ఓం గం గణపతయే నమః
మహా గణపతి సహస్రనామ స్తోత్రము" ఎలా ఆవిర్భవించింది!!?
"మహా గణపతి" స్తోత్రాన్ని స్వయంగా
గణపతే ఉపదేశించినటువంటి స్తోత్రం.
ఎవరో రచించినది కాకుండా సాక్షాత్తు
గణపతే ఈ స్తోత్రాన్ని తన నుంచి వ్యక్తపరిచాడు.
దానిని మహర్షి వ్యాసదేవుడు తపస్సమాధిలో విని గణేశ పురాణంలో గ్రంథస్థం చేశాడు.
-ఈ సహస్రనామ ఉత్పత్తికి సంబంధించి
అద్భుతమైన వృత్తాంతం వున్నది.
పరమేశ్వరుడు_త్రిపురాసుర_సంహారానికి బయలుదేరినప్పుడు ఆ త్రిపురులను సంహరించేటప్పుడు కూడా విఘ్నాలు ఏర్పడ్డాయి.
అప్పుడు పార్వతీ దేవి అందిట..
మీ అబ్బాయికి చెప్పి వచ్చారా అని.
వెంటనే పరమేశ్వరుడు ధ్యానంచేసి తన హృదయంలో గణపతిని ధ్యానిస్తూ ఉన్నాడు.
అప్పుడు పంచ వదనాలతో ఉన్నాడు శివుడు... అంటే సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అను ఐదు ముఖాలతో పది చేతులతో వున్న శివుడు గణపతిని ధ్యానిస్తూవుంటే...
ఆయన హృదయంలో వున్నటువంటి ఆ చైతన్యమే, ఆయన నుంచి బయటకు వచ్చి ఐదు ముఖాలతో పది చేతులతో కనిపించింది.
అంటే తన వలే వున్న రూపం కనబడింది.
భేదం ఎక్కడున్నదయ్యా అంటే ఆ ఐదు వదనాలు ఏనుగు వదనాలే. ఆ ఐదు వదనాలతో పది చేతులతో వున్నవాడు సింహంపై కూర్చుని వున్నాడు.
సింహం అనగానే శక్తి స్వరూపము అని అర్థం.
పైగా ఆ గణపతికి కూడా నెలవంక వున్నది.
అంటే "శివశక్త్యాత్మకమైన" ఒక స్వరూపం శివుని హృదయం నుంచి వ్యక్తమై బయటకు వచ్చింది.
శివుడే మహాగణపతి రూపంలో కనబడుతున్నాడని భావించవచ్చు.
తనని తానే శివుడు దర్శించాడు ఆ రూపంలో. ఆవిధంగా మహాగణపతి ఆవిర్భవించాడు.
ఈయనకే మరొక పేరు "హేరంబగణపతి"
అప్పుడు ఆ హేరంబ గణపతి స్వయంగా తననుంచి ఈ గణపతి సహస్రనామ స్తోత్రాన్ని ఉత్పన్నం చేశాడు.
అది శివుడు విని పారాయణం చేశాడుట.
ఆ పారాయణం చేసిన వెంటనే త్రిపురాసుర సంహారానికి ఏ విఘ్నములు ఉన్నాయో అవి అన్నీ తొలిగిపోయి సులభంగా త్రిపురాసుర సంహారం చేశాడు.
లలితాదేవి_భండాసురుడుతో యుద్ధం చేస్తూ వుండగా విశుక్రుడు చేసినటువంటి "విఘ్నశిలా యంత్రం"
వల్ల మొత్తం శక్తి సేనలు అన్నీ నిర్వీర్యము అయిపోయాయి.
పరిష్కారం ఏమిటో పెద్ద పెద్ద శక్తులకే తెలియలేదు.
శ్యామలా, వారాహీ ఇత్యాది శక్తులకు
కూడా పరిష్కార మార్గం తెలియలేదు.
అసలు సమస్యే అర్థం కాలేదు.
అప్పుడు అమ్మవారి తో మొర పెట్టుకున్నారు.
అప్పుడు లలితాంబ శివుని చూసి
ఒక చిన్న నవ్వు నవ్వింది. అదిచూసి శివుడూ మందహాసం చేశాడు బదులుగా.
ఆయన మందహాసం చూడగానే అమ్మవారి యొక్క మందహాసంలో మరొక వెలుగు కూడా కలిసింది. అప్పుడు అమ్మ వారి చిరునవ్వు నుంచి పది చేతులతో వల్లభ అనబడే సిద్ధలక్ష్మి తో సహా మహాగణపతి ఆవిర్భవించాడు.
ఆయన ఆ ‘విఘ్నశిలా యంత్రాన్ని’ ఛేదించాడు అంటూ బ్రహ్మాండ పురాణం చెపుతున్నది.
లలితా సహస్రనామ స్తోత్రంలో
"కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరా"
"మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా"
- అనేటటువంటి నామంలో మనకు కనబడుతున్నది.
ఈవిధంగా అటు శివునికి ఇటు శక్తికి కూడా వారి పనుల్లో వచ్చే విఘ్నాలు తొలగించాడు.
బ్రహ్మదేవునికి_విఘ్నాలు_తొలగించాడు.
బ్రహ్మవైవర్త పురాణంలో ఇలా చెప్పారు..
"విపత్తి వాచకో విఘ్నః నాయకః ఖండనార్థకః!
విపత్ ఖండనకారకం నమామి విఘ్ననాయకమ్
విపత్తులే విఘ్నములు.. వాటిని ఖండించేటటువంటి నాయకుడే విఘ్ననాయకుడు అని అద్భుతమైన మాట శాస్త్రం చెపుతున్నది.
అటువంటి విఘ్ననాయకుడు సృష్టికి పూర్వమే సృష్టిని చెయ్యటానికి భగవంతుడి నుండి శక్తి సంపాదించిన బ్రహ్మదేవునికి ఈ సృష్టి చేసేటటువంటి పనిలో అనేక విఘ్నాలు కలిగితే ఆయన ఓంకారాన్ని ధ్యానించాడు.
బ్రహ్మ చేత ధ్యానింపబడుతున్న ఓంకారం గజాననంగా సాక్షాత్కరించి బ్రహ్మకు అన్ని విఘ్నములు తొలగించింది. అలాగే నారాయణుడు దుష్ట దైత్యులను సంహరించటానికి వెళ్ళినప్పుడు అది నిర్విఘ్నంగా జరగటానికి గణపతి పూజ చేశాడని ఉపనిషత్తులు,ఆగమాలు మనకు చెపుతున్నాయి.
గం గణాధిపతయే నమః
No comments:
Post a Comment