Adsense

Monday, April 24, 2023

శ్రీ శక్తీశ్వరస్వామి ఆలయం, పశ్చిమ గోదావరి జిల్లా, యనమదుర్రు

శ్రీ శక్తీశ్వరస్వామి ఆలయం, పశ్చిమ గోదావరి జిల్లా, యనమదుర్రు


💠 సాధారణంగా శివుడు మనకు లింగ రూపంలో దర్శనమిస్తాడు. అయితే కొన్ని క్షేత్రాల్లో మాత్రమే విగ్రహ రూపంలో ఉంటాడు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్షేత్రంలో పరమశివుడు విగ్రహరూపంలోనే కాక తలకిందులుగా శీర్షాసంలో తపస్సు చేస్తూ దర్శనమిచ్చి భక్తులచే పూజింపబడతాడు.
ఆయన పక్కనే పార్వతీదేవి నెలల పసికందు అయిన షణ్ముఖుడిని తన ఒడిలో లాలిస్తూ ఉంటుంది. వీరి ముగ్గురూ ఒకే పానివట్టం మీద ఉండటం  విశేషం.

💠 ఉత్తరభారత దేశంతో పాటు దక్షణమున అనేక ప్రముఖ శైవ మరియు వైష్ణవ దేవాలయాలు ఉన్నవి. 
ఈ ఆలయాల్లో  శ్రీశైలం, రామేశ్వరం, అరుణాచలంతో పాటు పంచభూతలింగ ఆలయాలు, పంచారామ క్షేత్ర తదితర శివాలయములు మరియు తిరుపతి, శ్రీరంగం, అనంత పద్మనాభ తదితర వైష్ణవ ఆలయములతో పాటు అనేకమైన పురాతనం మరియు ప్రాముఖ్యం కలిగిన శివకేశవుల ఆలయాలు అనేకం ఉన్నాయి.
అటువంటి మహిమ కల్గిన ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చేరువలో ఉన్న శక్తీశ్వరస్వామి ఆలయం.

💠 ఈ ఆలయం త్రేతాయుగకాలం నాటిదని ప్రముఖ ప్రవచన కారులు శ్రీచాగంటి కోటేశ్వరరావుగారు వారి శివపూరణ ప్రవచనంనందు ఈ ఆలయ విశిష్టత ప్రవచించబడినదని తెలుస్తున్నది.

💠 ఈ ఆలయం పంచారామ క్షేత్రములకన్నా పురాతనమైనదని మహత్తుకలదని ప్రసిద్ధి,
భోజరాజు శక్తీశ్వరుని పూజించినట్లు, మహాకవి కాళిదాసు ఈ ఆలయం దర్శించి శక్తీశ్వరుని స్తుతించాడని కాళిదాస విరచిత కుమారసంభవం నందు తెలుపబడింది.
మహాకవి శ్రీనాధుడు వ్రాసిన కాశీఖండం నందుకూడా శక్తీశ్వర ఆలయం ప్రముఖంగా చెప్పబడింది.

💠 ఆలయానికి తూర్పుద్వారం ప్రక్కనున్న నందీశ్వరుని విగ్రహంనకు మహమ్మదీయుల దాడినందు కత్తిపదును చూడటానికి ముస్లింరాజు నందిమూతిని, కాలిని నరకగా నందినుండి రత్నాలు బయటపడ్డాయిని, ఒక భటుడు విగ్రహంలో రత్నాలు ఉన్నవి కావున  ఆలయంలో ఇంకా ఎక్కువ ఉన్నవేమో అని ఆలయంలోకి వెళ్ళబోగా ఆలయ పైకప్పు కూలి మీద పడి మరణించాడని ఆలయం వెనక ఉన్న శిధిలాలు తెలుపుతాయి.

💠 ఆలయానికి ఎదురుగా స్వామివారి అభిషేకానికి, నైవేద్యానికీ వినియోగించే నీటికోసం శక్తి కుండమనే కోనేరువుంది.
ఒక పర్యాయం కోనేరు చుట్టూ గోడ నిర్మించాలని కోనేరుని ఎండబెట్టి స్వామివారి నైవేద్యంకోసం వేరే చెరువునీటిని ఉపయోగిస్తే నైవేద్యం తయారుకాలేదు.
పూజారి పాతకోనేరు నందు గుంట త్రవ్వగా ఊరిన నీటితో ప్రసాదంవండగా వెంటనే తయారైంది.  అప్పటినుంచీ స్వామి నైవేద్యానికి పాతకోనేరునీటినే ఉపయోగిస్తారు.

💠 శక్తికుండం లోని నీరు కాశీలోని గంగానది నుండి ఒక పాయ అంతర్వాహినిగా ఈ ప్రదేశానికి ప్రవహిస్తున్నదని పరిశోధకులు తెలిపారని కధనం. అందుకే ఈ సరస్సునందలి నీరు గంగాజలంతో సమానమని భక్తుల నమ్మకం.         

🔅 1వ స్థలపురాణం

💠 యమధర్మరాజు జీవులను కాలం తీరిపోగానే ప్రాణాలు తీసుకువెళ్ళేవాడిగా, పాపపుణ్యాలను బేరీజు వేసి శిక్షలు విధించేవాడు
అయితే జీవుల్లో చాలావరకూ ఈ యముడి పేరు వింటే హడిలిపోతూండడంతో ఆయనకు తాను చేసే పనిపైన విరక్తి కలిగిందనీ, తన పనికి, తనకీ గౌరవం కలిగించే కోర్కెతో శివుని గురించి తపస్సు చేశాడు.
ప్రత్యక్షమైన శివుడు ఒకానొక రాక్షసుడి ద్వారా యముడి పేరుమీదుగా ఏర్పడే క్షేత్రంలో శివాలయం వెలుస్తుందని, తద్వారా యముడు, హరుడు లయకారులన్న భయం కాకుండా ఆరోగ్యప్రదాతలన్న పేరువస్తుందని వరమిచ్చారు.
ఆ ప్రకారమే ఈ ఆలయం వెలిసిందని, ఆలయంలో దీర్ఘరోగాలు నయమవుతాయని స్థలపురాణం చెప్తోంది.

🔅 రెండో కథనం ప్రకారం శంబిరుడనే రాక్షసరాజు ప్రజలను తీవ్ర హింసలకు గురిచేస్తుంటాడు. దీంతో మునులు యమధర్మరాజు వద్దకు వెళ్లి తమ బాధలు చెప్పుకుంటారు.
చిత్రగుప్తుడి ద్వారా శంబిరుడి ఆయువును యముడి లెక్కగడుతాడు.
శంబిరుడి ఆయువు త్వరలో తీరుపోతుందని దీంతో అతి త్వరలో ఆ రాక్షసుడిని సంహరిస్తారని యముడు వారికి చెబుతాడు.

💠 అయితే శంబిరుడు ఈశ్వరుడి పరమ భక్తుడు. గతంలో ఈశ్వర ఆజ్జన ప్రకారం ఈశ్వరుడి భక్తులను సంహరించాలంటే ముందుగా ఈశ్వరుడి అనుమతి తీసుకోవాలి. దీనిని జ్జప్తికి తెచ్చుకున్న యముడు యమనదుర్రులో ఘెర తప్పస్సు చేసి ఉన్నఫళంగా ప్రత్యక్షం కావాలని లేదంటే లోక వినాశనం తప్పదని యోగమాయ ద్వారా శివుడికి చేరవేస్తాడు.

💠 ఆ సమయంలో శివుడు శీర్షాసనంలో తపస్సు చేస్తుంటాడు. ఆయన పక్కనే పార్వతీ దేవి కుమారస్వామిని ఒడిలో లాలిస్తుంటుంది. దీంతో పార్వతికి విషయం చెప్పి పరమశివుడు అదే స్థితిలో యముడికి ప్రత్యక్షమవుతాడు. అందువల్లే ఇక్కడ శివుడు శీర్షాసన స్థితిలో కనిపిస్తాడని శివపురాణం చెబుతోంది.

💠 శంబిరుడిని సంహరించడనికి పరమశివుడు యముడికి అనుమతి ఇవ్వడమే కాకుండా ఇకపై తాము ఇదే స్థితిలో భక్తులకు దర్శనమిస్తామని శివుడు తెలిపాడు.
అదే విధంగా ఇక్కడ ఒకే పీఠం పై పార్వతి, పరమేశ్వరులు, కుమారస్వామి కొలువై ఉంటారు.
ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే దీర్ఘ రోగాలు నయమవుతాయని కూడా ఇక్కడి పూజారులు చెబుతున్నారు.

💠 ఈ ఆలయం పశ్చిమగోదావరిజిల్లా భీమవరం గ్రామమునకు 5 కి.మీ దూరములో యనమదుర్రు గ్రామములో ఉన్నది.

No comments: