తిరుమల వెంకటేశ్వరస్వామికి తాళ్లపాక వంశస్థులే ఎందుకు కన్యాదానం చేస్తారు..?
శ్రీవారి నిత్యసేవలో అన్నమయ్య వంశo ప్రాముఖ్యత ఏమిటి..?
🔅 తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి తెలిసిన వారందరికీ అన్నమయ్య పేరు సుపరిచితమే.
తన కీర్తనల్లో ఆయన ఆలయ విశిష్టతను వివరించిన తీరు, వెంకటేశ్వర స్వామి పట్ల తన భక్తిని చాటుకున్న తీరు అందరినీ ఆకట్టుకుటుంది.
🔅 అన్నమాచార్యులు వేంకటేశుని స్తుతిస్తూ భక్తి పారవశ్యంతో చేసిన సంకీర్తనలు తెలుగునాట వాడవాడలా వినిపిస్తాయి.
600 ఏళ్లుగా అవి వన్నె తరగకుండా మారుమోగుతూనే ఉన్నాయి.
🔅 కేవలం భక్తికి సంబంధించినవే కాకుండా శృంగార, జ్ఞాన, వైరాగ్య సంకీర్తనలకు ఆయన పెట్టింది పేరు. అందుకే ఆయన రచనలను తరతరాలుగా తెలుగువారు ఆస్వాదిస్తున్నారు.
🔅 నేటికీ తిరుమల ఆలయంలో వంశపారంపర్యంగా కైంకర్య సేవలు నిర్వహించే అవకాశం అన్నమయ్య వారసులకు దక్కుతోంది. వారు కీలకమైన సేవల్లో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.
సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకూ తిరుమల ఆలయ ప్రాంగణమంతా అన్నమయ్య సంకీర్తనలతో మారుమోగుతూ ఉంటుంది.
🔅 తిరుమల గర్భగుడిలోనూ అన్నమయ్య కీర్తనలతో సుప్రభాత సేవ మొదలు సకల సేవలు సాగుతాయి.
సుప్రభాత సేవలో 'మేలుకో శృంగారరాయ' సంకీర్తనతో కైంకర్యం మొదలవుతుంది.
ఆ సమయంలో భగవంతుడు ఓ గురువుగా, అన్నమయ్య శిష్యుడిగా కైంకర్య సేవ సాగుతుంది.
🔅 మధ్యాహ్నం జరిగే 'నిత్య కళ్యాణం పచ్చ తోరణం' కైంకర్య సేవలో అన్నమయ్య సంకీర్తనల ఆలాపన జరుగుతుంది.
🔅రాత్రి పూట ఏకాంత సేవలోనూ శయన మండపంలో ఉయ్యాలలూపుతూ పలు సంకీర్తనలు ఆలపిస్తారు.
చిన్నబిడ్డలను ఉయ్యాలలో వేసి ఊపిన విధంగా లాలి పాటలను సంకీర్తనలుగా వినిపిస్తారు.
🔅 అలసిసొలసిపోయిన వెంకటేశ్వరుడిని 'షోడస కళానిధికి..' అంటూ అన్నమయ్య సంకీర్తనలతో కొనియాడడం నిత్య కార్యక్రమంగా ఉంటుంది.
🔅 శ్రీవారి నిత్యోత్సవాల్లో వైశాఖ మాసాన తిరుమాడ వీధుల్లో జరిగే ఊరేగింపు సందర్భంగా అన్నమయ్య సంకీర్తనలు వినిపించడం సంప్రదాయంగా వస్తోంది.
🔅 తిరుమలలో జరిగే కల్యాణోత్సవంలో వెంకటేశ్వర స్వామిని అన్నమయ్య వారింటి అల్లుడిగా భావిస్తారని ప్రస్తుతం భగవంతుని కైంకర్య సేవల్లో పాల్గొంటున్న తాళ్లపాక కుటుంబీకుడు తాళ్లపాక హరినారాయణాచార్యులు చెప్పారు.
🔅 "అభిజిత లగ్నంలో శ్రీవారికి నిత్య కల్యాణం జరుగుతుంది. ఆ సమయంలో శ్రీదేవి, భూదేవిలను తాళ్లపాక వారింటి ఆడపడుచులుగా భావిస్తాం.
వెంకటేశ్వర స్వామిని అన్నమయ్య వారింటి అల్లుడిగా కీర్తిస్తాం.
అందుకే స్వామివారి కల్యాణోత్సవంలో అన్నమయ్య వారసులు కన్యాదానం చేస్తారు. నేటికీ కైంకర్య సేవల్లో అన్నమయ్య వారసులుగా మాకు ఆ అవకాశం లభిస్తోంది.
🔅 అన్నమాచార్యులు,
పెద తిరుమలాచార్యులు,
చిన తిరుమలాచార్యులు, తిరువెంగనాచార్యులు,
అప్పలాచార్యులు,
కొన్నప్పాచార్యులు,
శేషాచార్యులు,
రాఘవాచార్యులు,
కృష్ణమాచార్యులు,
అనంతాచార్యులు.
శేషాచార్యులు,
రామాచార్యులు.. ఇలా కైంకర్య సేవలో తరతరాలుగా కొనసాగుతున్నాం" అంటూ ఆయన వివరించారు
🔅 తాళ్లపాక చిన్నన్నగా పిలిచే చిన తిరువెంగళనాథుడు అన్నమయ్య చరిత్రపై ద్విపద కావ్యం రచించారు.
దానిని 1948లో పుస్తక రూపంలో ముద్రించారు. ఈ పుస్తకంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అన్నమయ్య జీవిత విశేషాలను ప్రస్తావిస్తూ ఉంటారు.
🔅 అన్నమయ్య "32 వేల సంకీర్తనలు" రచించినట్లుగా చిన్నన్న రాసిన పుస్తకంలో పేర్కొనడంతో అన్నమాచార్య ప్రాజెక్టు పేరుతో చేసిన పరిశోధనలో ఆ లెక్కనే ఖాయం చేశారు.
అయితే ఇప్పటి వరకూ అందులో కేవలం 14వేల సంకీర్తనలను మాత్రమే అందుబాటులోకి తీసుకు రాగలిగారు.
🔅 త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి అనేకమంది వాగ్గేయకారులకు అన్నమయ్య ఆద్యుడని చెబుతుంటారు.
అందుకే 'తెలుగు పద కవితా పితామహుడి'గా అన్నమయ్యను ప్రస్తుతిస్తారు.
🔅'చందమామరావే జాబిల్లి రావే' అంటూ లాలించినా, 'జో అచ్యుతానంద జో జో ముకుందా' అంటూ జోలపాట వినిపించినా.. అన్నింటా అన్నమయ్య ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది.
'అదివో అల్లదివో శ్రీహరివాసము',
'కొండలలో నెలకొన్న కోనేటిరాయుడు' వంటి కీర్తనలు వినని తెలుగువారు ఉండరంటే ఆశ్చర్యమే.
"త్యాగరాజ కీర్తనలు సంగీత ప్రధానం. అన్నమయ్య కీర్తనలు సాహిత్య ప్రధానం
🔅 అన్నమయ్య కుటుంబానికి ఉన్న ప్రత్యేకత
అన్నమయ్య పద సాహిత్యానికి ఎంతో విశిష్టత ఉంది. ఆయనతో పాటుగా అన్నమయ్య వంశీకులలో అనేకమంది తెలుగు సాహిత్యానికి సేవలందించారు.
🔅 అన్నమయ్య తండ్రి భాగవతంలో సిధ్దహస్తులు. తల్లి సంగీతకళానిధి అని చెబుతారు. ఇక అన్నమయ్య భార్య తిమ్మక్క తెలుగులో తొలి కవయిత్రిగా గుర్తింపు పొందారు. తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు, చిన తిరువెంగళాచార్యులు రెండు శతాబ్దాల పాటు తెలుగు సారస్వత సేవలో తరించారు.
🔅 "అన్నమయ్య రచనల్లో సాహిత్యం ప్రధానమైనది. ఆయన రచనల్లో కడప జిల్లా మాండలీకం పదాలుంటాయి. ఆ పదాల అర్థం తెలుసుకుని అన్నమయ్య సంకీర్తనలు ఆలపించాల్సి ఉంటుంది. బ్రహ్మ కడిగిన పాదము అనే సంకీర్తనలో పామిడి తురగపు పాదము అని అంటారు. తురగము అంటే గుర్రం అని అర్థమవుతుంది. పామిడి అంటే ఏమిటి అనేది కూడా తెలియాలి.
No comments:
Post a Comment