్తా రామేశ్వరం' అనే పేరు వచ్చిందని ఒక కధనం

💠 ఈ ఆలయ విశిష్టత మార్కండేయ పురాణంలోను, వాయు పురాణాల్లోను వున్నది.

⚜ స్థల పురాణం ⚜

💠శ్రీరాముడు రావణుడిని చంపి బ్రాహ్మణ హత్య చేసాననే దిగులుతో పాప పరిహార నిమిత్తం ఎన్నోచోట్ల శివలింగాలకి ప్రాణ ప్రతిష్ట చేసాడు.
శ్రీరాముడు సీతాదేవి కలిసి గోస్తనీ నదితీరం దగ్గరికి చేరుకోగానే అక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాలని అనుకొన్నాడు. దానికి మద్యాన్న సమయంలో గోస్తనీ నదిలో త్రికోటి తీర్ధములు వచ్చి చేరుతాయని తలచి హనుమంతుని వారణాసికి పంపి శీవ లింగమును తెమ్మని చెప్పేను. అయితే హనుమ వచ్చు సమయం మద్యాన్నం దాటుతుండుట వలన అక్కడే నదిలో నుండి నత్తలతో కూడిన ఇసుకమట్టిని తీసుకొని సీతాసమేతంగా ఒక శివలింగాన్ని తయారుచేసి ప్రతిష్ట చేసాడు.
అలా నత్తలు, ఇసుకతో శివలింగాన్ని తయారుచేసిన కారణంగా నత్తా రామేశ్వర అనే పేరు వచ్చింది.

💠 ఇక ఇదే ప్రదేశంలో పశ్చిమాభి ముఖంగా మరో శివలింగం కొలువుదీరి కనిపిస్తుంది. దీనిని పరశురాముడు ప్రతిష్ఠించినట్టు పురాణాలు చెబుతున్నాయి.
పూర్వం పరశురాముడు గోస్తనీ నదీ తీరమున 9 వేల సంవ‌త్స‌రాలు ఏకాగ్ర‌ చిత్తముతో త‌ప‌మాచ‌రించారు.

💠 అయితే ఎంతో మంది క్షత్రియులను సంహరించిన పరశురాముడు హత్యల వలన ఏర్పడిన దోషాలను పోగొట్టుకోవడానికి కైలాసం వెళ్లి శివుడి ఆజ్ఞతో పర్వతం నుండి ఒక శివలింగాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టించాడట. అయితే పరశురాముడి కోపాగ్ని వలన ఆ లింగం అగ్ని లింగం లాగ కనపడేసరికి తన అహంకారం ఇంకా తగ్గలేదా అని బాధపడి ఆ శివలింగం చుట్టూ ఒక చెరువుని తవ్వి  గోస్తనీ నది నీటితో నింపివేసాడట. ఆ తరువాత స్వామి నీవు చల్లబడిన తరువాత నీకు పూజలు ఎలా అని బాధపడుతుంటే, అప్పుడు శివుడు పరశురామ నేను 11 నెలలు నీటిలోనే ఉండి ఒక్క ఫాల్గుణ మాసంలో అందరికి కనిపిస్తాను అని మాట ఇచ్చాడని పురాణం.

💠 అయితే పరశురాముడు ఈ శివలింగాన్ని ఏడూ కోట్ల మంది సమక్షంలో ప్రతిష్టించాడట అందుకే ఈ శివలింగాన్ని సప్త కోటీశ్వర లింగం అని కూడా అంటారు.

💠 ఈ ఆలయం ఏడాది పొడవునా నీళ్లలో మునిగే వుంటుంది. అందువలన ఒక్క వైశాఖ మాసంలో మాత్రం గర్భగుడిలోని నీరు తోడి ఆ మాసమంతా పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు.

💠 నత్తా రామలింగేశ్వరుడిని పూజించడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయనీ, సప్త కోటీశ్వర లింగాన్ని దర్శించడం వలన సిరిసంపదలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు.
ప్రతి యేటా ఇక్కడ జరిగే శివరాత్రి ఉత్సవాలను తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు

💠 ఈ ఆల‌య ప్రాంగ‌ణంలో సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌ర‌స్వామి, వీర‌భ‌ద్రస్వామి, ఆంజ‌నేయ‌స్వామి, కాల‌భైర‌వ‌స్వామి, గోస్త‌నీ న‌ది ఒడ్డున ల‌క్ష్మ‌ణేశ్వ‌ర‌స్వామి ఆల‌యాలు ఉన్నాయి. రామేశ్వ‌ర‌స్వామి ఆల‌యం రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రంగా పేరు గాంచింది.

💠 ఈ స్వామిని పళ్ళ రసాలతో అభిషేకిస్తే ముక్తిని పొందుతామని భక్తుల నమ్మకం. అందుకే వైశాఖ మాసంలో స్వామి దర్సనానికి పరిసర ప్రాంతాలనుండి కొన్ని వేల మంది భక్తులు వస్తారు.

💠 నత్తా రామలింగేశ్వాలాయానికి నైరుతి దిక్కున కొన్ని వందల సంవత్సరాల వయస్సు గల అశ్వర్థ వృక్షం కలదు. ఈ చెట్టుకి ప్రదక్షిణలు చేస్తే సంతానము కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.

💠 గోస్తని చరిత్ర విశేషాలను తెలుసుకోవాలనుకొన్న నారదుడు బ్రహ్మదేవుని చేరి గోస్తని పుట్టుక, గొప్పధనం తెల్పమని అడుగుతాడు..దానికి బ్రహ్మదేవుడు - గోస్తనీనది పరమ పవిత్రమైనది. ఇది గోదావరి కన్నా పురాతనం అని చెప్తూ గోస్తని నది పుట్టుక వివరాలు ఇలా చెప్పారు..

💠 పృధు చక్రవర్తి క్షామ నివారణ సందంర్భంగా భూదేవిపై ఆగ్రహించగా ఆమె గోరూపిణిగా ధేనుకాద్రి వద్ద కనిపించి 33కోట్ల దేవతలను లేగలుగా చేసి తనపాలు పితకమన్నదట.
అలా తొర్లిన పాల దారలే గోస్థని నదిగా మారినది.

💠 పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు పట్టణం నుండి ఈ క్షేత్రము 14 కి.మీ. దూరంలో ఉంది. తాడేపల్లి గూడెం నుండి 28 కి.మీ. అత్తిలి నుండి. 6 కి.మీ.

No comments: