Adsense

Tuesday, May 9, 2023

శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం, ఏలూరు



శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం, ఏలూరు

💠 అలనాటి ప్రాచీన వైభవం, సంస్కృతీ, సంప్రదాయాలకు నిలయాలు మన ఆలయాలు. అలాంటి ఆలయాల్లోని.. ప్రతి గాలి గోపురానికీ ఓ ప్రాముఖ్యత ఉంటుంది. అపురూపమైన చిత్రకళకు, శిల్పకళా సంపదకు అవి ఆనవాళ్లు. అలాంటి కోవకు చెందినదే.. ఏలూరు శనివారపుపేట శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలోని గాలిగోపురం చాళుక్యుల కాలం నాటి వైభవాన్ని ప్రతిబింబిస్తుంది.

💠 ఏలూరు - ఇప్పుడు ఏలూరు గా పిలుస్తున్న ఈ ప్రాంతంను ఒకప్పుడు హేలాపురి గా పిలిచేవారు .
హేల అనే చిన్న ఏరు ఈ పట్టణ పరిసరాల్లో ప్రవహించేదట అలా కాలక్రమేణా ఏలూరుగా పిలుస్తున్నారు.

💠 ఏలూరులో అతి పురాతనమైన ఆలయాలు ఉన్నాయి అందులో శనివారపుపేట నందు శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయం ముందు భాగంలో ఉండే గోపురం రాష్ట్రంలోనే అత్యంత అందమైన ఎత్తైన గోపురాలలో ఒకటి.

💠 సుమారు వంద అడుగుల పైన ఎత్తు ఉండే ఈ గోపురం నందు అనేక దేవతమూర్తుల శిల్పాలు అత్యంత అందంగా చెక్కారు.
ఈ అలయంకి తూర్పు ముఖంగా శివాలయం ఉంటుంది. ఇలా ఉండటం చాలా అరుదు.

💠 ఏలూరు నగరానికి 3 కిలోమీటర్ల దూరంలో శనివారపుపేట ఉంది.
అక్కడికి చేరుకోగానే.. ఎడమవైపున ఎత్తైన గాలి గోపురం ఉంటుంది. పాదచారులతో పాటు వాహనదారులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

💠 చిన్న తిరుపతి గా పిలువబడుతున్న ద్వారకా తిరుమల దేవస్థానం చేత దత్తత తీసుకొనబడిన ఈ ఆలయం నూజివీడు జమీందారుల కాలం లో నిర్మించబడినట్లు  చరిత్ర చెపుతోంది.

💠 నూజివీడు జమీందారులలో ప్రఖ్యాతి గాంచిన శ్రీ రాజా మేకాధర్మఅప్పారావు గారి వంశంలో సుమారు రెండు వందల సంవత్సరాలక్రితం రాజా మేకా అప్పారావు జమీందారు గారు ఈ శనివారపుపేట వచ్చి ఇక్కడ దివాణము ఏర్పాటు చేసుకొని స్థిరపడినట్లు చరిత్ర చెపుతోంది.
ఆ సమయంలో శ్రీ చెన్నకేశవ స్వామి  రాజావారికి కలలో కన్పించి బావిలో శ్రీ చెన్నకేశవస్వామి విగ్రహ మున్నదని, ఆ విగ్రహాన్ని బయటకు తీసి, ఆలయాన్ని నిర్మించి, విగ్రహప్రతిష్ఠ చేయవలసిందిగా ఆదేశించారు.

💠 ధైవాజ్ఞను శిరసావహించి శ్రీ రాజావారు ఆవిగ్రహాన్ని వెలికి తీయించి, ఆలయాన్ని నిర్మింపచేసి, శ్రీ వైఖానసాగమం ప్రకారం ప్రతిష్ఠాది కార్యక్రమాలు చేయించి, నిత్యపూజలకు, ఉత్సవాలకు  సాధన సంపత్తిని ఏర్పాటు చేశారు.  
కాలక్రమంలో శ్రీ అప్పారావు వంశంలోని శ్రీ ధర్మాఅప్పారావు గారి కోడళ్లుగా వచ్చిన శ్రీ రాణీ చెన్నమ్మారావు బహద్దర్ వారు, శ్రీ రాణీ పాపమ్మారావు బహద్దర్ వారు ఈ దేవాలయ విషయమై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సుమారు వంద అడుగుల  ఎత్తు గల గాలిగోపురాన్ని  అద్భుతమైన శిల్పకళావైభంవంతో నిర్మింప చేశారు.

💠 100 అడుగుల ఎత్తులో..5 అంతస్తులుగా ఉంటూ అశేష శిల్పకళా సంపదతో కనువిందు చేస్తోంది. దీని నిర్మాణం 11వ శతాబ్దం.. చాళుక్యుల కాలంలో జరిగినట్లుగా పురావస్తు శాఖ అధికారులు ధ్రువీకరించారు.
గోపురంపై ఆనాటి చాళుక్య రాజుల సంస్కృతి, సంప్రదాయాలతో పాటు.. రామాయణం, శ్రీరామపట్టాభిషేకం, మహాభారతం, భాగవతం లాంటి పురాణ, ఇతిహాసాలు.. క్షీరసాగర మథనం, యక్షులు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు, ఆళ్వార్లు, ‍ఋషులు, మునులు, వాత్సాయన కామసూత్రకు సంబంధించిన శిల్పాలను శాస్త్రీయ విధానంలో ప్రాచీన వైభవానికి సంకేతంగా నిర్మించారు.

💠 జిల్లాకే తలమానికంగా నిలిచిన ఈ గాలిగోపురాన్ని దేశ, విదేశాల నుంచి నిత్యం ఎందరో విచ్చేసి వీక్షిస్తుంటారు.

💠 ఈ ఆలయ ప్రాంగణం లోనే ఒక పెద్దకోనేరు ఉంది.
ఉత్తరాభిముఖంగా ఉన్న ఆలయానికి ఎడమవైపు ఆంజనేయుని మందిరం ఒకటి కనిపిస్తుంది. దానికి కొద్ది ఎడంగా  గణపతి,  పార్వతీసమేత రామలింగేశ్వర ఆలయాలు కూడ ఇదే ప్రాంగణం లో నిర్మింపబడి,  శివకేశవాభేదాన్ని ప్రకటిస్తున్నాయి.

💠 ఈ ఆలయానికి తూర్పుగా కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుని దివ్యాలయం ఒకటి ఆథునిక నిర్మాణంగా వెలసి భక్తుల సేవలందుకొంటొంది.

💠 ఏలూరు నుండి నూజివీడు వెళ్లే మార్గంలో ఈ ఆలయం దర్శనమిస్తుంది.      

No comments: