Adsense

Sunday, May 14, 2023

హనుమ - జననం - పొందిన వరాలు ..

హనుమ - జననం - పొందిన వరాలు ..


🌿హనుమంతుని తండ్రి పేరు కేసరి.  అంజన ఆ కేసరి యొక్క భార్య.  అంజన యొక్క కుమారుడు ఆంజనేయుడు. హనుమంతుడు,

🌸 అంజనాదేవి గర్భాన -  వాయుదేవుడు - శివతేజస్సును ప్రవేశపెట్టడం వలన జన్మించాడు. అందుచేత పవనతనయుడు, మారుతి నందనుడు వంటి పేర్లు కలిగియున్నాడు.

🌷
హనుమ పొందిన వరాలు: 🌷

🌿శిశువుగా ఉన్నప్పుడే, ఆకలి కలిగియున్నప్పుడు,  సూర్యుని ఫలమనుకొని, పొందుటకు ఎగరడం,  సూర్యుని వద్డ హనుమను చూచి, రాహువు ఇంద్రునికి ఫిర్యాదు వంటి సందర్భాలలో, ఇంద్రుడు వచ్చి వజ్రాయుధం ప్రయోగించడం సంభవించింది.

🌸అప్పుడు ఆ వజ్రాయుధం ఆంజనేయుని దౌడ(హనుమ)కు తగిలి, స్వామి నిర్జీవుడై పడిపోవడం జరిగింది.  అది చూసి, వాయుదేవుడు సకల జీవరాశి నుంచి బయటకు వచ్చి సమ్మె చేశాడు.  అది తెలిసిన బ్రహ్మదేవుడు, దేవతలతో వచ్చి, ఆంజనేయుని పునర్జీవితుని చేశాడు.

🌿వాయువుకి సంతోషం కలిగించడానికీ,  భవిష్యత్తులో దేవతల గొప్పకార్యాన్ని మారుతి నిర్వహించడానికీ,  దేవతలందఱినీ మారుతికి వరాలిమ్మన్నాడు బ్రహ్మదేవుడు.  అప్పుడు,

🌷
1. ఇంద్రుడు: 🌷 

🌸 బంగారు పద్మహారమునిచ్చి, హనుమ అని నామమిడి, తన వజ్రాయుధము వలన ఏ హానీ కలుగదన్నాడు.

🌷
2. సూర్యుడు:  🌷

🌿తన తేజస్సులో నూఱోవంతు ఇస్తున్నాననీ,  శైశవ దశనించీ విద్యార్జన స్థితి రాగానే, సకల శాస్త్ర జ్ఞానాన్నీ కలిగిస్తాననీ, తద్వారా వాక్చతురుడు కాగలడనీ, శాస్త్రజ్ఞానమందు హనుమతో సరితూగగలవాడు మరొకడుండడనీ అన్నాడు.

🌷3. వరుణుడు: 🌷

🌸తన పాశము వలనగానీ, జలముల వలన గానీ, లక్షల కొలది సంవత్సరాల వరకూ మృత్యుభయం ఉండకుండా వరమిచ్చాడు.

🌷4. యముడు: 🌷

🌿తన దండము వలన మృత్యువు కలగదనీ, ఎల్లప్పుడూ ఆరోగ్యభాగ్యాలతో వర్ధిల్లుతాడనీ,  యుద్ధమునందు విషాదగ్రస్తుడు కాడనీ మారుతికి వరాలొసగాడు.

🌷
5. కుబేరుడు: 🌷

🌸సమరమునందు తన గద ఆంజనేయునికి ఎట్టి ఆపదను కలిగించదన్నాడు.

🌷6. శంకరుడు: 🌷

🌿తన వలన గానీ, శూల పాశుపతాస్త్రాది తన ఆయుధాల వలనగానీ హనుమ వధ్యుడు కాడని వరమనుగ్రహించాడు.

🌷7. విశ్వకర్మ: 🌷

🌸తాను నిర్మించిన దివ్యశస్త్రములలో ఏ ఒక్కటైననూ  రణమందు వధింపజాలదనీ,  చిరంజీవి అవుతాడనీ హనుమకి వరాలిచ్చాడు.

🌷8. బ్రహ్మ: 🌷

🌿 ఏ బ్రహ్మదండం చేతనూ వధ్యుడు కాడనీ, దీర్ఘాయువనీ మారుతికి వరాలిచ్చి, వాయుదేవునితో మారుతిని గూర్చి - శత్రువులను గడగడలాడించగలడనీ, - మిత్రులకు అభయప్రదాత అవుతాడనీ,

🌸 యుద్ధంలో శత్రువులకు అజేయుడై వర్ధిల్లుతాడనీ, - కోరుకొన్న రూపాలను పొందగలడనీ, - ఇష్టానుసారంగా అంతటా - వేగంగానూ, నెమ్మదిగానూ సంచరింపగలడనీ, - చిరస్థిరకీర్తితో వర్ధిల్లగలడనీ,  

🌿 యుద్ధము నందు అతడొనర్చే వీరోచిత సాహసాద్భుత కృత్యాలన్నీ రావణ సంహారానికి కారకాలవుతూ, అవి రామునకు ప్రియము గూర్చుతాయనీ, లోకాలకు రోమాంచమునూ సంతోషాన్నీ కలిగిస్తాయనీ పేర్కొన్నాడు.

🌸ఆ విధంగా సకల వరాలూ పొందిన శిశువైన మారుతిని, వాయుదేవుడు అంజనాదేవి వద్దకు తీసుకువచ్చి, ఆమెకు అప్పగించి, వరాలగూర్చి వివరించి వెళ్ళాడు.

🌷హనుమానంజనానూను: వాయుపుత్రోమహాబలః
రామేష్ఠ: ఫల్గుణసఖః పింగాక్షో: అమిత విక్రమః

ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః*
లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః

స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్యమృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్..
🌷

🌿మనం కూడా స్వామిని స్తుతిస్తే సకల శుభాలూ కలిగిస్తాడు. ప్రతిరోజూ ఆరాధిస్తూ,  సకల శాస్త్ర పారంగతుడూ, సర్వశక్తిమంతుడూ అయిన హనుమని సేవిద్దాం.

🌸మన జీవిత లక్ష్యాలని నెరవేర్చుకొందాం. హనుమతుడికి
5 సంఖ్య చాలా ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయండి. అరటిపళ్ళు, మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. వీలుంటే 5 పళ్ళు సమర్పించండి. 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.

🌹జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ...జై హనుమాన్... జై జై హనుమాన్ .

No comments: