Adsense

Saturday, May 27, 2023

జాగేశ్వర క్షేత్రం - ఉత్తరాఖండ్

జాగేశ్వర క్షేత్రం - ఉత్తరాఖండ్

ఇది సతీదేవి తపోస్థలి.. మృత్యుంజయ మంత్ర మూలస్థానం!

అన్ని వైపులా వృక్షాలు... ప్రధానంగా దేవదారు చెట్లు ఆవరించి ఉన్న లోయ.
పక్కనే పారుతున్న జటాగంగ నది... మధ్యలో శతాధిక ఆలయ సముదాయం...
అందులో మహాశివుడు జాగేశ్వర స్వామిగా కొలువు తీరాడు.

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం దేవభూమిగా ప్రసిద్ధం. గొప్ప పుణ్యక్షేత్రాలకు నెలవు. వాటిలో జాగేశ్వర క్షేత్రం ఒకటి. నిజానికిది ఆలయాల సముదాయం. అక్కడ సుమారు నూటపాతిక చిన్నా పెద్ద గుడులు ఉంటాయి. వాటిలో ప్రధానమైనదీ, మహిమాన్వితంగా ఖ్యాతి పొందినదీ జాగేశ్వర ఆలయం. ఈ మందిరంలోని శివుడిని అర్థనారీశ్వర స్వరూపంగా భక్తులు కొలుస్తారు. అంతేకాదు, ద్వాదశ జ్యోతిర్లింగ శ్లోకంలో ‘నాగేశం దారుకావనే’ అంటూ ప్రస్తావితమైన నాగేశ్వర క్షేత్రం ఇదేననీ, చుట్టూ దేవదారు వృక్షాలు ఉండడమే అందుకు తార్కాణమనీ నమ్మకం ఉంది. (ఈ విషయంలో అనేక వాదనలున్నాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌ సమీపంలో ఉన్న నాగేశ్వర క్షేత్రం, మహారాష్ట్రలోని ఔంధ నాగనాథ్‌ ఆలయం కూడా నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాలుగా ప్రాచుర్యం పొందినవే). కైలాస మానస సరోవర యాత్రకు వెళ్ళే యాత్రికులు మార్గమధ్యంలో జాగేశ్వరుణ్ణి సందర్శించుకోవడం, ఆయన ఆశీస్సులు అందుకోవడం ఆనవాయితీ. సదాశివుడు సదా యోగనిద్రలో ఉంటాడనీ, హారతి సమయంలో మాత్రమే మేలుకొంటాడనీ, అయితే ఈ ఆలయంలో జాగేశ్వరుడు అన్నివేళలా జాగద్రావస్థలో ఉండి భక్తులను కరుణిస్తాడనీ, అందుకే ఈ స్వామిని ‘జాగేశ్వరుడు’ అంటారనీ చెబుతారు. పరమేశ్వరుని కోసం సతీదేవి తపస్సు చేసిన చోటు అపమృత్యు భయాన్ని నివారించి, ఆయురారోగ్యాలను చేకూర్చే మహా మృత్యుంజయ మంత్రానికి మూల స్థానం ఇదేననీ కథనాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో పుష్ఠీదేవిగా అమ్మవారు కొలువయ్యారు.

దేవీ భాగవతంలో ప్రస్తావితమైన శక్తి పీఠాలలో ఇదొకటి. ప్రతిరాత్రీ ఈ ఆలయంలో స్వామివారికి పవళింపు సేవలో వేసే పక్క మరుసటి రోజు ఉదయానికి నలిగి ఉంటుందట! క్రీస్తుశకం ఏడో శతాబ్దం నుంచి పధ్నాలుగో శతాబ్దం మధ్య ఈ ఆలయాల నిర్మాణం జరిగిందని లభ్యమైన ఆధారాలు సూచిస్తున్నాయి. ప్రధాన ఆలయ నిర్మాణం ఆదిశంకరాచార్య నేతృత్వంలో జరిగిందని చెబుతారు. ఈ ఆలయం ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని అల్మోరా పట్టణానికి సుమారు 36 కిలోమీటర్ల దూరంలో ఉంది

No comments: