ఇతర దేవతారాధన గూర్చి కృష్ణుడి వాఖ్య!!
యే౨ప్యన్యదేవతా భక్తా యజస్తే శ్రద్ధయాన్వితాః। తే౨పి మామేవ కౌన్తేయ యజన్త్యవిధిపూర్వకమ్||
ఏ భక్తులైతే నన్ను కాకుండా ఇతర దేవతలను వేదములలో శాస్త్రములలో చెప్పబడినట్టు విధిపూర్వకంగా కాకుండా, కేవలం శద్ధాభక్తులతో పూజిస్తూ ఉంటారో, అటువంటి వారు ఏ దేవతలను పూజించినా, నన్ను పూజించినట్టే.
మనకు చాలామంది దేవుళ్లు దేవతలు ఉన్నారు. విష్ణుపురాణంలో విష్ణువు, శివపురాణంలో శివుడు, దేవీ భాగవతంలో అమ్మవారు, భాగవతంలో కృష్ణుడు, రామాయణంలో రాముడు, ఈ ప్రకారంగా ఎవరి అభిరుచికి తగ్గట్టు వారికి పురాణాలు, కావ్యాలు రచింపబడ్డాయి. ఎవరికి ఏ దేవుడు ఇష్టం అయితే ఆ దేవుడిని పూజించవచ్చు, ఉపాసించవచ్చు. కాని మా దేవుడే గొప్ప, మీ దేవుడు అసలు దేవుడే కాదు అనడం తప్పు. ఈ భావన అసలు రాకూడదు. "సర్వదేవనమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి" అంటే ఏ దేవుడికి నమస్కారం చేసినా, అది పరమాత్మకే చెందుతుంది. కాకపోతే భక్తులలో ఉండే భేదాలను బట్టి వారి వారి పూజావిధానాలు, పూజించే దేవతామూర్తులు ఉంటారు.
ఈ శ్లోకంలో పరమాత్మ రెండవ తరగతి భక్తుల గురించి చెబుతున్నాడు. ఈ రకం భక్తులకు ఒక దేవుడు అంటూ ఉండరు. కాని శ్రద్ధ, భక్తి ఉంటుంది. ఏ దేవుడు తన కోరికలు తీరుస్తాడు అనుకుంటే ఆ దేవుడికి ఉపాసిస్తారు. ఆ యజ్ఞాలు చేస్తారు. కోరికలు తీరడం కోసమే యజ్ఞయాగాలు క్రతువులు చేస్తారు. వారికీ భక్తి ఉంటుంది. అది అనన్య భక్తి కాదు. వారు ఇతర దేవతలకు శ్రద్ధతో చేసే ఆరాధనలు అన్నీ నాకే చెందినా, ఆ విషయం వారికి తెలియదు. తాము పూజించే దేవుడే గొప్ప అనే అజ్ఞానంలో ఉంటారు. అంటే అవిధి పూర్వకమ్ అంటే ఆత్మజ్ఞానం తెలియకుండా ఆరాధిస్తారు. పరమాత్మ ఆత్మస్వరూపుడుగా అందరిలోనూ, అన్ని దేవతామూర్తులలోనూ ఉన్నాడు అనే జ్ఞానం వీరికి ఉండదు. దేవతామూర్తుల మధ్య బేధభావంతో, అజ్ఞానంతో పూజిస్తారు. వీరు సాకారంగా ఆరాధించే సకామ భక్తులు. ఇతర దేవతలను వివిధ నామ రూపాలతో ఆరాధిస్తారు. వారు ఏ దేవతలను, దేవుళ్లను ఆరాధించినా, వారు శ్రద్ధతో ఆరాధిస్తే, ఆ ఆరాధనలు అన్నీ పరమాత్మకే చెందుతాయి. “సర్వదేవ నమస్కార: కేశవం ప్రతిగచ్ఛతి” అని మనం చెప్పుకుంటాము. అంటే సకామభక్తులు తమయొక్క వివిధములైన కోరికలు తీరడానికి వివిధములైన దేవతామూర్తులను పూజించినా, ఆ పూజలు అన్నీ కూడా, నిష్కామభక్తులు మోక్షాన్నికోరుకుంటూ ఉపాసించే నిరాకారుడైన పరమాత్మకే చెందుతాయి.
కాని కోరికల కొరకు దేవతామూర్తులను ఆరాధించే భక్తులు అక్కడే ఆగిపోతున్నారు. ముందుకు సాగడంలేదు. కోరికలు కోరుకోవడం, అవి తీరగానే కొత్త కోరికలు కోరడం. వీరి భక్తి, శ్రద్ధ, పూజలు, యజ్ఞయాగములు, కోరికల వరకే పరిమితం అవుతున్నాయి. ఎందుకంటే ఈ సాకార రూప అర్చన, నామరూప అర్చన విధిపూర్వకము అయినది కాదు. అంటే మనం పెద్ద చదువులు చదవకుండా టెన్త్ క్లాసుతో ఆపేసి అదే గొప్ప చదువు అనుకున్నట్టు. అదే అజ్ఞానం. ముందుకుసాగి నిర్గుణ బ్రహ్మను ఆరాధించి పరమాత్మను చేరుకోవడానికి ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి పొందడానికి ప్రయత్నం చేయాలి. అవిధి పూర్వకం అని ఎందుకున్నారంటే వివిధ దేవతారాధనలు కేవలం ప్రాపంచిక కోరికలు తీరడానికి స్వర్గసుఖాల కోసం చేయబడుతున్నాయి. కోరికలు ఉన్నంతవరకు వాసనలు ఉంటాయి అవి ఉన్నంత వరకు పునర్జన్మ తప్పదు. జనన మరణ చక్రం నుండి విముక్తి పొందితే కానీ పరమాత్మ దర్శనం కాదు. వేదాలలో, శాస్త్రాలలో నిర్గుణబ్రహ్మను ఆరాధించడం గురించి చెప్పబడింది. అందుకని అది విధిపూర్వకంకాదు అని అన్నాడు కృష్ణుడు.
No comments:
Post a Comment