Adsense

Saturday, May 13, 2023

శ్రీ కోటసత్తెమ్మ ఆలయం, నిడదవోలు

శ్రీ కోటసత్తెమ్మ ఆలయం, నిడదవోలు

💠 13వ శతాబ్ధంలో రాణి రుద్రమదేవి భర్త వీరబధ్ర చాళుక్యుడు నిడదవోలు (నిరవద్యపురం) ప్రాంతాన్ని పరిపాలించేవాడు.
అప్పుడు జరిగిన యుద్ధాలలో సత్తెమ్మ తల్లి నిడదవోలు కోటను కాపాడిందని చెబుతారు. కాకతీయుల కాలంలోనే ఈ దేవాలయం ప్రసిద్ధి చెందినది. కాకతీయు పతనం తరువాత ఈ దేవాలయం ప్రకృతి వైపరీత్యాలకు కనుమరుగైంది.

💠 ఈ గ్రామ పూర్వము దేవులపల్లి వారి అగ్రహారంగా పిలువబడినది, ఆ గ్రామంలో కృష్ణాజిల్లా అకిరిపల్లి నుండి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన దేవులపల్లి రామ సుబ్బరాయ శాస్త్రి గారి కుమారుడైన శ్రీరామ శాస్త్రి గారి పొలములో పొలం దున్నుతూ ఉండగా 1934లో అమ్మవారి విగ్రహం బయల్పడినది.

💠 అయన కొన్నాళ్ళు బయటపడిన ప్రదేశంలోనే పూజాదికాలు నిర్వహించాడు, తరువాత కొంత కాలమునకు ఆయన కలలో కనిపించి దేవాలయము నిర్మించవలసిందిగా ఆజ్ఞాపించడం వలన తన పొలం కొంతభాగం దేవాలయ నిర్మాణమునకు కేటాయించి 1935లో భక్తులు అమ్మవారి దేవాలయ నిర్మాణం కావించి, చుట్టూ ప్రహరీ కట్టి పూజాదులు నిర్వహించుట మొదలెట్టినారు.

💠 అప్పటి నుండి ఆలయము వేగముగా అభివృద్ధి చెందుతూ ప్రస్తుతము ఏడాదికి యాభై లక్షల ఆదాయం కలిగిన పెద్ద దేవస్థానముగా రూపుదాల్చింది.
1976, 77 సంవత్సరాలలో దేవాలయ విస్తరణ కావించారు.. క్రమముగా ఆలయ ప్రాచుర్యం పెరుగుతూ పోవడం వలన మళ్ళీ ఆలయమును 2002 లో పెద్దగా నిర్మించారు.

💠 ఆనాటి నుంచి  నేటి వరకు భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా, వరాలిచ్చే చల్లని తల్లిగా పేరుగాంచుతోంది.
ఈ ఆలయానికి ఉభయగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం, గుంటూరు, కృష్ణ, జిల్లాల భక్తులు అధికంగా విచ్చేస్తుంటారు. ఆలయంలో ఏటా దసరా ఉత్సవాలతోపాటు అమ్మవారి తిరునాళ్ళను వైభవంగా నిర్వహిస్తున్నారు.

💠 ఈ ఆలయంలో శంఖ-చక్ర -గద- అభయ హస్త -యజ్ఞోపవీతధారిణిగా ఏకశిలా స్వయంభూ విగ్రహంతో త్రిశక్తి స్వరూపిణిగా వెలసిన అమ్మవారిని సందర్శించటానికి రెండు కళ్లూ చాలవేమోననిపిస్తుంది.

💠 ఈ ఆలయానికి  క్షేత్రపాలకుడు పంచముఖ ఆంజనేయస్వామి. అమ్మవారి దర్శనం కోసం ఏటా సుమారు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు వస్తుంటారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఇక్కడ 65 గదులు ఉన్నాయి.

💠 ఆలయానికి ప్రతి ఆది, మంగళవారాలలో భక్తులు విశేషంగా తరలివచ్చి తమ మెక్కుబడులు తీర్చుకుంటారు.
చుట్టుపక్కల గ్రామాలలో ప్రతి కుటుంబంలోనూ కోటసత్యనారాయణ, కోటసత్తెమ్మ అనే పేర్లు తప్పనిసరిగా పెట్టుకుంటారు.

💠 ఏటా శ్రావణమాసంలో చివరి శుక్రవారం నాడు సుమారు 1000 మంది ముతైదువలతో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను వైభవంగా నిర్వహిస్తారు.
ఈ వ్రతాలకు నిడదవోలు పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుండి మహిళలు తరలిరావడంతో సందడి నెలకొంటుంది. దేవస్థానం ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా పసుపు, కుంకుమ, గాజులు, తమలపాకులు, లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు.

💠 ఆలయానికి వచ్చిన భక్తులకు రోజుకి సుమారు 100 మందికి శాశ్వత అన్నదాన ట్రస్టు ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

💠 శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి దేవస్థానంలో గర్భాలయానికి నైరుతి వైపున ఉన్న సంతాన వృక్షానికి రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతోంది.
సంతానం లేని దంపతులు ఈ వృక్షానికి ఊయల కట్టడం సంప్రదాయం.
సంతానం లేని దంపతులు ఈ వృక్షం దగ్గరకు చేరుకుని ఎర్రటి వస్త్రం, పూర్తిగా పండిన రెండు అరటిపండ్లను అమ్మవారికి సమర్పిస్తారు. అనంతరం ఒక అరటి పండును, ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని దంపతులు సంతాన వృక్షానికి ఊయల కట్టి, ఆ ఊయలలో పండును ఉంచి, ‘అమ్మా... పండు కడుతున్నాను పండంటి బిడ్డను ప్రసాదించు తల్లీ’ అని వేడుకుంటారు. బిడ్డ పుట్టిన తరువాత అమ్మవారి సన్నిధి తీసుకువచ్చి పేరు పెట్టుకోవడంతోపాటు బిడ్డ ఎత్తు తులాభారంతో మొక్కుబడి తీర్చుకుంటారు.
తులాభారానికి నగదు (నాణేల రూపంలో) లేదా పటిక బెల్లం తూకం సమర్పించుకుంటారు.

💠 రాజమండ్రి నుండి 26 కిమీ,తాడేపల్లిగూడెం నుండి 25 కిమీ దూరం.

No comments: