Adsense

Wednesday, April 5, 2023

ఒంటిమిట్ట కోదండ రామాలయ విశేషాలు. Vontimitta Ramalayam

👉 ఒక మిట్టమీద నిర్మింపబడ్డ రామాలయం అవటంవల్ల ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అని పేరు వచ్చింది.

👉 ఈ  ఆలయంలోని విగ్రహాలు ఒకే శిలలో మలచబడ్డాయి.  అందుకే దీనికి ఏక శిలా నగరమనే పేరు వచ్చింది.

👉 ఇంకొక కధనం ప్రకారం ఒంటుడు, మిట్టుడు అనే ఇద్దరు రామ భక్తులు (వీరు చోరులు అని కూడా అంటారు)  ఈ ఆలయాన్ని నిర్మించారు.  నిర్మాణం పూర్తయిన తర్వాత వారు తమ జీవితాలని అంతం చేసుకున్నారు.  వారి శిలా విగ్రహాలు ఆలయంలో ప్రవేశించటానికి ముందు చూడవచ్చు.

👉 మహా భాగవతకర్త పోతన తాను ఏక శైలపురివాసినని చెప్పుకున్నాడు.    భాగవతంలో తానీ ప్రాంతానికి చెందినవాడనే మాటలు కొన్ని వుండటంవల్లకూడా పోతన కొంత కాలం ఇక్కడ నివసించినట్లు భావిస్తారు.  పోతన జన్మ స్ధలం గురించి ఎన్నో వివాదాలున్నాయి.  అయినా ఆయన రచించిన భాగవతాన్ని అంకితమిచ్చింది కోదండరాముడికే.  ఆలయంలో  సహజ కవి విగ్రహాన్ని దర్శించవచ్చు.

👉 రామ లక్ష్మణులు చిన్న వయసులోనేకాక సీతా రామ కళ్యాణం తర్వాత కూడా మృకండ మహర్షి, శృంగి మహర్షి కోరికమీద యాగ రక్షణకి, దుష్ట శిక్షణకీ శ్రీరామ లక్ష్మణులు అంబులపొది, పిడిబాకు, కోదండం పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశారని ఒక కధనం. 
అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతా రామ లక్ష్మణుల విగ్రహాలను ఏక శిలలో చెక్కించారనీ, తర్వాత జాంబవంతుడు ఈ విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట చేశాడనీ ఇక్కడివారి విశ్వాసం.

👉 సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇంకొకటి ఇమాంబేగ్ బావి.  1640 సం. లో కడపను పాలించిన అబ్దుల్ నబీఖాన్ ప్రతినిధి ఇమాంబేగ్.   ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించాడుట.  చిత్త శుధ్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని వారు సమాధానం ఇవ్వగా ఆయన మూడు సార్లు రాముణ్ణి పిలిచారట.  అందుకు ప్రతిగా మూడు సార్లు ఓ అని సమాధానం వచ్చింది.  ఆయన ఆశ్చర్య చకితుడై, స్వామి భక్తుడిగా మారి, అక్కడి నీటి అవసరాలకోసం ఒక బావిని తవ్వించాడు.  ఆయన పేరుమీద ఆ బావిని  ఇమాంబేగ్ బావి అటారు.  అప్పటినుంచి ఎందరో ముస్లిం భక్తులు కూడా ఈ ఆలయం సందర్శిస్తూ వుంటారు.

👉 ఆలయ నిర్మాణం:
చోళులు, విజయనగర రాజులు, మట్టిరాజులు ఈ ఆలయాన్ని మూడు దశలలో నిర్మించారు.

👉మూడు గోపురాలతో, విశాలమైన ఆవరణలో అలరారే ఈ ఆలయం ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు.
* ఈ ఆలయంలో మధ్య మండపంలో 32 స్తంబాలున్న రంగమంటపం వున్నది.  సందర్శకులను ఆకట్టుకునే ఈ స్తంభాల మీద  శిల్ప కళ చోళ, విజయనగర శిల్ప శైలిని పోలి వుంటుంది.  
ఈ స్తంబాలపై రామాయణ, భారత కధలను చూడచ్చు.
* గుడి ఎదురుగా సంజీవరాయ దేవాలయం, పక్కగా రధశాల, రధం వున్నాయి.
* పోతన, అయ్యల రాజు రామభద్రుడు, ఉప్పు గుండూరు వేంకటకవి, వరకవి మొదలగు ఎందరో స్వామికి కవితార్చన చేసి తరించారు.

👉అన్నమాచార్యుడు ఈ ఆలయాన్ని దర్శించి స్వామిమీద కొన్ని కీర్తనలు రచించారు.

👉 ప్రౌఢ దేవరాయల ఆస్ధానంలో అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతవాసి.  ఈయన స్వామిపై  ... శ్రీ రఘువీర శతకాన్ని రచించారు.  ఇతని మనవడే అష్ట దిగ్గజాల్లో ఒకరయిన అయ్యల రాజు రామభద్రుడు.   

👉 వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించి, ఆంధ్ర వాల్మీకిగా పేరుపొందిన శ్రీ వావిలకొలను సుబ్బారావు (1863 – 1936)  రెవెన్యూ ఉద్యోగి.  ఈయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన జీవితాన్ని ఈ ఆలయ పునరుధ్ధరణకి అంకితం చేశారు. 
ఊరూరా భిక్షమెత్తి ఈ ఆలయానికి భూములు, భవనాలు, స్వామికి విలువైన ఆభరణాలు ఏర్పాటు చేశారు.  ఈయన రామాయణాన్ని తెలుగులో రచించి దానికి “మందరం” అనే పేరుతో వ్యాఖ్యానం కూడా రాశారు.
మార్గము:

👉 కడపనుంచి రాజం పేట వెళ్ళే మార్గంలో కడపకి 27 కి.మీ. ల దూరంలో వున్నది.  కడపనుంచి బస్సు సౌకర్యం వున్నది.

🔅 ఉత్సవాలు:

👉 చైత్ర శుధ్ధ నవమినుండి బహుళ విదియ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.  అందులో చతుర్దశినాడు కళ్యాణం, పౌర్ణమినాడు రధోత్సవం, నవమినాడు పోతన జయంతి జరుగుతాయి.

No comments: