శ్రీ ఆదికేశవ ఎంబెరుమనార్ స్వామి ఆలయం, నర్సాపురం, పశ్చిమగోదావరి జిల్లా
💠 భారతదేశంలో గల వైష్ణవ దేవాలయాలలో ఒకటిగా పరమ పవిత్ర వశిష్ఠ గోదావరి నదీ తీరాన ఉన్న శ్రీ ఆదికేశవ ఎంబెరుమనారు స్వామివారి దేవస్థానము ఎంతో ప్రశస్తమైనది.
💠 ఈ ఆలయంలో శ్రీ ఆదికేశవ స్వామి మరియు శ్రీ రామానుజుల వారి విగ్రహములు కొలువై వున్నవి. ఇందలి కేశవ స్వామి భక్తులు క్లేశాలని తొలగిస్తాడు అని అంటారు..
ఇక్కడ శ్రీవారు సుందరకేశపాశం కలవాడు, బ్రహ్మ రుద్రేంద్రారులకు అధిపతి.
💠 ఈ ఆలయం భక్తులకు సత్తా (అనగా ఉనికిని) కలుగజేస్తుంది. కావున దీనికి భూతపురి అని నామధేయమని వేదాంతంలో నిర్వచనం.
💠 సుమారు 250 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ ఆలయాన్ని అభినవ భూతపురి అని పిలుస్తారు, ఎందుకంటే ఇది తమిళనాడులోని భూతపురిలో ఉన్న ఆలయానికి సమానమైన శిల్పకళను కలిగి ఉంది.
💠 శ్రీ వైష్ణవ సంప్రదాయంకి చెందిన గొప్ప తత్వవేత్త అయిన శ్రీ రామానుజుల అవతార స్థలంగా ప్రసిద్ధి చెందిన తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ ఆలయ నిర్మాణాన్ని ప్రతిబింబిస్తూ శ్రీ రమణప్ప నాయుడు ఈ ఆలయాన్ని నిర్మించారు.
💠 భగవంతుని కోరిక మేరకు ఆదిశేషుడు రామానుజులుగా అవతరించి సంసార చేతనులకు సులభమైన మోక్షోపాయాన్ని ప్రసాదించారు.
💠 " ఎంబేరుమనార్లు" అనేది సాక్షాత్ భగవత్ రామానుజాచార్యులు వారికి ఉన్న ఇంకొక బిరుదు...
శ్రీవైష్ణవ ఆధారిత గ్రంథాల ప్రకారం, విశిష్టాద్వైత శాసనాల ప్రకారం భగవత్ రామానుజాచార్యులు వారు ఐదుగురు గురువుల దగ్గర శిష్యరికం చేశారు అనేది వాస్తవం.. అందులో ఒక గురువు గారి పేరు తిరు కోటియార్ నంబి.
💠 శ్రీ రామానుజాచార్యుల వారికి గురువు గా పరిగణించబడినా... శిష్యుడైన రామానుజుని జ్ఞానం, విశిష్టాద్వైత భావాలకు మంత్రముగ్ధుడైనటువంటి ఆ గురువు గారు.... స్వయానా శిష్యుడినే గురువుగా స్వీకరించి "ఎంబేరుమనార్" అనే బిరుదునిచ్చి సత్కరించి తన శిష్యుడు దగ్గరే శిష్యరికం చేసి శిష్యుడుని గురువుగా స్వీకరించి... ఇక నువ్వే నా దైవం (ఎంబేరుమనార్) అని పిలిచ్చారు...
⚜ ఆలయ చరిత్ర ⚜
💠 బ్రిటీష్ కాలంలో, బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేస్తున్న అనువాదకుడు శ్రీ ప్రసన్నగ్రేసర పుప్పాల రమణప్ప నాయుడు శ్రీమాన్ యు.వీ.ఈ. రామానుజాచార్య స్వామి వారి శ్రీరామాయణ ప్రవచనం/కాలక్షేపం హాజరయ్యారు. ప్రవచనం పూర్తయిన తర్వాత, శ్రీ రమణప్ప నాయుడు శ్రీరామానుజాచార్య స్వామికి గురుదక్షిణ ఇవ్వాలని కోరుకున్నారు మరియు స్వామి వారిని శ్రీ పెరంబుదూర్‌లోని స్వామి కోవెల పరిభాషలో నర్సాపురంలో ఆదికేశవ ఎంబెరుమానార్ స్వామి కోవెలను నిర్మించమని కోరారు.
ఆరు నెలల తర్వాత శ్రీపెరంబుదూర్ నుంచి పల్లకీలో నర్సాపురంకి కొత్త తిరుమేని తీసుకొచ్చి ఆలయంలో ప్రతిష్ఠిస్తారు.
శ్రీపెరంబుదూర్‌లోని ఎంబెరుమానార్ స్వామి సేవతో సమానంగా శ్రీ వైష్ణవులకు చెందిన కొన్ని కుటుంబాలు కూడా శ్రీపెరంబుదూర్ నుండి వలస వచ్చారు.
💠 స్వామివారి ఆలయంలో ఏప్రిల్, మే మాసాల్లో శ్రీ ఆదికేశవ స్వామి వారి బ్రహ్మోత్సవములు, శ్రీ ఎంబెరుమనారు స్వామి వారి వార్షిక తిరునక్షత్రోత్సవములు మరియు శ్రీ నమ్మాళ్ళారు ఉత్సవములు జరుగును.
💠 ఆగస్టు, సెప్టెంబరు మాసములలో శ్రీ కృష్ణ జయంతి, పవిత్రోత్సవములు, నవరాత్రులు జరుగును.
నవంబరు మాసములో శ్రీ మణ్వాళ్ మహా మునులు ఉత్సవములు, డిసెంబరు మాసములో ధనుర్మాస ఉత్సవమలు, ముక్కోటి ఏకాదశి పర్వదినము జరుగును.
💠 జనవరి మాసంలో భోగినాడు గోదా కళ్యాణము, పగల్పత్ ఉత్సవములు, రాపత్తు ఉత్సవములు జరుగును.
మార్చిలో శ్రీయతి రాజవల్లి తాయర్లకు మీనొత్తర కళ్యాణము మరియు గురుపుష్య ఉత్సవములు అతి వైభవంగా జరుగును.
💠 స్వామి వారికి ప్రతి నిత్యము అష్టోత్తర శతనామార్చన పూజలు జరుగును.
ప్రతి నిత్యం ఉదయం, సాయంత్రం భక్తులకు ఉచిత ప్రసాదమును పంచి పెట్టుట అనాదిగా ఈ ఆలయ ఆచారమైయున్నది. మరియు విశేషముల యందు అనగా ఏకాదశి, ఆరుద్ర దశమి, పుబ్బ, ఉత్తర, మూల మొదలగు మాస నక్షత్రములలో ప్రసాదం పంచిపెట్టుట జరుగును.
💠 ఆలయ సమయాలు :
ఉదయం 6.00 నుండి రాత్రి 8:00 వరకు
💠 పాలకొల్లు - 10 కి.మీ, భీమవరం - 33 కి.మీ.
No comments:
Post a Comment