దేవా! పదికోట్ల యజ్ఞాది క్రతువులు నడపంగా నేమి, తోమ్మిదీ కోట్ల తులాభారంబులు తూగంగానేమి, యెనిమిది కోట్ల సువర్ణదానంబులు, నేడుకోట్ల గోదానంబులు, నాఱుకోట్ల భూదానంబులు, నయిదు కోట్ల కన్యాదానంబులు, నాలుగుకోట్ల వస్త్రదానంబులు సేయంగా నేమి, మూడుకోట్ల సత్యాదివ్రతంబులు నలుపంగా నేమి. రెండుకోట్ల యన్న దానంబులు గావింపగా నేమి, కోటి స్నానంబులు సేయంగానేమి, మీ నామోచ్చారణంబు సేయక!
పదివేల యజ్ఞాది క్రతువులు నడపిన దేవేంద్రుడు నిలువెల్ల యోనులయ్యెను. తొమ్మిదికోట్ల తులాభారంబులు తూగిన దుర్యోధనుండు యమపురికేగెను. ఎనిమిది కోట్ల సువర్ణదానంబులు సేసిన కర్ణుండు పసిండికొండ మీది యన్నంబులు కపేక్షించెను. ఏడుకోట్ల గోదానంబులు చేసిన కార్తవీర్యార్జునుడు గోహత్యా బ్రహ్మహత్యా పాతకంబుల బొందెను. ఆఱుకోట్ల భూదానంబులు చేసిన బలి విష్ణుపాదంబున బాతాళంబున కేగెను, అయిదు కోట్ల కన్యాదానంబు చేసిన ధ్రువుండు కాశీ క్షేత్రంబున బండ్రెండువేల యేండ్లు భిక్షంబెత్తెను. నాలుగుకోట్ల వస్త్రదానంబులు చేసిన మార్కండేయుండు మతిహీనుండాయెను. రెండుకోట్లన్నదానంబులు చేసిన ధర్మజుండు యమపురి తొంగిచూచెను. కోటిస్నానంబులు చేసిన కుమారస్వామి కోరిక సిద్ధించదాయెను.
దేవా! మీ నామోచ్చారణుబు చేసి ప్రహ్లాద నారద పుండరీక వ్యాస శుక శౌనక భీష్మదాల్భ్య రుక్మాంగదార్జున బలి విభీషణ భృగుగాంగేయా క్రూర విదురాదులగు పరమ భాగవతోత్తములు కృతార్థులైరి.
No comments:
Post a Comment