Adsense

Saturday, May 6, 2023

శ్రీ జోగుళాంబ ఆలయం -శక్తి పీఠం

మహబూబ్ నగర్ జిల్లా, అలంపూర్‌
శ్రీ జోగుళాంబ ఆలయం -శక్తి పీఠం

*లంబస్తనీం వికృతాక్షీం*
*ఘోరరూపాం మహాబలాం*
*ప్రేతాసన సమారూడాం*
*జోగులాంబాం నమామ్యహమ్'*🙏

(పెద్ద పాలిండ్లు కలిగి, వికృతమైన కన్నులతో, ఘోరమైన రూపంతో, మహాబలశాలియై, శవంమీద కూర్చొని ఉన్న జోగులాంబను ధ్యానిస్తున్నాను)

💠 శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకం. ఆదిశక్తిగా, పరాశక్తిగా, జగన్మాతగా, లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి. శక్తికి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు అష్టాదశ శక్తి పీఠాలు. మహామహిమాన్వితమైన ఆ శక్తిపీఠాల్లో ఒకటి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్. జోగులాంబ ఇక్కడ కొలువైన అమ్మవారు భక్తులకు దర్శనిమస్తుంటారు.ఈ గ్రామం పేరు హలంపుర, హతంపురంగా ఉండగా కాలక్రమంలో అలంపూర్ పేరువచ్చింది.

💠 విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని పద్దెనిమిది ఖండాలుగా విభజించాడట. ఆ పద్దెనిమిది భాగాలు వేర్వేరు ప్రాంతాల్లో పడ్డాయని, వాటిని ఆది శంకరాచార్యులు పద్దెనిమిది పీఠాలుగా గుర్తించి ప్రాణ ప్రతిష్ఠ చేశాడని చెబుతారు. ఇందులో దంత పంక్తి భాగం అలంపూర్‌లో పడ్డట్లు, దాంతో ఇక్కడ జోగులమ్మ వారు వెలసినట్లు పురాణాల ద్వారా తెలుస్తున్నది.

💠 ఉత్తర భారతంలోని కాశీ విశ్వేశ్వరుని దర్శిస్తే ఎంతటి పుణ్యఫలం దక్కుతుందో అలంపూర్‌లోని ‘బాల బ్రహ్మేశ్వరున్ని దర్శించినా అంతే మహా పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. . కాశీలో 64 స్నాన ఘట్టాలు (మణి కర్ణిక) ఉండగా, అలంపూర్‌లో 64 స్నాన ఘట్టాలున్నాయి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కాశీ విశాలాక్షి అమ్మావారు అక్కడ వెలిస్తే అయిదవ శక్తి పీఠంగా జోగులాంబ అమ్మవారు వెలిశారు.

💠 కాశీక్షేత్రంలో ఉత్తర వాహిని గంగానది, అలాగే అలంపురంలో ఉత్తర వాహిని తుంగభద్ర. కాశీకి అటు, ఇటు వరుణ, అసి నదులున్నాయి. అదే విధంగా అలంపురానికి వేదవతి, నాగావళీ నదులున్నాయి.  కాశీ అధిదేవతలు విశాలాక్షీ, విశ్వేశ్వరుడు. అలంపురానికి అధిదేవతలు జోగులాంబా, బాలబ్రహ్మేశ్వరుడు. ఈ అలంపురం శక్తిక్షేత్రం శ్రీశైలానికి పశ్చిమ ద్వారమై వెలసింది. కావున ఈ అలంపురాన్ని “దక్షిణ కాశి” అంటారు.

💠 అలంపురం శక్తి జోగులాంబా, బాలబ్రహ్మేశ్వరాలయాలకు అటూ ఇటూ కుమార బ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, తారకబ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ అనే నవబ్రహ్మ ఆకారాలు లింగ రూపంలోనే ఉంటాయి. బాలబ్రహ్మేశ్వరుని తలపై మాత్రం చిన్నచిన్న గుంటలుంటాయి.
ఈ లింగం చుట్టూ నారాయణ సాలగ్రామాలుంటాయి. ఈ బాలబ్రహ్మేశ్వర లింగంపై ఎన్ని నీళ్లు పోసినా ఆ నీళ్లు ఎటు పోతాయో తెలియదు.

No comments: